Rahul-Gandhi-Gulf-tour-result

రా‍హుల్‌ ఏమి సాధించారు‍?

బహ్రెయిన్‌లో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం, ప్రవాసీయులతో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఇచ్చిన సమాధానాలు కాంగ్రెస్‌ పార్టీ నూతన విధానాన్ని చాటి చెప్పాయి. కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయిన తర్వాత రాహుల్ గాంధీ తన మొదటి విదేశీ పర్యటనకు గల్ఫ్ లోని బహ్రెయిన్ ను ఎంచుకోవడం ద్వారా తన ప్రాధాన్యతలు ఏమిటో స్పష్టపరచారు. తన మొదటి పర్యటనకు గల్ఫ్ ను ఎంచుకోవడం ద్వారా మోదీ తరహా ప్రయోగాలకు తాను సిద్ధమవుతున్నట్లుగా రాహుల్ గాంధీ వెల్లడించారు. అయితే మోదీకి ఉన్న సంస్ధాగత వ్యవస్ధ రాహూల్‌కు లేదని స్పష్టంగా కనిపించింది. ప్రధాని స్ధాయిలో మోదీ జరిపే విదేశీ పర్యటనలలో ఆయన సామాన్య ప్రవాసీయులతో మమేకమైపోతారు. కలిసి అల్పాహారం చేయడం, చేయి కలుపడం, ఫొటో తీసుకోవడం వరకు ప్రతిదీ ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతుంది. విదేశీగడ్డను స్వదేశీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఆయన మలచుకుంటారు..
 
అందుకు భిన్నంగా రాహుల్ గాంధీ పర్యటన ఎలాంటి వ్యూహం లేకుండా జరిగింది. దీంతో రాహుల్‌ బహ్రెయిన్ పర్యటన ఆయనకు ఎలాంటి రాజకీయ లబ్దీ చేకూర్చలేకపోయింది.. బహ్రెయిన్ లో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం, ప్రవాసీయులతో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఇచ్చిన సమాధానాలు కాంగ్రెస్‌ పార్టీ నూతన విధానాన్ని చాటి చెప్పాయి. అయితే వాటికి భారతదేశంలో ఆశించిన స్ధాయిలో ప్రాచుర్యం లభించలేదు.
 
బహ్రెయిన్, ఇతర గల్ఫ్ దేశాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల వారు ఎక్కువగా ఉన్నారు. ఈ దృష్ట్యా రాహుల్ గాంధీ బహ్రెయిన్ పర్యటన పూర్తి స్ధాయిలో విజయవంతం కావాలి. పైగా అది మొదటి విదేశీ పర్యటన కాబట్టి భారతదేశంలో విస్తృత ప్రచారం జరగాలి. కానీ ఆ విధంగా జరుగలేదు. రాహుల్ పర్యటన విషయంలో భారతీయ ఎంబసీ అస్సటు పట్టించుకోలేదు. భారతీయ రాయబారి వ్యక్తిగతంగా రాహుల్ పర్యటనకు వ్యతిరేకమని సమాచారం. అయినప్పటికీ, బహ్రెయిన్ ప్రభుత్వం కాంగ్రెస్ అధినేతను తమ దేశ అతిథిగా గౌరవించింది. యువరాజు ఆయనకు విందు కూడా ఇచ్చారు. నెహ్రూ రచించిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’లో మధ్యప్రాచ్య, అరబ్బు దేశాల గురిం చి చాలా విపులంగా చర్చించారు. ఆ గ్రంథాన్ని బహ్రెయిన్ రాజకుటుంబానికి అందజేస్తూ తమ వంశానికి గల్ఫ్ గురించి నాటి నుండీ అవగాహన ఉందని చెప్పే ప్రయత్నం చేసారు. బహ్రెయిన్, ఇతర గల్ఫ్ దేశాలతో సంబంధాలకు భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను రాజకీయాలకు అతీతంగా, జాతి ప్రయోజనాల దృష్టితో ఆయన వివరించారు.
 
రాహుల్‌ పర్యటనలో సంస్ధాగత ఏర్పాట్లు చాలా అద్వానంగా ఉన్నాయి. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా సభలో పాల్గొనేవారు తమ పేర్లను నమోదు చేయించుకోవల్సి ఉండగా ఒక వేయి మంది పేర్లు నమోదు కాగానే నిర్వహకులు రిజిస్ర్టేషన్‌ను నిలిపివేశారు . తమ పేర్లు నమోదు చేసుకున్న వేయి మందిలో కేవలం 500 మంది మాత్రమే సభకు వచ్చారు. నిర్వహణా వైఫల్యం కారణంగా బహ్రెయిన్ లో గత వేసవిలో జరిగిన ఎంపీ కవిత సభకు హజరయిన వారిలో నాలుగో వంతు జనం కూడా రాహుల్ సభకు రాలేదు. ప్రవాసీ కార్మికుల సమస్యల గురించి తెలుసుకొనే ప్రయత్నం రాహుల్‌ చేయలేదు.
 
మృతదేహాల తరలింపులో జాప్యంపై కొందరు అడిగిన ప్రశ్నలకు ఆయన సరైన జవాబు ఇవ్వలేకపోయారు. చైనా ఏ విధంగా తమ యువతకు ఉపాధి కల్పిస్తుందో చెబుతూ భారతదేశం వెనుకబడినతనాన్ని గణంకాలతో వివరించి ఆకట్టుకున్నా, సగటు మనిషి హృదయానికి మాత్రం ఆయన చేరువకాలేకపోయారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో ప్రవాసీయుల విభాగం కన్వీనర్ నంగి దేవేందర్ రెడ్డి గతంలో బహ్రెయిన్ లో పనిచేశారు. దేవేందర్‌ రెడ్డితో పాటు మాజీ ఎంపీ మధు యాష్కి కూడా రాహుల్‌తో పాటు పర్యటనలో పాల్గొన్నారు. మొత్తానికి రాహుల్‌ పర్యటనను రాజకీయంగా వాడుకోవడంలో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా విఫలమయ్యింది. రాహుల్ గాంధీ దుబాయి పర్యటనకు కూడా కసరత్తు జరుగుతోంది. అప్పుడు ఏ రకంగా ఉంటుందో వేచి చూడాలి.
మొహమ్మద్ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి