Osmania-memories-in-Gulf-countries

విదేశీ గడ్డపై ఉస్మానియా స్మృతులు

చారిత్రాత్మక నేపథ్యం కల్గినప్పటికీ ఉస్మానియా బ్రాండును పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలలో మార్కెటింగ్ చేయడాన్ని మనం పూర్తిగా విస్మరించాం. అసంఖ్యాకమైన యువతకు ఉద్యోగం ఇచ్చి ఆదుకొన్న ఎడారి దేశాలు ఉస్మానియా డిగ్రీ అనగానే, ఉస్మానియా పట్టా చూడగానే, బూటకపు పత్రానికి పర్యాయపదంగా కూడా అనుమానించవలసి వచ్చి చివరకు కొన్ని ఆంక్షలు కూడా విధించే స్థాయి దాపురించడం దురదృష్టకరం.
 
 
అరబ్బు దేశాలన్నింటిలోనూ పెద్దదిగా, సౌదీ ప్రజలు గర్వంగా భావించే సౌదీలో తువేల్‌ లోని కింగ్ అబ్దుల్లా విశ్వవిద్యాలయం గూండా వెళ్ళినప్పుడల్లా సరిగ్గా ఇదే సంకల్పంతో వంద సంవత్సరాల క్రితం మా రాజు ఉస్మాన్ అలీ ఖాన్ కూడ తన పేర ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాడని చెప్పినప్పుడు అరబ్బులు విచిత్రపడతారు. పెద్ద సంఖ్యలో విదేశీయులు ఉంటున్నా మీ విశ్వవిద్యాలయాలలో విదేశీ భాషలలో విద్యా బోధన లేకున్నా శతాబ్ద కాలం క్రితం మా వద్ద అరబ్బీ భాష అనువాద సౌకర్యం ఉండడమే కాదు, భగవద్గీత గ్రంథాన్ని సైతం అనువాదం చేసామంటే నోట మాట రాదు.
 
అంతర్జాతీయ విషయాలకు వచ్చేసరికి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. స్థానిక భాషలో భారత ఉపఖండంలో ప్రారంభమైన ప్రప్రథమ విశ్వవిద్యాలయమైనప్పటికీ విదేశీ భాషలైన అరబ్బీ, పార్సీ భాషలలో ఉన్నత విద్యా బోధనలను మొట్టమొదటగా ప్రారంభిం చిన ఘనత దీనికి దక్కుతుంది. పేద ఆఫ్రికా, అరబ్బు దేశాల నుంచి విద్యా ర్థులు వస్తున్నప్పటికీ ధనిక గల్ఫ్ దేశాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య అత్యంత స్వల్పం కావటం బాధను కల్గిస్తుంది. చారిత్ర్మాక నేపథ్యం కల్గినప్పటికీ ఉస్మా నియా బ్రాండును పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల్లో మార్కెటింగ్ చేయడాన్ని మనం పూర్తిగా విస్మరించాం.
 
సుప్రసిద్ధ రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలే కాకుండా అమెరికా, యూరోప్, ఇంకా గల్ఫ్ దేశాలకు వృత్తి నిపుణులైన యువకులను పంపిన ఘనత ఈ విశ్వవిద్యాలయానిది. 1960 –-70లలో అమెరికా, యూరోపియన్ దేశాలకు వచ్చిన వైద్యులు, 1970 – 1980లలో గల్ఫ్ దేశాలకు వచ్చిన వివిధ ఇంజినీర్లు, డాక్టర్లలో అత్యధికులు ఈ చారిత్ర్మాక విశ్వవిద్యాలయంలో పట్టభద్రులు.
 
హైదరాబాద్‌కు చెందిన అనేక మంది ఇంజినీర్లు అమెరికాలోని టెక్సాస్ లోని చమురు పరిశ్రమలలో పని చేయడానికి వెళ్ళి అటు నుండి గల్‌్ఫకు వచ్చి ఇక్కడ పని చేస్తూ మాతృభూమి నుండి అసంఖ్యాక యువకులను ఉపాధి కై పిలిపించుకొని గల్ఫ్ వలసలకు పరోక్షంగా ఉపకరించారు.
 
అసంఖ్యాకమైన యువతకు ఉద్యోగం ఇచ్చి ఆదుకొన్న ఎడారి దేశాలు చివరకు ఉస్మానియా డిగ్రీ అనగానే, ఉస్మానియా పట్టా చూడగానే, బూటకపు పత్రానికి పర్యాయ పదంగా కూడా అనుమానించవలసి వచ్చి చివరకు కొన్ని ఆంక్షలు కూడా విధించే స్థాయి దాపురించడం దురదృష్టకరం.
 
సుమారు 20 సంవత్సరాల క్రితం వరకు దుబాయి నుంచి మొదలు దమ్మాం వరకు గల్‌్ఫలోని అనేక ప్రధాన నగరాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘాలు చురుకుగా పని చేసాయి. విదేశాలలో ప్రతి కొన్నాళ్ళకు దీని పూర్వ విద్యార్థులు వివిధ సందర్భాలలో అందరు కలిసి విందు భోజనం చేసి అప్యాయంగా అర్ధరాత్రి వరకు మాట్లాడుకోవడం నాకు ఇప్పటికి తాజ అనుభవంగా గుర్తుకు ఉంది.
 
కాలక్రమేణా వారిలో అత్యధికులు వృద్ధాప్యం కారణాన ఉద్యోగ విరమణ చేసి స్వదేశానికి వెళ్ళిపోగా మరికొందరు వివిధ కారణాల వలన కేవలం తమ వ్యక్తిగత జీవితానికి పరిమితమయ్యారు. ఇప్పుడు గల్ఫ్ లేదా ఉత్తర అమెరికా దేశాలలో ఉన్న వారిలో అత్యధికులు ఉస్మానియాతో సంబంధం లేని వారు కావడం మరో చేదు నిజం. ఉస్మానియా విశ్వవిద్యాలయం పేర ముందుకు వచ్చి అనేకులు వ్యక్తిగతంగా తాము ప్రయోజనం పొందారు తప్ప, తమ సామాజిక భాద్యతగా దాన్ని పెంపొం దించడానికి లేదా విస్తరించడానికి మాత్రం ఎవరూ కూడా ప్రయత్నించలేదు.
 
దేశంలోని కొన్ని ఇతర విశ్వవిద్యాలయాలు తమ దూరవిద్య కేంద్రాలను (ఆ కాలంలో నడపడానికి అనుమతి ఉండేది; ఇప్పుడు లేదు) గల్ఫ్ దేశాలలో ప్రారంభించగా ఈ విషయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్తిగా వెనుక బడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ గా ఉన్న యం.మల్లారెడ్డి, వి. రామకృష్ణయ్యల దృష్టికి ఈ విషయాన్ని నేను తీసుకెళ్లాను. వారిరువురూ ఈ దిశగా కొంత వరకు ప్రయత్నం చేసినా అది సఫలీకృతం కాలేదు.
 
ఉస్మానియా విశ్వవిద్యాలయంకు అనుబంధంగా కరీంనగర్ లో ఏర్పాటయిన శాతవాహాన పిజి సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి టి.అంజయ్య బాలునిగా ఉన్న నన్ను చేయి పట్టుకోని తన వద్ద కూర్చోబెట్టుకొన్నారు. ఇప్పుడు ఉస్మానియా కంటె ఒక వంతు కూడ వసతులు లేకున్నా అది ఇప్పుడు విశ్వవిద్యా లయంగా మారిందనేది మరో విషయం. దిగజారుతున్న ప్రమాణాలకు అది సంకేతమా లేదా అభివృద్ధికి నిదర్శనమా అనేది చెప్పలేం.
 
ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలలో ప్రవాసీయులను సైతం భాగస్వామ్యులు చేయాలని ముఖ్యమంత్రి సూచించినప్పటికి ఇప్పటికి గల్ఫ్ లో దానికి సంబంధించి ఏలాంటి ఛాయలు కూడ కనిపించడం లేదు.
మొహమ్మద్‌ ఇర్ఫాన్‌
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి