-north-america-to-hostage-FIFA-world-cup-2026

1994 తర్వాత అమెరికాలో తొలిసారిగా ‘ఫిఫా వరల్డ్ కప్’

మాస్కో: రష్యా వేదికగా జూన్ 14 నుంచి జరగనున్న ‘ఫిఫా వరల్డ్ కప్ 2018’ మరికొన్ని గంటల్లో ప్రారంభమవ్వనుంది. మ్యాచ్‌లను ఆస్వాధించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ లవర్స్ ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అయితే ‘ఫిఫా వరల్డ్ కప్ 2018’ ప్రారంభం కానున్న ఒక రోజు ముందు అమెరికన్ ఫుట్‌బాల్ అభిమానులను మరింత ఆనందానికి గురి చేసే ఒక ప్రకటన వెలువడింది. అమెరికా వేదికగా మరోసారి ఫిఫా వరల్డ్ కప్ అలరించనుండడమే వారి ఆనందానికి కారణమైంది. ‘ ఫిఫా వరల్డ్ కప్ 2026’కు అగ్రరాజ్యం అమెరికాతోపాటు మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా అతిథ్యమివ్వనున్నాయి. మాస్కోలో సమావేశమైన ‘ఫిఫా కాంగ్రెస్’ బిడ్ ఓటింగ్ నిర్వహించిన అనంతరం ఈ విషయాన్ని ప్రకటించింది. అమెరికా కూటమికి 134 ఓట్ల దక్కాయని, మొరాకోకు 65 ఓట్లు వచ్చాయని నిర్వాహకులు వెల్లడించారు. మొత్తం 80 మ్యాచుల్లో అమెరికాలో 60 మ్యాచ్‌లు జరిగేవిధంగా బిడ్‌లో పేర్కొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రకటన గురించి తెలిసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. మెక్సికో, కెనడాలతో కలిసి ఫిఫా వరల్డ్ కప్ నిర్వహించనుండడం సంతోషకరమని ఆయన ట్వీట్ చేశారు. ఇదిలావుండగా ‘ ఫిఫా వరల్డ్ కప్ 2022’ ఖతర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. 2026లో అమెరికాలో ఫిఫా వరల్డ్ కప్ జరగనుండడంతో ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూసే అవకాశం ఉండడంతో అమెరికన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1994 తర్వాత ఫిఫా వరల్డ్ కప్‌కు అమెరికా అతిథ్యమివ్వడం ఇదే తొలిసారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.