Saudi-Company-will-may-invests-in-Andhrapradesh

ఆంధ్రకు సౌదీ సౌభాగ్యం

విశాఖలో ఆయిల్‌ రిఫైనరీలను నెలకొల్పడానికి సౌదీ అరంకో సంస్థ ఆసక్తి చూపుతున్నది. అరంకో పెట్టుబడులకోసం ఒడిశా పోటీపడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ అధికార యంత్రాంగం మరింత ప్రత్యేక శ్రద్ధ చూపవలసిన అవసరం లేదా?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వస్తూత్పత్తి రంగంపై ఆధారపడి వుండగా అరబ్‌ దేశాల ఆర్థికంలో చమురు ముఖ్యభూమిక వహిస్తోంది. చమురు ఉత్పత్తి, ఎగుమతిలో గల్ఫ్ దేశాలు ప్రత్యేకించి సౌదీ అరేబియా, యూఏఈలోని అబుధాబి కీలకపాత్ర వహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు రంగంలో సంభవించే ప్రతి పరిణామంలో ఈ రెండు దేశాల ప్రమేయం తప్పక ఉంటుంది.
 
అంతర్జాతీయ విపణిలో మారుతోన్న పరిస్థితులకు అనుగుణంగా సౌదీ, అబుధాబీలు కూడా తమ వాణిజ్య వ్యూహాలను మార్చుకొంటున్నాయి. ప్రపంచ ఆర్థిక శక్తులుగా ఆవిర్భవిస్తోన్న సహచర ఆసియా దేశాలపై ఆసక్తి చూపుతున్న ఈ చమురు దిగ్గజాలు ముఖ్యంగా భారత్, అందునా తూర్పు తీరస్థ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. బంగాళాఖాతం తీరాన వుండడం వల్లే ఆంధ్రరాష్ట్రం ఈ ప్రాధాన్యం సంతరించుకున్నది. తమకు అనువైన, చేరువలో వున్న అరేబియా సముద్రతీరప్రాంతాల్లో కాకుండా బంగాళాఖాతం తీరంలో తమ వాణిజ్య కార్యకలాపాలను ముమ్మరం చేసుకోవాలని ఈ గల్ఫ్‌ దేశాలు ఆరాటపడుతున్నాయి. తీరాంధ్రంలో పెట్రోలియం ఉత్పత్తుల వ్యూహాత్మక నిల్వల సామర్థ్యంతో ఆగ్నేయఆసియా దేశాల మార్కెట్లను కైవసం చేసుకోవాలని సౌదీ అరేబియా సంకల్పించుకొంది. ఈ సంకల్ప సాధనకు అవసరమైన ప్రణాళికలను ఇప్పటికే రూపొందించుకొంది. తూర్పు తీరస్థ రాష్ట్రాల్లో చమురు రంగ అభివృద్ధికై మోదీ స్వయంగా సౌదీ, ఆబుధాబిలను ఆహ్వనించడం జరిగింది. మోదీ అభీష్టం మేరకు ఈ గల్ఫ్‌ దేశాల పెట్టుబడులను ప్రోత్సహించడానికి కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పలు ప్రయత్నాలు చేస్తున్నారు.
 
ప్రపంచ చమురువ్యవస్థను శాసించే (సౌదీ అరేబియాకు చెందిన) సౌదీ అరంకో సంస్ధ కూడా భారతదేశంలో పెట్టుబడులు పెట్టే విషయమై అమిత శ్రద్ధాసక్తులు చూపుతోంది. భారత్‌లో తమ వాణిజ్య విస్తరణ అవకాశాలను అనేక కోణాల నుంచి పరిశీలిస్తుంది. సంప్రదాయకంగా తమకు అనువైన అరేబియా సముద్ర తీర దేశాల్లో కాకుండా బంగాళా ఖాతం తీరానున్న భారత రాష్ట్రాలలో ప్రస్తుతమున్న భారతీయ రిఫైనరీలకు తోడుగా అదనపు రిఫైనరీలను నెలకొల్పాలని అరంకో యోచిస్తున్నది. భారతీయ కంపెనీల భాగస్వామ్యంతో వాటిని ఏర్పాటుచేయడం ద్వారా భారత్‌లో తమ వ్యాపార ప్రయోజనాలను సుదీర్ఘకాలం పదిలం చేసుకోవాలని అరంకో ఆలోచిస్తున్నది. వ్యాపార ప్రయోజనాలకు అగ్రప్రాధాన్యమివ్వడంతో పాటు వ్యూహాత్మక చమురు నిల్వలకేంద్రాలను నెలకొల్పుకోవడం ద్వారా ఆగ్నేయఆసియా దేశాల చమురు మార్కెట్లపై పట్టు సాధించాలని సౌదీ అరంకో ఆశిస్తోంది.
 
సరిగ్గా ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో సౌదీ అరంకో అధిపతి అమీన్ నాసర్‌తో సమావేశమయ్యారు. సాధారణంగా సౌదీ అరంకో ఉన్నతాధికారులు వ్యాపార ప్రతిపాదనలతో ఎవరితో చర్చలు జరపరు. అయితే ఈ ఏడాది అనూహ్యంగా చంద్రబాబు నాయుడుతో మాత్రం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి తాము సిద్ధంగా వున్నామని సౌదీ ప్రతినిధులు ప్రతిపాదించారు. అవసరమైన స్థలం, నీటి వనరులు, ఇంకా ఇతర హంగులు అన్నీ సమకూర్చుతానని సౌదీ అరంకో అధికారులకు చంద్రబాబు హామీనిచ్చారు. విశాఖపట్టణంతో పాటుగా కాకినాడలో కూడా పెట్రో రసాయనాల పరిశ్రమలను, సంబంధిత విశ్వవిద్యాలయాన్నీ నెలకొల్పడానికి సహకరించవల్సిందిగా కూడా అరంకో అధికారులను చంద్రబాబు కోరారు. బంగాళాఖాతం తీరంలోని ఒడిశాలో బలపడాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆ రాష్టంలో కొన్ని కేంద్ర ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా ఉత్కళ ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెట్రోలియం మంత్రి ప్రధాన్ ఇప్పటికే ఉర్జ గంగా అనే గ్యాస్ సరఫరా ప్రాజెక్టు ద్వారా ప్రజలకు దగ్గరకావాలని ప్రయత్నిస్తుండగా గల్ఫ్ దేశాలు నెలకొల్పే రిఫైనరీలు కూడా ఒడిశాలో ఏర్పాటయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
 
ఇటీవల మనదేశంలో జరిగిన కీలక అంతర్జాతీయ పెట్రోలియం సదస్సులో పాల్గొనడానికి సౌదీ అరంకోతో పాటు, ప్రధాన చమురు ఉత్పాదక దేశాల అత్యున్నత స్థాయి అధికార బృందాలు న్యూఢిల్లీకి వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీతో సుదీర్ఘ చర్చలు జరిపారు. న్యూఢిల్లీలో వారి వద్ద తమ రాష్ట్ర ప్రతిపాదనల ప్రస్తావన తీసుకొచ్చి, మరింత పురోగతి సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం తగు శ్రద్ధ చూపలేదని సమాచారం. న్యూఢిల్లీలో సౌదీ అరంకో సంస్థ అధిపతిని కనీసం మర్యాదపూర్వకంగా కలిసి తమ రాష్ట్ర ప్రతిపాదనల భవిష్యత్తు గురించి తెలుసుకోవడంలో కూడా ఆంధ్రప్రదేశ్ అధికారవర్గాలు శ్రద్ధ తీసుకోలేదని తెలుస్తోంది. తీరాంధ్రలో చమురు రంగ పురోభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవల్సిన అవసరం ఎంతైనా వున్నది. సౌదీ అరంకో అధికారులతో చర్చించి, ఈ విషయమై పురోగతి సాధిస్తే నవ్యాంధ్రప్రదేశ్‌లో మరో నవీన ఆర్ధికాభివృద్ధి బాట మొదలవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
మొహమ్మద్ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి