Special-article-about-blind-cricket-cup-in-UAE

దివ్యాంగ విజేతలకు దక్కని ఆదరణ

తెలుగు ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఉన్న దేశంలో తెలుగు ఆటగాడి సారథ్యంలో ఆడిన అంధుల క్రికెట్‌ జట్టు పాకిస్థాన్‌ను ఓడించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నా సంబరాల సందడి కరువయింది. ఫేస్ బుక్‌లో ‘లైకు’లు చేసే మన సమాజం ఫేస్ టూ ఫేస్ అభినందించేందుకు ముందుకు రాలేకపోయింది.

 
సామాన్యులు అంతగా ఆసక్తి చూపని క్రీడలలో ప్రఖ్యాతులైన భారతీయ క్రీడాకారులు, అందునా ఆకర్షణీయమైన చూపులు ఉన్నవారు విదేశాలకు వచ్చినప్పుడు వారిని కలవడానికి ప్రవాస భారతీయులు అనేకమంది పోటీపడతారు. ‘మీ వల్ల మన భారతదేశ ప్రతిష్ఠ ఇనుమడించిందని’ వారిని కీర్తిస్తారు. ఆట, పాట అర్థం కాకపోయినా అవతలి వ్యక్తులు ఆకర్షణీయంగా ఉండి, పేరున్నవారయితే వారికి బ్రహ్మరథం పడతారు. వారి అభిరుచులను ఆదరించి, అనుసరిస్తారు. అయితే, దివ్యాంగులైన క్రికెట్‌ క్రీడాకారులు మాత్రం ఇటువంటి ఆదరాభిమానాలకు ఎందుకనో నోచులేకపోతున్నారు. ఇటీవల యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లో నరాలు తెగిపడేంత ఉత్కంఠ భరితంగా జరిగిన ప్రపంచ అంధుల క్రికెట్ కప్ పోటీలలో మన క్రీడాకారులు ప్రపంచ కప్‌ గెలుచుకున్నారు. అయినా వారికి ఆదరణ, ప్రోత్సాహం కరవయ్యింది. పెద్ద సంఖ్యలో తెలుగు ప్రవాసులు ఉన్న దేశంలో తెలుగు ఆటగాడి సారథ్యంలో ఆడిన జట్టు పాకిస్థాన్‌ను ఓడించి ప్రపంచ కప్ కైవసం చేసుకున్నా సంబరాల సందడి కరువయింది. ఫేస్ బుక్‌లో లైకులు చేసే మన సమాజం ఫేస్ టూ ఫేస్ అభినందించేందుకు ముందుకు రాలేకపోయింది.
 
క్రికెట్ రంగంలో అంధులు క్రియాశీలకంగా ఉన్న దేశాలలో భారత్ అగ్ర స్థానంలో ఉన్నది. అయినా, అద్భుత ఆటగాళ్లయిన సాటి అంధ క్రీడాకారుల పట్ల సాధారణ క్రికెట్ దిగ్గజాలకుగానీ, క్రికెట్‌ అభిమానులకు గానీ కనీస గౌరవాభిమానాలు లేవు. తమకు ఎలాంటి ఆదరణ, ప్రోత్సాహం లేకున్నా భారతీయ అంధ క్రికెట్ క్రీడాకారులు అంతర్జాతీయంగా రాణిస్తున్నారు. భారతదేశ ప్రతిష్ఠను ప్రపంచ స్థాయిలో నిలబెడుతున్నారు. కఠోర పరిశ్రమతో అద్భుతమైన విజయాలు సాధించి సకలాంగులకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నారు. క్రికెట్ ఆటగాళ్లను భూమి మీది దేవుళ్ల లెక్క ఆరాధించే భారతీయులు ఈ అంధ క్రీడాకారుల పట్ల చూపిన నిరాదరణకు పోటీలలో పాల్గొన్న విదేశీ అంధ క్రీడాకారులు సైతం చిన్నబుచ్చుకున్నారు.
 
అంతర్జాతీయంగా అంధుల క్రికెట్ పోటీలలో పాకిస్థాన్‌కి భారత్‌ మొదటి నుంచీ గట్టి పోటీనిస్తోంది. 2014లో ప్రపంచకప్‌ను సాధించిన భారత జట్టు, ఇప్పటి వరకు అయిదు సార్లు పాకిస్థాన్‌ను ఓడించింది. అయిదవ ప్రపంచ కప్ పోటీలు పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జరగాల్సి ఉండగా, మన జట్టును అక్కడికి పంపేందుకు మన ప్రభుత్వం అంగీకరించకపోవడంతో వేదికను యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌కు మార్చి షార్జా, ఆజ్మాన్‌లలో పోటీలను నిర్వహించారు. శ్రీలంకను ఓడించి పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ను ఓడించి భారత్ తుదిపోరుకు చేరుకున్నాయి. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలలో భారత జట్టు అద్భుతంగా ఆడి ఘన విజయం సాధించింది. రెండు వికెట్ల తేడాతో ప్రపంచ కప్‌ను కైవశం చేసుకొంది. 309 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 38.2 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.
 
గుంటూరు జిల్లాకు చెందిన కెప్టెన్ అజయ్‌ కుమార్‌ రెడ్డి సారథ్యంలో 17 మందితో కూడిన భారతీయ జట్టు ప్రపంచ అంధుల క్రికెట్ కప్ పోటీలలో పాల్గొంది. జట్టులోని 17 మందిలో 12 మంది నిరుపేద యువకులు కావడం గమనార్హం. కంటి చూపు లేకున్నా, బంతి లోపల ప్రత్యేకంగా ఉండే ఇనుప ఛర్రల శబ్ద సహాయంతో బ్యాటింగ్ చేయడంలో ప్రపంచంలోనే తమకుతామే సాటి అనిపించుకున్నారు. తండ్రి కూలి పని చేస్తే తప్ప ఇల్లు గడవని కుటుంబం నుంచి వచ్చిన కర్ణాటకలోని బళ్ళారి జిల్లాకు చెందిన కన్నడ బిడ్డ సునీల్ రమేష్ తన 93 రన్లతో భారత్ జట్టుకు విజయం సాధించి పెట్టారు.
 
గత యాభై సంవత్సరాలుగా దుబాయిలో నివాసముంటున్న ప్రవాస భారతీయ ప్రముఖుడు, క్రికెట్ అభిమాని శ్యాం భాటియా భారత్ గెలిచిందని భారతీయ దౌత్యవేత్తలకు సమాచారమందించడంతో కాన్సుల్ జనరల్ విఫుల్ స్టేడియంకు వచ్చి విజేతలను అభినందించారు. ఆ తర్వాత ప్రధాని, రాష్ట్రపతులు శుభాకాంక్షలు తెలుపడంతో మన గెలుపు వార్త గల్ఫ్‌ మీడియాలో హైలెట్‌ అయింది. భారత కాన్సుల్ జనరల్ ఇచ్చిన విందులో అంధుల జట్టుకు శ్యాం భాటియా తన వద్దనున్న సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లేల ఆటోగ్రాఫ్‌లతో కూడిన బ్యాట్, బంతులను బహూకరించారు.
 
శ్యాం భాటియా సహృదయత అభినందనీయమే గానీ ఈ క్రికెట్ విజేతలకు కావల్సింది ఆటోగ్రాఫ్ బహుమానం కాదు, అభిమానుల జేజేలు! దురదృష్టవశాత్తు ఈ విషయంలో ప్రవాస భారతీయులు విఫలమయ్యారు. ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. కర్నూలుకు చెందిన ఒక ప్రవాస వ్యాపారవేత్త గల్ఫ్‌ క్రికెట్‌లో ప్రముఖుడు. భారతీయ జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు క్రీడకారులు ఉన్నా, ఆయన ఎక్కడా కనిపించలేదు. ఈ అంధ విజేతల పట్ల తెలుగు ప్రవాస సమాజం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం బాధను కల్గించింది.
మొహమ్మద్ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి