Sindhi-expats-in-Gulf-countries

సింధీ ప్రవాసులు

దేశ విభజన బాధిత వర్గాలలో ఇతరుల కంటే ముందుగా బాధల కడలి నుంచి గట్టెక్కిన వారు సింధీలేనని చెప్పవచ్చు. తమ నూతన దేశమైన ఇండియాలో కొత్త జీవితాలను ప్రారంభించిన సింధీలు అచిరకాలంలోనే ఆర్థికంగా నిలదొక్కుకున్నారు.

 
బ్రిటిష్‌ వలస పాలకులు పోతూ పోతూ భారత్‌ను చీల్చి పోయారు. ఏడు దశాబ్దాల క్రితం, ఢాకా నుంచి పెషావర్ వరకు ఒక్కటిగా ఉన్న భారతదేశం బ్రిటిష్‌వారి విభజించి పాలించు రాజకీయంతో ముక్కలైంది. ఈ దేశ వాస్తవ పరిస్థితులు ఏమాత్రం తెలియని బ్రిటిష్‌ న్యాయకోవిదుడు ఒకరు స్వాతంత్ర్య సిద్ధికి కేవలం నలభై ఐదు రోజుల ముందు ప్రప్రథమంగా భారత్‌ వచ్చి దేశ రేఖా పటాన్ని పునర్లిఖించాడు. ఆయన గీసిన సరిహద్దు రేఖ లక్షలాది కుటుంబాల జీవితాలను అతలాకుతలం చేసింది. దేశ విభజన గాయం గాఢంగా ఇంకా మిగిలి ఉన్నది.
 
ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన భారతదేశ విభజన లక్షలాది అమాయకుల జీవితాలను నాశనం చేసింది. ఉన్నపాటున అన్నీ వదులుకొని కట్టుబట్టలతో లక్షలాది కుటుంబాలవారు తమకు తెలియని ప్రాంతాలకు శరణార్థులుగా వెళ్ళిపోయారు. వాఘా సరిహద్దుకు ఇరు వైపులా ఎంతో మంది మహిళలు ఆగంతకుల అఘాయిత్యాలకు బలై, అదృశ్యమయ్యారు. దేశ విభజన ఈ రకంగా లక్షలాది సింధీలు, సిక్కులు, పంజాబీ ముస్లింల జీవితాలను ఛిద్రం చేసింది.
 
ఈ బాధిత వర్గాలలో ఇతరుల కంటే ముందుగా బాధల కడలి నుంచి గట్టెక్కిన వారు సింధీలేనని చెప్పవచ్చు. తమ నూతన దేశమైన ఇండియాలో కొత్త జీవితాలను ప్రారంభించిన సింధీలు అచిరకాలంలోనే ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. హైదరాబాద్ నగరానికి కూడా 25 మంది సింధీలు శరణార్థులుగా వచ్చి ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున ప్రయోజనాలు పొందారు. ఆ కాలంలోనే పలువురు సింధీలు ఓడలెక్కి అరబ్, ఆఫ్రికా దేశాలకు వలసపోయారు. వ్యాపారాలు ప్రారంభించి సంపన్నులుగా వర్థిల్లారు.
 
పాకిస్థాన్ న్యాయస్థానాలలో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన రాంజెత్మలానీ ఇప్పుడు మన దేశంలో అగ్రశ్రేణి న్యాయవాదిగా ఉన్నారు. అలాగే హైదరాబాద్‌లో ప్రఖ్యాత కరాచీ బేకరీ యాజమాని ఘన్ చంద్ రాంననీ, ప్రభుత్వ ఉద్యోగుల స్థానికతపై తన నిష్పాక్షిక నివేదికతో తెలంగాణ వాదానికి బలం చేకూర్చిన జె.యం.గిర్గిలానీ, దుబాయిలోని ప్రముఖ వ్యాపారవేత్త రాం బుక్షానీ మొదలైన వారు దేశ విభజన సందర్భంలో మన దేశానికి వచ్చి స్థిరపడిన సింధీలు. మరో ప్రముఖుడి గురించి మనం తప్పకుండా ప్రస్తావించుకోవలసి వున్నది. ఆయన, భారతీయ జనతా పార్టీ కురవృద్ధ నాయకుడు లాల్ కృష్ణ ఆడ్వాణీ. ఇలా అనేక మంది సింధీలు బ్రిటిష్ పాలకుల కుతంత్రం ఫలితంగా తమ స్వస్థలాలకు దూరమయ్యారు. అయితే తమ జీవిత తొలి దశ మధుర అనుభవాలను వారు ఇప్పటికీ తరచూ గుర్తుచేసుకోవడం కద్దు. తమ జన్మస్థలం పట్ల ఇప్పటికీ ప్రత్యేక అభిమానం ప్రదర్శిస్తారు. అందుకే తమ జన్మస్థలాల పేర హైదరాబాద్‌లో కరాచీ బేకరీ, కరీంనగర్‌లో హైదరాబాద్ సింధ్ క్లాత్ స్టోర్స్ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.
 
పాకిస్థాన్ పర్యటనలో తమ పాత గృహం స్థానంలో నూతన భవనం నిర్మాణమైనా అందులో ఇంకా ఉన్న తమ తండ్రి కాలం నాటి అల్మారా, మంచాన్ని గుర్తుపట్టిన లాల్‌ కృష్ణ ఆడ్వాణీ ఉద్వేగభరితమయ్యారు. నాటి నుంచి నేటి వరకు అనేక సంచలనాల కేసులను వాదిస్తున్న రాంజెత్మలానీ తాను మొదటిసారిగా వాదించిన పాకిస్థాన్‌లోని న్యాయస్థానంలో వీలయితే ఒకసారి వాదిస్తానని ముచ్చటపడ్డారంటే మనిషికి తన జన్మస్థలంపై ఉన్న మమకారం ఏమిటో తెలుస్తోంది. పాకిస్థాన్‌లో తన చిన్ననాటి మిత్రుడు, సహచర న్యాయవాది, భాగస్వామి అయిన అల్లాహ్ బక్ష్ బోహ్రీ మరణించేవరకు, ఆయన మరణించిన తర్వాత ఆయన కుటుబం సభ్యులతో కూడా జెత్మలానీ అనుబంధం కొనసాగింది.
 

దేశ విభజన సమయంలో తండ్రిని కోల్పోయి, చిన్నతనంలోనే పాకిస్థాన్ సింధ్‌ రాష్ట్రం నుంచి భారతదేశానికి వలస పోయిన రాం బుక్షానీ ఆర్థిక ఇబ్బందుల కారణాన కొద్దికాలం తర్వాత దుబాయికి వచ్చారు. చమురు ఆర్థిక వ్యవస్థలేని ఆ కాలంలో చేతిలో చిల్లి గవ్వ లేకుండా దుబాయికి చేరిన రాం బుక్షానీ నేడు ఆ గల్ఫ్‌ రాజ్యంలో ప్రముఖ భారతీయ వ్యాపారి. ఆయన ఇప్పటికీ పాకిస్థాన్‌లోని తమ సింధీల చరిత్ర గూర్చి సగర్వంగా చెప్పుకుంటారు. జెత్మలానీ నుంచి గిర్గిలానీ వరకు ఈ ప్రవాసులందరూ తమ సింధీ సంస్కృతీ సంప్రదాయాల గురించి గర్వపడతారు. పురాతన సింధూ నాగరి కతకు తాము వారసులమని చెప్పుకుంటారు. ప్రజలు తమ తమ సంస్కృతీ నాగరికతలు, ఆచార వ్యవహారాల పై గర్వపడాలి కూడా.

మొహమ్మద్ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి