Special-article-about-World-Telugu-Summit-in-the-view-of-Gulf-Expats

దూరం నుండి తెలుగు మహాసభలు

పొట్ట కూటి కొరకు బయటకు అందునా మన భాష కాని ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక్క మాతృభాషే కాదు క్రమేణా సంస్కృతి, అస్తిత్వాన్ని కూడా కోల్పోవడం జరుగుతుంది. అందుకే గత మూడు తరాల్లో సుమారు 200 భాషలు ప్రపంచం నుండి కనుమరుగవగా ప్రస్తుతం వాడుకలో ఉన్న 6000 భాషల్లో సగం వరకు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. బతుకుదెరువు కొరకు పనికివచ్చే పరాయి భాష ఆ తర్వాత మనలను మన తరాలను మన భాషతో పూర్తిగా పరాయిగా చేస్తుంది. దీనికితోడు ప్రపంచీకరణ, ఉపాధి వలసలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ప్రాంతీయ భాషలు, ప్రత్యేకించి తెలుగు మనుగడ ప్రశ్నార్థకం కానుంది.

 
దేశంబైట పెద్ద సంఖ్యలో భారతీయులు నివసిస్తున్న, పనిచేస్తున్న ప్రాంతం గల్ఫ్. ఇక్కడ మొత్తం 75లక్షల మందికి పైగా భారతీయులు, అందులో ద్రావిడ భాష మూలాలు కల్గిన దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు అత్యధికులు ఉన్నారు. గల్ఫ్ దేశాలలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీయస్ఈకి అనుబంధంగా 123 భారతీయ పాఠశాలలు ‍ఉండగా ఇందులో అత్యధిక పాఠశాలల్లో మలయాళం ఒక బోధన భాషగా ఉండడం విశేషం. ఉపాధి, వ్యాపార రీత్యా తాము ఎడారి దేశంలో ఉన్నప్పటికీ మలయాళం బోధించడం ద్వారా తమ భావి తరాలను తమ భాష, సంస్కృతితో అనుసంధానం చేయడం జరిగింది. గల్ఫ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులలో మలయాళీల తర్వాతి స్థానంలో తెలుగు ప్రవా సులు, అందునా ప్రత్యేకించి హైదరాబాద్, తెలంగాణకు చెందిన వారు ఉన్నప్పటికీ మన వాళ్ళు మాత్రం తెలుగును చదవడానికి అనాసక్తి ప్రదర్శిస్తారు. మన సంఖ్యకు తగినట్లుగా తెలుగు భాషను ఎంచుకొంటున్న విద్యార్థుల సంఖ్య లేకపోవడం దురదృష్టకరం.
 
తెలుగు వలన ప్రయోజనం ఏముంది అంటూ తల్లిదండ్రులు కూడా ఈ విషయమై చొరవ తీసుకోరు. దీంతో మనం మన భాష, సంస్కృతులకు దూరంగా వెళ్ళిపోతున్నాం. జెద్ధాలో సుమారు 7వేల మంది విద్యార్థులు చదివే ఒక పాఠశాలలో ప్రయత్నం చేసి నేను తెలుగు భాషను ప్రవేశపెడితే కొందరు నన్ను ‘కాఫీర్’ అని హేళన చేసినా ఈ రోజు కొన్ని వందల మంది తెలుగును అభ్యసిస్తుండం నాకు గర్వంగా ఉంది. సౌదీ అరేబియా గడ్డపై సీబీయస్ఈలో తెలుగును సబ్జెక్టుగా చదివిన నా పిల్లలకు నా సొంత గడ్డలో మాత్రం తెలుగు చదివే ఆవకాశం లేకపోవడం బాధగా ఉంది.
 
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. అందులో స్వదేశానికి తిరిగి వచ్చే ప్రవాసుల పిల్లలు తెలుగును ఎంచుకొనే విధంగా ప్రోత్సాహకర చర్యల గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది. దమ్మాం, కువైత్, అబుధాబిలలో కొందరు ఔత్సాహిక తెలంగాణ రచయితలు ఉన్నారు. ప్రస్తుత బీ‍సీ కమిషన్ అధ్యక్షులు బి.యస్. రాములు ప్రోత్సాహంతో కొందరు యువ రచయితలు తమ ఎడారి గాథలకు అక్షర రూపం ఇవ్వడం జరిగింది. ఈ రకమైన తెలుగు సాహితీ కార్యక్రమాలకు చేయూతనివ్వాలి. కంప్యూటర్ల వాడకం మొదలైన కొత్తలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా ఐలీప్ అనే తెలుగు సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకొనే సౌకర్యం కల్పించి విదేశాల్లో తెలుగుకు ప్రాణం పోసారు. ఇప్పడు పెరిగిపోయిన సోషల్ మీడియా ద్వారా కూడా తెలుగు భాష యాప్ మొదలగు చర్యలకు శ్రీకారం చుట్టాలి.
 
ఇప్పటికీ తెలుగు టైపింగ్ అనేక మందికి ఒక సమస్యగా ఉంది. దీన్ని అధిగమించే దిశగా కూడా యువత నెటిజన్లకు సహకరించాలి. ఇక తెలుగు మహాసభల విషయాని వస్తే, పది లక్షల మంది తెలంగాణ ప్రవాసులు ఉంటున్న గల్ఫ్ దేశాలను కాదని సంఖ్యాపరంగా స్వల్ప సంఖ్యలో ఉన్న యూరోపియన్ నగరాల్లో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సులను నిర్వహించారు. చివరకు మొక్కుబడిగా దుబాయిలో కూడ ఒక సన్నాహక సమావేశం జరిపామన్నట్లుగా చేసారు. స్థానికంగా ఉన్న ఒకరిద్దరు తెలంగాణ రచయితలకు, లేదా తెలుగు సాహితీవేత్తలకు దీని గురించి సమాచారం లేదు. సీబీయస్ఈ పాఠశాలలో మలయాళం తరహాలో తెలుగును పాఠ్యాంశంగా విస్తరించాల్సిన ఆవశ్యకత, భావి తరాలకు భాష అందించడం తదితరాల గురించి ఏ రకమైన ఆరోగ్యవంతమైన చర్చ జరుగలేదు. సమయలేమి కారణాన విదేశాల్లో అందర్నీ ఆహ్వనించలేకపోయామని, అయినా భాషాభిమానులు అందరూ రావాలని నిర్వాహకులు చెబుతున్నారు.
 
అయిదు రోజులు జరిగే తెలుగు మహాసభల్లో మరుగునపడ్డ తెలంగాణ కవులు, రచయితలు, సాహిత్య స్రష్టలను వెలుగులోకి తేవడంతో పాటు భావితరాల్లో తెలుగును ఏ విధంగా వ్యాపింపజేయాలనే ఆంశంపై కూడా సమగ్ర చర్చ జరగాలి.
మొహమ్మద్ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి