:: Welcome to NRI - Article ::

ట్రంప్ ఎడారి యాత్ర

ఆంధ్రజ్యోతి, 24-05-2017:సున్నీ - షియా వివాదాలకు నెలవైన మధ్యప్రాచ్యంలో, సౌదీ అరేబియా నాయకత్వం లోని సున్నీ తెగలకు ప్రాధాన్యమిచ్చే అమెరికా సంప్రదాయ విదేశాంగ విధానాన్ని డొనాల్డ్‌ ట్రంప్‌ పునరుద్ధరించారు. షియా ఇరాన్‌తో ఒబామా స్నేహ సంబంధాలను నెలకొల్పుకోవడమే కాకుండా ఇరాన్‌ అణు కార్యక్రమంపై ఆంక్షలను కూడా తొలగించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక ప్రయోజనాలకే పెద్దపీట వేసి, సున్నీల వైపే ట్రంప్‌ మొగ్గు చూపారని చెప్పవచ్చు.

 
అధికారంలోకి రాక ముందు, వచ్చిన తర్వాత పాలనాపరమైన అంశాల్లో ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేయడంలో నాయకుల మధ్య స్పష్టమైన తేడా ఉంటుంది. ఇందుకు తెలుగు రాష్ట్రాలు మొదలు అగ్రరాజ్యమైన అమెరికా వరకు ఎవరూ అతీతులు కారు. ఒక వింత జాతీయవాదానికి తోడుగా ప్రధానంగా ముస్లిం వ్యతిరేక భావాన్ని రెచ్చగొట్టి అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తన ప్రప్రథమ అధికారిక విదేశీ పర్యటనకు ఇస్లాం పుట్టినిల్లయిన సౌదీ అరేబియాను ఎంచుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కలిగించింది. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్‌ తన దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా సౌదీని ఎంచుకోగా, ఒబామా హయాంలో దారి తప్పిన అమెరికా – గల్ఫ్ దేశాల మైత్రిని గాడిలో పెట్టడం ద్వారా అమెరికా అధ్యక్షుని సందర్శనను తన వైరి వర్గాలకు ఒక హెచ్చరిక పంపేందుకు సౌదీ రాజు సల్మాన్ ఉపయోగించుకున్నారు. రాజు సల్మాన్, ఆయన కుటుంబ సభ్యులతో సమావేశమైన తర్వాత మిగతా ఐదు గల్ఫ్ దేశాల రాజ కుటుంబాలతో కూడా ట్రంప్ సమావేశమై మధ్యప్రాచ్యంలో కీలకమైన గల్ఫ్ ప్రాంతంలో తన ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసారు. ఇదే సందర్భంగా సౌదీ అరేబియా రాజు ప్రపంచవ్యాప్తంగా 50 ముస్లిం దేశాల అధినేతలతో శిఖరాగ్ర సదస్సును నిర్వహించి పెచ్చరిల్లుతున్న ఉగ్రవాద మూకలను సమూలంగా నిర్మూలించడానికి చేపట్టవల్సిన చర్యల గూర్చి వివరించారు.
 
ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించవల్సిన అంశం ఏమిటంటే వివాదస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన ట్రంప్ తన సౌదీ పర్యటనలో చాలా ఆచితూచి ప్రసంగించారు. చాలా వ్యూహత్మకంగా వ్యవహరించారు. ‘మీ ఆచార వ్యవహారాలు, జీవన విధానంలో జోక్యం చేసుకోవడానికి గానీ, సంస్కరణల వైపు హితబోధన చేయడానికి గానీ తాను ఇక్కడకు రాలేదని’ చెప్పడం ద్వారా ట్రంప్ ముస్లిం దేశాల అధినేతల మనస్సును దోచుకోవడానికి ప్రయత్నించారు. జార్జి బుష్ తరహాలో అన్నీ తానై వ్యవహరించకుండా పెరిగిపోతున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయమై ఏ విధంగా మనమందరం కలిసి పోరాడుదాం అని అడగడం ద్వారా ఆయన పరిణతి చెందిన అంతర్జాతీయ నాయకుడిగా వ్యవహరించారు. అమెరికా అధ్యక్షుని సతీమణి మెలనియా, సాధారణంగా అమెరికన్, పాశ్చాత్య దేశాల మహిళల తరహాలో కాకుండా అరబ్బు దేశాలలోని మహిళలు ధరించే విధంగా నిండు దుస్తులను ధరించి మరీ ఎడారి గడ్డపై అడుగు పెట్టారు. బురఖాను మైమరిపించే విధంగా నల్లటి నిండు డ్రెస్‌ను వేసుకొని ఆమె విమానం నుంచి దిగిన వైనాన్ని అరబ్‌ పత్రికలు విశేషంగా ప్రచురించాయి. రాజు సల్మాన్ ఇచ్చిన విందులో పాల్గొన్న ట్రంప్ అరబ్బు సంప్రదాయ రీతిలో కత్తి పట్టుకొని నృత్యం చేసారు, ఖర్జూరపు పళ్ళు తిన్నారు. అరబ్బీ కాఫీ కూడా తాగారు. ప్రవక్త మహమ్మద్‌ సాధారణంగా కుడి చేత్తో తినేవారు. ముస్లింలు దీన్ని సున్నత్ సంప్రదాయంగా అమలు చేస్తారు. సౌదీ రాజు విందులో ట్రంప్ తన ఎడమ చేతితో తినే ప్రయత్నం చేయగా రాజు సల్మాన్ కుడి చేతితో తినాలని సూచించగా అమెరికా అధ్యక్షుడు ఆ సూచనను గౌరవంగా పాటించారు. ఆ విశేషానికి సామాజిక మాధ్యమాలలో అమిత ప్రాధాన్యం లభిస్తోంది.
 
సంక్లిష్టమైన సున్నీ–షియా వివాదాలకు నెలవైన మధ్యప్రాచ్యంలో, సౌదీ అరేబియా నాయకత్వంలోని సున్నీతెగలకు ప్రాధాన్యమిచ్చే అమెరికా సంప్రదాయ విదేశాంగ విధానాన్ని ట్రంప్‌ పునరుద్ధరించారు. షియా ఇరాన్‌తో ఒబామా స్నేహ సంబంధాలను నెలకొల్పుకున్న విషయం విదితమే. ఇరాన్‌ అణు కార్యక్రమంపై ఆంక్షలను కూడా ఆయన తొలగించారు. ఈ నేపథ్యంలో సున్నీ–షియా వివాదం కంటే ఆర్థిక ప్రయోజనాలకే ట్రంప్ పెద్ద పీట వేశారు. సున్నీల వైపే ఆయన మొగ్గు చూపారని చెప్పవచ్చు. సౌదీ అరేబియాతో సుమారు 300 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఆయుధ, వాణిజ్య ఒప్పందాలను ట్రంప్‌ కుదుర్చుకున్నారు. తద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్ధను తాను బలోపేతం చేస్తున్నట్లు ఆయన తన దేశస్థులకు సందేశం పంపారు.
 
గల్ఫ్ దేశాలలో ప్రభుత్వాలు, పాలనా వ్యవహారాలు పూర్తిగా కుటుంబాల వ్యవహారం. రాజులు, వారి కుటుంబ సభ్యులే ప్రభుత్వ విధానాలను రూపొందించడం పరిపాటి. అమెరికాలో ఇప్పుడు ట్రంప్ కుటుంబసభ్యులు పాలనా వ్యవహారాలలో పాలుపంచుకొంటున్నారు. ట్రంప్‌ అల్లుడు కుష్నర్ తన మామగారికి అధికారిక సలహాదారుడు. అలాగే భార్య మెలనియా, ఇంకా ఇతర కుమార్తెలు, కుమారులు కూడా ట్రంప్‌కు పాలనా వ్యవహారాలలో సహాయపడుతున్నట్లుగా తెలుస్తోంది. సౌదీ అరేబియా రాజు సల్మాన్ తనయుడు, యువరాజు అయిన మోహమ్మద్ బిన్ సల్మాన్, ట్రంప్ అల్లుడు కుష్నర్‌లు సన్నిహిత స్నేహితులు కావడంతో ట్రంప్ పర్యటనకు వారే రూపకల్పన చేసారు.
మొహమ్మద్ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి