Special-article-about-Diplomat-in-Gulf-countries

దౌత్యవేత్తగా దోవల్‌

కేంద్ర ప్రభుత్వ అధికార విధానాలు, మంత్రుల బాధ్యతలలో అప్రకటితంగా గణనీయమైన మార్పులు వచ్చాయనే విషయం అందరికీ తెలుసు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొంటున్న అనేక కీలకనిర్ణయాలు ప్రత్యేకించి రక్షణ, భద్రత, విదేశీ వ్యవహారాలలో సంబంధిత శాఖల మంత్రులకంటే ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)కే ఎక్కువ ప్రమేయముంటుందనేది ఒక బహిరంగ రహస్యం. నిజానికి ప్రతి మంత్రిత్వ శాఖ వ్యవహారాలలోనూ సంబంధిత మంత్రి నిర్ణయాలను పీఎంఓనే నిర్దేశిస్తుందని చెబుతారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను, ఏ ప్రభుత్వమైనా అత్యంత కీలక శాఖగా భావిస్తుంది. అంతర్జాతీయంగా దేశప్రతిష్ఠ ఇనుపడింపచేసే బాధ్యత ఈ మంత్రిత్వ శాఖపై ఉన్నది. ప్రభుత్వాధినేతలు సహజంగానే ఈ మంత్రిత్వ శాఖ బాధ్యతలను పాలనా దక్షులు, రాజకీయ దురంధరులు, అత్యంత విశ్వాసపాత్రులైన వారికి మాత్రమే అప్పగించడం పరిపాటి. అంతర్జాతీయ వ్యవహారాలపై సమగ్ర అవగాహన ఉన్న వారిని మాత్రమే విదేశీ వ్యవహారాల మంత్రిగా నియమించడం జరుగుతుంది.

 
సుష్మాస్వరాజ్ ప్రస్తుతం మన విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఆమె విద్యాధికురాలు. అంతేగాక బీజేపీలో అగ్ర శ్రేణి నాయకురాలు. ఏ బాధ్యతలనైనా సమర్థంగా నిర్వర్తించగల కార్యదక్షురాలు. అయితే మన విదేశీ వ్యవహారాలు ప్రస్తుతం సుష్మా స్వరాజ్‌ అజమాయిషీలో లేవనేది ఒక వాస్తవం. కారణాలేమైనాసౌత్‌ బ్లాక్‌ (మన విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ నెలవు)లో ఆమె ఒక ఉత్సవ విగ్రహంగా మాత్రమే ఉన్నారు. ప్రవాస భారతీయులు, ప్రత్యేకించి గల్ఫ్ దేశాలలోని సామాన్య ప్రవాస భారతీయ కార్మికులు పంపే ట్విట్టర్‌ సందేశాలకు స్పందించడానికి మాత్రమే ఉన్నారా అన్నట్లుగా సుష్మా స్వరాజ్‌ పరిస్థితి ఉన్నది.
 
విదేశాంగశాఖ కార్యదర్శి నియామకం కాన్వివండి, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మన రాయబారులు లేదా హై కమిషనర్ల నియామకాలు కాన్వివండి విదేశీ వ్యవహారాల మంత్రి నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి వుంటాయి. అటువంటిది, ఈ కీలక నియామకాల విషయంలో సుష్మా స్వరాజ్ పాత్ర నిమిత్త మాత్రంగానే ఉంటుంది! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రికార్డు స్థాయిలో విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ప్రధాని విదేశీ పర్యటనలలో విదేశాంగ మంత్రి కూడా ఉండడం ఒక ఆనవాయితీ. మరి మోదీ విదేశీ పర్యటనల్లో సుష్మా స్వరాజ్‌ ఎక్కడా కనిపించరు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కీలకమైన నిర్ణయాలన్నీ ప్రధానమంత్రి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తీసుకొంటున్నారు. ప్రధానమంత్రి విదేశీ పర్యటనల సందర్భంగా సంబంధితదేశాల ప్రభుత్వాధినేతలతో ప్రధాని జరిపే చర్చలలో అజిత్‌ దోవల్‌ చురుగ్గా పాల్గొంటున్నారు. కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోదీ దూతగా అజిత్‌ దోవలే తరచూ గల్ఫ్‌ దేశాల రాజులతో సమావేశమవుతున్నారు.
 
అమెరికా, చైనా, పాకిస్థాన్‌ మొదలైన కీలక దేశాల్లో భారత రాయబారులు, ఇతర దౌత్యాధికారుల నియామకంలో కూడా దోవల్‌ పాత్ర స్పష్టంగా ఉంటోంది. అజిత్ దోవల్ అభీష్టం మేరకే సౌదీ అరేబియాలో భారతీయ రాయబారిగా ముంబాయి పోలీసు కమిషనర్ జావేద్ అహ్మద్‌ను నియమించారు. అంతకు ముందు హర్యానాలో సౌదీ దౌత్యవేత్త ఇంటిపై దాడిచేసి నేపాల్‌కు చెందిన పని మనిషిని పోలీసులు రక్షించడంపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడంలో కూడా దోవల్‌ కీలక పాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగానే గుర్గాం పోలీసు కమిషనర్ నవదీప్ సింగ్ విర్క్‌ను సెలవుపై పంపారు. సౌదీ అధికారులకు ఎలాంటి అసంతృప్తి లేకుండా పరిస్థితిని చక్కదిద్దారు. హర్యానా ముఖ్యమంత్రి, విదేశాంగ మంత్రితో ఎలాంటి సంబంధం లేకుండా అజిత్ దోవల్ సౌదీ దౌత్యవేత్త కేసును డీల్ చేసారని చెబుతారు. ఆబుధాబిలో యువరాజు షేక్ మొహమ్మద్ మొదలు లండన్‌లో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, లాహోర్లో ప్రధాని నవాజ్ షరీఫ్‌లతో సమావేశాల వరకు ప్రతి చోట ప్రధాని మోదీ పక్కనే ఉన్న మనిషి అజిత్ దోవల్.
 
సుదీర్ఘ కాలం నిఘా సంస్థల్లో పనిచేసిన అజిత్ దోవల్ ఉత్తరాఖండ్‌కు చెందినవారు. నికార్సైన జాతీయవాది. జాతీయ భద్రత విషయాలపై స్పష్టమైన, సమగ్రమైన అవగాహన ఉన్న మాజీ ఐపీఎస్‌ అధికారి. పంజాబ్, ఈశాన్య భారత రాష్ట్రాలు, నక్సలైట్లు, ఇస్లామిక్ ఉగ్రవాదులు మొదలైన సున్నితమైన వ్యవహారాల్లో అనుభవం ఉన్న దోవల్‌ ఎలాంటి ప్రచారం, అర్భాటం లేకుండా సాదాసీదాగా ఉంటారు. అతి తక్కువగా మాట్లాడతారు. సాధారణంగా మంత్రులతో కూడా మాట్లాడని దోవల్‌ ప్రధానమంత్రి కార్యాలయంలో అత్యంత కీలక వ్యక్తుల్లో ఒకరుగా ఉన్నారు. ఇస్లామాబాద్‌లోని మన రాయబారి కార్యాలయంలో కూడా అజిత్ దోవల్ కొంతకాలం పనిచేసారు. ఆయన సహచరుడయిన మాజీ పోలీస్ అధికారి, తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.యస్.యల్ నరసింహన్‌ కూడా రష్యాలోని భారతీయ ఎంబసీలో పనిచేసారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌, అజిత్ దోవల్ ఇద్దరూ కూడా దేశ అంతర్గత భద్రత వ్యవహారాలు, విధానాలలో పరోక్షంగా కీలక పాత్ర వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ వద్ద కేంద్రమంత్రుల కంటే కూడా ఎక్కువగా పలుకుబడి ఉన్న వ్యక్తిగా అజిత్ దోవల్‌ను చెబుతారు.
మొహమ్మద్ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి