:: Welcome to NRI - Article ::

దిగ్బంధంలో ఖతర్!

భౌగోళికంగా గుంటూరు జిల్లా అంత ఉంటూ, జనాభా పరంగా అందులో సగం కూడా లేని ఖతర్‌ అంతర్జాతీయంగా తనకంటూ ఒక స్ధానం కొరకు వినూత్న పంథాలను ఎంచుకుంటోంది. ఇరాన్‌ ఒక పెద్ద కీలకదేశమని ఖతర్‌రాజు వ్యాఖ్యానించడం గల్ఫ్‌ దేశాలలో వివాదాస్పదమయింది. ఆ వ్యాఖ్యను ఖండించే ప్రయత్నం చేస్తూనే ఎన్నికలలో విజయం సాధించిన ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్‌లో ఆయన శుభకాంక్షలు తెలిపారు. దీంతో వివాదం పరాకాష్టకు చేరుకొంది. తత్ఫలితమే ఖతర్‌ను ఏకాకి చేయడం.

ఒకప్పుడు దుబాయి నగరంలో మంచి నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారు. గాడిదలపై మంచినీరును ఇళ్ళకు సరఫరా చేసేవారు. ఆ కాలంలో దుబాయి రాజ కుటుంబం అమ్మాయిని వివాహం చేసుకున్న ఖతర్ రాజు అల్ దానీ తన మామకు బహుమతిగా దుబాయి నగరంలో మంచి నీటి సరఫరా వ్యవస్ధ ఏర్పాటుకు నిధులు సమకూర్చారు.

అల్‌దానీ కుమారుడు హామద్ తానీ లండన్ లో విద్యాభ్యాసం చేశాడు. ఒకసారి ఎవరో ఖతర్ అంటే ఏమిటి, దేశమా లేక నగరమా, అది ఎక్కడ ఉంటుందని హామద్ తానీను ప్రశ్నించారట. ఇందుకు తానీ ఎంతగానో చిన్నబోయాడు. ఇది తనకేగాక ఖతర్‌కు కూడా అత్యంత అవమానంగా ఆయన భావించాడు. చిన్నదైనప్పటికీ బ్రిటన్ సేనలతో పోరాడిన తమ దేశం గూర్చి తెలియకపోవడాన్ని ఆ యువరాజును చాలా బాధించింది. తాను గద్దె నెక్కిన తర్వాత తన బుల్లి దేశాన్ని ప్రపంచం గుర్తించే విధంగా అభివృద్ధి చేస్తానని శపథం చేశాడు.

ఆ శపధాన్ని నెరవేర్చుకొనేందుకు తానీ అవసరమైన అన్ని ప్రయత్నాలు చేశాడు. అయితే ఆయన తండ్రి అందుకు అంగీకరించలేదు. దీంతో తానీ తన తండ్రిని గద్దె దింపి తాను సింహాసనమెక్కాడు. తాను ఆశించిన విధంగా ఖతర్ ను అభివృద్ధిపరిచాడు. అయితే తన దేశాన్ని వివాదాల వైపు కూడా తీసుకెళ్ళాడు. తమ సహచర రాజును ఆయన సొంత కుమారుడే పదవీచ్యుతుడిని చేయడం ఇరుగు పొరుగుదేశాల రాజ కుటుంబాలకు నచ్చ లేదు. పైగా తానీ వ్యవహార శైలి తమ సంప్రదాయ విధానాలకు విరుద్ధంగా ఉండడాన్ని వారు హర్షించలేకపోయారు.

సౌదీ అరేబియా పాలకులతో కొన్ని విషయాలలో నూతన ఖతర్ రాజు తాడో పేడో తేల్చుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు.ఒక సందర్భంలో ఇరు దేశాల సరిహద్దుల్లో కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. నేపాల్‌కు భారత సరిహద్దు ఎంత ముఖ్యమో ఖతర్‌కు సౌదీ అరేబియా సరిహద్దు అంతకంటే ముఖ్యం. అయినా మొండిగా సౌదీతో కయ్యానికి దిగడానికి తానీ సంకోచించలేదు.

ఆరు దేశాల జి.సి.సి కూటమిలో సౌదీ అరేబియా అన్ని విధాలుగా పెద్ద దేశం. దీంతో ఆ సంస్థ వ్యవహారాల్లో సౌదీ ఆడింది ఆట పాడింది పాటగా ఉంటుంది. మొత్తం గల్ఫ్ దేశాల్లో, కీలక అరబ్బు ప్రపంచంలో రాజకీయంగా తన మాట చెల్లుబాటు కావడం సౌదీకి ముఖ్యం. సహచర దేశాలకు ఆర్ధిక ప్రయోజనం కల్గించడం కూడా సౌదీకి ముఖ్యమే.

ఖతర్‌ భౌగోళికంగా గుంటూరు జిల్లా అంత వుంటుంది. అయితే ఈ గల్ఫ్‌ దేశ జనాభా గుంటూరు జిల్లా జనాభాలో సగం కూడా వుండదు. అయినా అంతర్జాతీయంగా తనకంటూ ఒక స్ధానం కొరకు ప్రయత్నాలు చేస్తూ రాజకీయంగా, సైనికంగా,ఆర్ధికంగా ఎదగడానికి ఖతర్‌ విభిన్న వినూత్న పంథాలను ఎంచుకొంటోంది. ఖతర్‌ ధోరణి గల్ఫ్ దేశాలలో సహాజంగానే అలజడి రేపింది.

అల్ జజీరా న్యూస్ ఛానల్‌ను నెలకొల్పి ఇతర అరబ్బు దేశాల ప్రభుత్వాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. కాబూల్‌లోని ఈ ఛానల్ కార్యాలయాన్ని మూసివేసిన తర్వాత మాత్రమే అమెరికా సేనలు ఆఫ్ఘానిస్తాన్ పై దాడి చేసాయంటే అల్‌ జజీరా ప్రాముఖ్యతను ఉహించుకోవచ్చు. ఇక్కడ విచిత్రమేమిటంటే, ఆఫ్ఘానిస్తాన్‌తో పాటు ఇరాక్‌, రష్యా సరిహద్దు వరకు సైనిక కార్యకలాపాలు నిర్వహించడానికి కీలకమైన అమెరికా సైనిక స్ధావరం కూడ ఖతర్ లోనే ఉంది. ఒక వైపు ఇజ్రాయిల్‌తో బహిరంగ మైత్రి చేస్తూ మరోవైపు పాలస్తీనా పోరాట దళాలకు ఇది బాసటగా నిలుస్తుంది. యెమన్‌లో ఇరాన్ మద్దుతుదారులైన హుతి తెగ పోరాట దళాలకు వ్యతిరేకంగా సౌదీతో కలిసి సైనిక చర్యలలో పాల్గొంటున్న ఖతర్‌ మరో వైపు ఇరాన్‌తో కూడ దోస్తీ చేస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సౌదీ పర్యటన సందర్భంగా జరిగిన జిసిసి సదస్సులో పాల్గొనడానికి వచ్చి వెళ్ళిన ఖతర్ రాజు ఆ తర్వాత తన దేశంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇరాన్ గూర్చి ప్రస్తావిస్తూ అది అత్యంత కీలక దేశమని వ్యాఖ్యానించారు. దీనితో పాటు ఇతర అరబ్‌ దేశాల గురించి చేసిన మరికొన్ని వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారాయి. ఆ తర్వాత ఖతర్‌ రాజు ఆ వ్యాఖ్యలను ఖండించే ప్రయత్నం చేస్తూనే ఎన్నికలలో విజయం సాధించిన ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్ లో మాట్లాడి శుభకాంక్షలు తెలిపారు. దీంతో ఆ వివాదం పరాకాష్టకు చేరుకొంది. తత్ఫలితమే ఖతర్‌ను ఏకాకి చేయడం.

యు.ఏ.ఇ., సౌదీ అరేబియా నుంచి ప్రతి రోజూ వేలాది ట్రక్కులు ఖతర్ కు ఆహారం మొదలు సిమెంట్ వరకు రవాణా చేస్తుంటాయి. ఖతర్ విమానాలన్నీ కూడా ఇటు సౌదీ అటు యు.ఏ.ఇ. గగనతలం గుండా ఎగురుతాయి. ప్రతి రోజు వేల సంఖ్యలో ఖతర్‌ పౌరులు సౌదీకి కార్లలో వచ్చి వెళ్తారు. ఇప్పుడు అన్ని రకాల నిషేధం, దిగ్బంధంతో ఖతర్ ఒక సంకట పరిస్ధితిని ఎదుర్కొంటోంది.

 

 

-మొహమ్మద్ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి