Sivasankar-Helps-NRIs-in-Gulf-countries

మార్గదర్శకుడు శివశంకర్

ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలకు విశ్వసనీయ సలహాదారులలో ఒకరైన శివశంకర్ తన రాజకీయ ప్రస్థానంలో అనేక మంది వెనుకబడిన వర్గాలకు చెందిన యువకులకు రాజకీయ భిక్ష పెట్టారు. వారందరూ ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలో కీలకమైన నేతలుగా ఎదిగారు. ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శనం చేసిన శివశంకర్ నిన్నటి తరానికి చెందిన మేధావి, నాయకుడు. కొన్ని విలువలకు కట్టుబడ్డ వ్యక్తి. ఆయన మృతి వెనుకబడిన వర్గాలకు పెద్ద లోటు.

 
 
కేంద్రంలోని కొన్ని కీలక పదవులలో విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒకటి. సాధారణంగా పార్టీలో సీనియర్లు, ప్రధానికి సన్నిహితులుగా ఉన్న వారు మాత్రమే ఈ పదవిలో కొనసాగడం జరుగుతుంది. స్వతంత్ర భారతంలో తొలి భారత ప్రధాని ఈ పదవిని ఇతరులు ఎవరికి ఇవ్వకుండా తన వద్ద ఉంచుకొన్నారు. ఈ ముఖ్య పదవిని ఇప్పటి వరకు ఇద్దరు తెలుగు వారు నిర్వహించగా అందులో పి. శివశంకర్ ఒకరు. పి.వి. నర్సింహారావు మరొకరు.
 
వాస్తవానికి శివశంకర్ విదేశీ వ్యవహారాల మంత్రిగా పని చేసింది స్వల్పకాలమైనా మన విదేశాంగ విధానంలో ఆయన కీలక మార్పులు తీసుకువచ్చారు. సైద్ధాంతిక విలువల ప్రాతిపదికన ఉన్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో దేశ ఆర్థికాభివృద్ధి కోణాన్ని చేర్చిన ఘనత కేవలం శివశంకర్‌కు దక్కుతుంది. గల్ఫ్ దేశాలతో, పెట్రోలియం దిగుమతి మినహా ఇతర ఆర్థికాంశాల గూర్చి భారతదేశం దృష్టి సారించకపోవడాన్ని గమనించిన శివశంకర్ లక్షలాది మంది భారతీయులు ఉన్న గల్ఫ్ ఎడారులలో మన వాళ్ళకు మన బీడీలు కూడా అమ్మరాదా అంటూ దౌత్యవేత్తలను ప్రశ్నించారు. 1986లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖతో పాటుగా అదనంగా వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా ఆయన వద్ద ఉండడంతో విదేశాలలో భారతీయ ఉత్పత్తులకు ఒక సువర్ణావకాశం లభించింది. గల్ఫ్ దేశాలలోని భారతీయుల సంక్షేమానికి కూడా ఆయన కృషి చేసారు. గల్ఫ్ దేశాలలో ప్రవాసులు తాము పొందిన అనుభవం, సంపాదనతో మాతృభూమికి తిరిగి వచ్చిన తర్వాత వారికి పునరావాసం, స్వయం ఉపాధి కల్పన దిశగా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అప్పట్లో రాష్ట్ర పరిశ్రమల మండలి ఆధ్వర్యంలో ఒక సలహా కేంద్రాన్ని ఏకంగా గల్ఫ్‌లో నెలకొల్పారు.
 
ఉపాధి మోసాలను అరికట్టడానికి గాను న్యాయ శాస్త్రంలో తనకు ఉన్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇమ్మిగ్రేషన్‌ చట్టంలో అనేక సవరణలను కూడా ఆయన సూచించడం జరిగింది. సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలు కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ పట్ల సానుభూతిగా ఉండడాన్ని గమనించిన శివశంకర్‌, కాశ్మీరీ నేత ఫారూఖ్ అబ్దుల్లాను భారతీయ అధికారిక హజ్ బృంద నాయకుడిగా సౌదీ అరేబియాకు పంపించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. దూరదృష్టి కల్గిన శివశంకర్ ప్రధాని దూతగా పాకిస్థాన్ పర్యటనకు వెళ్ళి అక్కడ ఒక సమావేశంలో ఉర్దూలో మాట్లాడారు. ఆ ప్రసంగాన్ని విన్న పాకిస్థాన్ అధ్యక్షుడు జనరల్ జియా ఉల్ హఖ్ తాను శివశంకర్ తరహా అనర్గళమైన ఉర్దూలో మాట్లాడలేనంటూ చెప్పారు. భారతదేశానికి చెందిన ఒక అతి పెద్ద వ్యాపార సంస్థకు గల్ఫ్‌లో ఒక ప్రత్యేక గెస్ట్‌ హౌజ్ ఉంది. అందులో ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులకు కూడా ఆతిథ్యమివ్వరు. అయితే ఒకప్పుడు రైల్వే ప్లాట్ ఫారంపై పడుకున్న శివశంకర్‌ను ఆ సంస్థ వారు ప్రత్యేక అతిథిగా ఆదరిస్తారంటే అందుకు ఆయన వ్యక్తిత్వం, గొప్పదనమే కారణం.
 
ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్‌కు మధ్య జరిగిన యుద్ధంగా అభివర్ణించే సికింద్రాబాద్ లోక్ సభ ఉప ఎన్నికలలో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందడం అప్పట్లో రాజకీయ సంచలనం. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలకు విశ్వసనీయ సలహాదారులలో ఒకరైన శివశంకర్ తన రాజకీయ ప్రస్థానంలో అనేక మంది వెనుకబడిన వర్గాలకు చెందిన యువకులకు రాజకీయ భిక్ష పెట్టారు. వారందరూ ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలో కీలకమైన నేతలుగా ఎదిగారు.
శివశంకర్ మెదక్ లోక్‌సభ నుంచి పోటీ చేసి ఓడిపోగా దాని పరిధిలోని ఒక శాసనసభ నియోజకవర్గంలో ఆయన పక్షాన ఎన్నికలలో విస్తృతంగా పని చేసిన చౌకధరల దుకాణం నడుపుకొనే ఒక యువకుడు తన తలను విద్యుత్ స్తంభానికి కొట్టుకొని బాధను వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న శివశంకర్ సదరు యువకుణ్ణి చేరదీసి తన వద్దకు పిలిపించుకొని ఆర్థికంగా సహాయపడగా అతను ఆ తర్వాత మంత్రిగా అన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలలో పనిచేసి ఇప్పుడు కూడా కీలకమైన నాయకుడుగా వున్నారు. నిత్యం పత్రికలలో కనిపిస్తుంటారు. ఒకప్పుడు శివశంకర్‌ను కలవడానికి ఢిల్లీకి వెళ్ళడానికి రైలు టిక్కెట్‌కు డబ్బు లేని అతను ఇప్పుడు దుబాయి నుంచి ఇటలీ ఉత్పాదక ఫర్నీచర్‌ను తెప్పించుకొంటాడు. (ఆ తర్వాత శివశంకర్ తారసపడినా అతను పలుకరించలేదన్నది వేరే విషయం)
 
రేపటి ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శనం చేసిన శివశంకర్ నిన్నటి తరానికి చెందిన మేధావి, నాయకుడు. కొన్ని విలువలకు కట్టుబడ్డ వ్యక్తి. ఆయన మృతి వెనుకబడిన వర్గాలకు పెద్ద లోటు.
మొహమ్మద్ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి