:: Welcome to NRI - Article ::

పది వసంతాల ‘శంషాబాద్’

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కార్పొరేట్‌ బాబులకు కాకుండా సామాన్య వ్యాపారులకు తోడ్పాటు అందిస్తే సగటు రైతులకు ప్రయోజనం కలుగుతుంది. తెలుగు రాష్ట్రాల మామిడి పండ్లు శంషాబాద్‌ నుంచి కాకుండా ముంబాయి నుంచి ఎందుకు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయో ఒకసారి ఆలోచించాలి.

 
 అమెరికాలోని రెండు నగరాలు, గల్ఫ్‌లోని మూడు నగరాల నుంచి వచ్చే ప్రయాణికులందరూ ముంబాయిలో కొన్ని గంటలు ట్రాన్సిస్ట్‌లో గడిపేవారు. అక్కడి నుంచి అందరూ కలిసి ఒక విమానంలో హైదరాబాద్‌కు వచ్చేవారు, అదీ అర్ధరాత్రి. సుదీర్ఘ విమాన యానం తర్వాత తమ గడ్డపై దిగామనే సంతృప్తితో, విమానం దిగి కౌంటర్ల వరకు నడుచుకుంటూ వచ్చే ప్రయాణీకులు తమ అలసటను మరచిపోయేవారు. షార్జా నుంచి వారానికి రెండు సార్లు మరొక విమానం వచ్చేది. హైదరాబాద్ వరకు విమానంలో వెళ్ళడం అనేది ఆ కాలంలో గల్ఫ్‌లో ఒక రకంగా చెప్పాలంటే పెద్ద మాటే, ఘనమైన విషయమే.
 
హైదరాబాద్ వరకు విమానం నడపాలనే డిమాండ్ గల్ఫ్‌లోని దాదాపు ప్రతి ప్రాంతం నుంచి బలంగా వినిపించేది. అయితే హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయంలో రన్‌వేకు స్థలం లేనందున అది సాధ్యం కాదని నాయకులు, అధికారులు నిస్సహాయుతను వ్యక్తం చేసేవారు. గల్ఫ్‌లోని తెలుగు ప్రవాసులు కొందరు తమకు తోచిన విధంగా విమానాశ్రయం విస్తరణ లేదా రన్‌వే స్థలం కొరకు ప్రయత్నించేవారు. చివరకు నిట్టూర్పుతో వెనుదిరిగేవారు.
 
ప్రధాని దేవెగౌడ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ విమానాశ్రయం విస్తరణకు తీవ్రంగా కృషి చేశారు. అయితే ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. లక్ష్యాన్ని సాధించలేకపోవడం బాధను కల్గించగా చంద్రబాబు నాయుడు మనం తప్పకుండా విమానాశ్రయం సాధిస్తామని ధైర్యం చెప్పేవారు. దానికి తగినట్లుగానే ఆయన పట్టుపట్టి వాజపేయి హయాంలో శంషాబాద్ విమానాశ్రయాన్ని సాధించడం జరిగింది.
 
ఈ రకంగా మొదలయిన శంషాబాద్ విమానాశ్రయం హైదరాబాద్ చరిత్రను మార్చివేసింది. అంతేకాదు, ఏకంగా భారతీయ విమానాశ్రయాల నిర్వహణకు ఒక నూతన నిర్వచనాన్ని ఇచ్చింది. ప్రస్తుతం పది వసంతాలను పూర్తిచేసుకొంటున్న (శంషాబాద్‌లోని) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయం విదేశాల నుంచి వచ్చే విదేశీ జాతీయులను కూడా అబ్బురపరుస్తుంది. శంషాబాద్ విమానాశ్రయం హైదరాబాద్ ప్రతిష్ఠను అంతర్జాతీయంగా పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. విమానాశ్రయాల సేవలో అంతర్జాతీయంగా ఇది ప్రధమ స్ధానంలో నిలిచినట్లుగా కెనడాలోని ఒక అంతర్జాతీయ వైమానిక సేవల సర్వే సంస్థ పరిశీలనలో వెల్లడయింది. ఇది తెలుగువారందరకీ గర్వకారణం.
 
రన్‌వేకు అవసరమైన స్థలం లేనందున బేగంపేటలో బోయింగ్ విమానాలు నడపలేని స్థితి వుండేది. అయితే నేడు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానా శ్రయం దక్షిణాసియా దేశాలలోకెల్లా అతిపెద్ద రన్‌వేలను కలిగి ఉన్నది. ఒకప్పుడు మూడు చిన్నస్థాయి విమానాలకు మాత్రమే అతి కష్టంగా స్థలం ఉండగా ఇప్పుడు 42 విమానాలను నిలుపడానికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో సౌకర్యం ఉంది.
 
వీటన్నింటి కంటే మించి విమానాశ్రయాల నిర్వహణలో ప్రవేశపెట్టిన నూతన ఐటీ పరిజ్ఞానం వాడకంలో శంషాబాద్ విమానాశ్రయం మన దేశంలోని అన్ని విమానాశ్రయాలకు ఆదర్శంగా నిలిచింది. నవీన సాంకేతిక పరిజ్ఞానం శంషా బాద్ విమానాశ్రయంలో ప్రయోగత్మకంగా అమలు చేసిన తర్వాతనే దాన్ని ముంబాయి, న్యూఢిల్లీ తదితర మహానగరాలలోని విమానాశ్రయాలలో అమలు చేస్తున్నారు. బోర్డింగ్ పాసులు లేకుండా పూర్తిగా డిజిటల్ విధానంలో రాకపోకలు సాగించే వినూత్న పరిజ్ఞానానికి కూడా ఇక్కడ నాంది పలికారు. ప్రస్తుతం కొన్ని దేశాల ఎయిర్‌లైన్స్‌కు మాత్రమే అమలు చేస్తున్న ఈ విధానాన్ని త్వరలో అన్ని ఎయిర్‌లైన్స్‌ ప్రయాణికులకు అమలు చేయడానికి సన్నహాలు పూర్తయ్యాయి. ఈ నూతన విధానానికి శంషాబాద్ విమానాశ్రయాన్ని ఎంచుకోవడానికి కారణం మన గడ్డ పై, మన నైపుణ్యాలు, నిర్వహణా సామర్థ్యంపై ఉన్న విశ్వాసమే కారణమని ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు.
 
ప్రయాణీకుల సేవలో పది వసంతాలు పూర్తి చేసుకొంటున్న శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం తదుపరి దశల విస్తరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నది. ప్రయాణీకులను గమ్యాలకు చేర్చడంలో అగ్రగామిగా ఉన్న శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ కార్గో విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో సామాన్యులకు ప్రయోజనం చేకూర్చడం లేదనే అరోపణలు కూడా ఉన్నాయి. కొచ్చిన్ విమానాశ్రయం నుంచి గల్ఫ్‌కు ప్రతిరోజూ తాజా కాయగూరలు, పళ్ళు మొదలైనవి రవాణా అవుతుంటాయి. ఈ విషయంలో మనం వెనుకబడి ఉన్నాం. శంషాబాద్‌ విమానాశ్రయం కార్పొరేట్‌ బాబులకు కాకుండా సామాన్య వ్యాపారులకు తోడ్పాటు అందిస్తే సగటు రైతులకు ప్రయోజనం కలుగుతుంది. తెలుగు రాష్ట్రాల మామిడి ఫలాలు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి కాకుండా ముంబాయి నుంచి ఎందుకు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయో ఒకసారి ఆలోచించాలి. అన్ని రంగాలలో తెలుగు రాష్ట్రాలు శంషాబాద్ విమానాశ్రయం తరహా పురోగమనంలో పయనించాలని ఆశిద్దాం.
మొహమ్మద్ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి