Sheep--Formers-in-GULF

ఎడారిలో గొర్రెల పెంపకం

గొర్రెలను సరఫరా చేయడంతో పాటు వాటి పెంపకం, సంబంధిత ఆంశాలపై పెంపకందారులకు తోడ్పడేందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలి. అప్పుడే స్థానికంగానే కాకుండా విదేశాలకూ మాంసాన్ని సమృద్ధిగా ఎగుమతి చేయడం సాధ్యమవుతుంది.

 
 గల్ఫ్‌ దేశాలకు వలసవచ్చే తెలంగాణ యువతలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు అందునా వెనుకబడిన, దళిత వర్గాలకు చెందినవారు. కువైట్‌, సౌదీ అరేబియా, ఒమాన్‌లలో పనిచేసే ఒంటెల, గొర్రెల కాపరుల్లో తెలంగాణ వారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. పెరిగిపోతున్న పట్టణీకరణ, దుర్భిక్ష పరిస్థితులకు తోడుగా క్రమేణా అంతరిస్తున్న గ్రామీణ, వ్యవసాయాధారిత, కులవృత్తులకు ఆదరణ లేకపోవడంతో ఆదాయ మార్గాలు సన్నగిల్లడమే తెలం గాణ యువత ఎడారి దేశాల బాట పట్టడానికి ఒక ముఖ్యకారణమని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందించి, అంతరిస్తున్న కుల వృత్తులకు ఆసరాగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలకు శ్రీకారం చుట్టడం హర్షణీయం. గొర్రెల పెంపకం ఒక ప్రధాన కులవృత్తిగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. సంబంధిత సామాజిక వర్గం వారి ఆర్థికాభ్యున్నతికి తోడ్పడాలనే లక్ష్యంతో గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. గొర్రెల పెంపకానికి ప్రొత్సాహం ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం నిజంగా అభినందించదగ్గ విషయం.
 
గొర్రెల పెంపకం, వ్యాపారం నిస్సందేహంగా ఆర్థికంగా ప్రయోజనకరమైన కార్యకలాపాలు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమాన్ దేశాలకు చెందిన భారతీయ సంతతికి చెందిన కొందరు తెలంగాణలో ఇప్పటికే గొర్రెల పెంపకం కేంద్రాలను నిర్వహిస్తున్నారు. మరికొందరు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ నుంచి విదేశాలకు గొర్రె మాంసాన్ని ఎగుమతి చేసే ఒక బడా సంస్థ తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లోని తమ ప్లాంట్ల నుంచి ఆశించిన స్థాయిలో గొర్రె మాంసం సరఫరా కావడం లేదని, ఇథియోపియా దేశంలో భారీ పెట్టుబడితో నవీన వధశాల నొకదాన్ని నెలకొల్పింది. అక్కడి నుంచి గల్ఫ్ దేశాల్లోని మార్కెట్లకు గొర్రె మాంసం సరఫరా చేయడం దాని లక్ష్యం. గొర్రెలు, మేకల పెంపకం చేసే వారిలో స్వతహాగా తాము ఆర్థికంగా ఎదగాలనే కోరిక ఉండాలి. ఈ ఆకాంక్షకు ప్రభుత్వ ప్రొత్సాహం తోడ్పాటు లభించినప్పుడే ఏ సంక్షేమ పథకమైనా విజయవంతమవుతుంది. లేకుంటే ప్రచారపు అర్భాటంగా మిగిలిపోతుంది.
 
గల్ఫ్ దేశాల్లోనూ మేకలు, గొర్రెలు, ఒంటెలు ఇప్పటికీ గ్రామీణ జీవన, ఆర్థిక వ్యవస్థల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. కానీ ప్రభుత్వం సబ్సిడీపై ఒంటెలను గానీ మేకలను గానీ ఇవ్వదు. వీటిని పెంచేవారికి అవసరమైన అన్ని సదుపాయాలను సమకూరుస్తుంది. కాపరుల వీసాల జారీ, పశువులకు మెరుగైన వైద్యవిధానం, వాటికి మేత సదుపాయం, వీటన్నింటికీ మించి స్వేచ్ఛా విపణి విధానాన్ని ప్రొత్సహించడం ద్వారా దేశీయ పశు పెంపకంతో సంబంధిత వర్గాలే స్వయాన ఎదగడానికి అన్నిరకాలుగా ప్రభుత్వాలు తోడ్పాటు అందిస్తాయి. ప్రత్యేకించి రోగాల నిర్మూలన విషయానికి వస్తే, పశువులను తీసుకొని ఆసుపత్రులకు రాకుండా ప్రభుత్వమే పశు వైద్య బృందాలను వారి మందల వద్దకు పంపించి వైద్య సహాయం అందిస్తుంది. ఈ విషయంలో తెలంగాణ గానీ మరే రాష్ట్రమైనా గానీ పూర్తిగా వెనుకబడి ఉన్నాయని నిస్సంకోచంగా చెప్పవచ్చు.
 

మనదేశంలో పశు సంపద విషయంలో స్థానిక వాతావరణ పరిస్థితులు, మేత విధానం కూడ కీలక పాత్ర వహిస్తాయి. అధిక పాలను ఇచ్చే హర్యానా బర్రెలను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)ల ద్వారా ఒకప్పుడు విరివిగా రైతులకు సరఫరా చేసినా ఆశించిన స్థాయిలో ప్రయోజనం కలుగలేదనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం చెప్పాలి. హర్యానా బర్రెలు కొన్ని అనారోగ్యానికి గురై పాలు ఇవ్వకపోవడంతో రుణాలు తిరిగి చెల్లించలేకపోయిన కరీంనగర్ జిల్లా రైతులు న్యాయవాది సిహెచ్. విద్యాసాగర్ రావు (ఇప్పటి మహారాష్ట్ర గవర్నర్) ద్వారా కోర్టులో కేసు వేయగా, ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చే పశువులను పెంచడం, ప్రభుత్వ విధానంపై ఆసక్తికర చర్చ జరిగింది. ఇక గొర్రెల విషయానికి వస్తే, చెవులకు రంధ్రాలు చేయడం ద్వారా గుర్తించే విధానమే మన వద్ద సరిగ్గా లేదు. అనారోగ్య గొర్రెను మంద నుంచి తీయడం, నట్టెల వ్యాధి వ్యాక్సిన్ మొదలగు మౌలికాంశాలలో తెలంగాణ వెనుకబడి ఉంది. గొర్రెలను సరఫరా చేయడంతోపాటు వాటి పెంపకం సంబంధిత అంశాలపై పెంపకందారులకు తోడ్పడేందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలి. అప్పుడే స్థానికంగానే కాక విదేశాలకూ సమృద్ధిగా మాంసాన్ని ఎగుమతిచేయడం సాధ్యమవుతుంది. పెంపకందారులు ఆర్థిక లబ్ధి పొందుతారు.

మొహమ్మద్ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి