Modi-foreign-tour-details

విదేశీగడ్డపై మోదీ స్వదేశీ రాజకీయం

ప్రతి రంగంలోనూ తన విశిష్ఠతను చాటి చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ భారత విదేశాంగ విధానంలో కూడా ఒక ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నారు. జవహార్ లాల్ నెహ్రూ తర్వాత ఒక్క మోదీ మాత్రమే అన్నీ తానై దౌత్య నీతిని రూపొందిస్తున్నారు. వివిధ దేశాల అధినేతలతో వ్యక్తిగత సంబంధాలను పెంచుకోవడం ద్వారా జాతి ప్రయోజనాలను పరిరక్షిస్తున్నారు. అత్యంత కీలకమైన గల్ఫ్ దేశాలతో సంబం ధాల విషయానికి వస్తే మోదీ చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. ఇక్కడి అన్ని పాలక రాజులతో పాటు వారి కుటుంబ సభ్యులతో కూడా స్నేహాపూర్వకంగా వ్యవహారిస్తూ భారత్‌కు ప్రయోజనం చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో ఏ ప్రధానులు కూడా పర్యటించని విధంగా ఆయన గల్ఫ్ దేశాలలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇటీవల నాలుగు రోజులపాటు అరబ్బు దేశాలలో పర్యటించారు. రెండు సంవత్సరాల వ్యవధిలో రెండవసారి యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌ను సందర్శించిన మోదీ, మోదటిసారిగా ఒమాన్‌ను సందర్శించారు.

తన విదేశీ పర్యటనల సందర్భంగా వీలయినంత ఎక్కువ మంది ప్రవాసీయులను కలుసుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్న ప్రథమ భారత రాజకీయ నాయకుడు మోదీ. విదేశాలలో భారతీయులు ఎక్కువగా ఉన్న దేశాలలో ఎంపిక చేసిన కొందరు ప్రవాస ప్రముఖులను విదేశీ పర్యటనలకు వెళ్లే ప్రధానులు ఆయా దేశాలలోని భారతీయ ఎంబసీలు ఇచ్చే విందు సందర్భంగా కలుసుకోవడం జరిగేది. కానీ మోదీ ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టి వీలయినంతమంది సామాన్య ప్రవాసులను కలుసుకొనే విధానానికి శ్రీకారం చుట్టగా దీనికి అనూహ్యమైన స్పందన లభిస్తోంది.

భారత ఎంబసీ వర్గాలు, మోదీ అభిమానులు కూడా జనాల తరలింపు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. గల్ఫ్‌లో రెండేళ్ళ క్రితం దుబాయిలో శ్రీకారం చుట్టిన బహిరంగ సభల విధానం ఆదివారం మస్కట్‌కు చేరుకొంది. అంతకు ముందు ఖతర్, సౌదీ అరేబియా దేశాల సందర్శన సందర్భంగా కూడా బహిరంగ సభల నిర్వహణకు ప్రయత్నాలు జరిగినా అది సాధ్యం కాలేదు. విదేశాలలో బహిరంగ సభలను మోదీ పూర్తిగా స్వదేశీ రాజకీయ అవసరాల కొరకు వినియోగించుకొంటున్నారు. గత ప్రభుత్వాలను, వారి విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. మస్కట్ బహిరంగ సభను దాదాపుగా ఆయన కాంగ్రెస్‌ను విమర్శించడానికి ఉపయోగించుకొన్నారు. అంతకు ముందు దుబాయిలో జరిగిన ప్రవాసుల సమావేశంలో కూడా ‘దేశం ఆశలు వదులుకొన్న తరుణంలో ప్రజానీకం తనకు ఆవకాశం ఇచ్చింద’ని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుండి మాత్రమే అంతర్జాతీయ సమాజం భారతదేశాన్ని గుర్తిస్తుందని ఆయన చెబుతున్నారు. దానికి తగ్గట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది.

ఒక దేశంతో ఉన్న మైత్రిని పటిష్ఠం చేసుకోవడం ఇతర ఏ దేశానికైనా అంత సులువు కాదు. ద్వైపాక్షిక ప్రయోజనాలు ఎవరికి ఎంత మేరకు లబ్ధిని చేకూరుస్తాయన్న విషయాన్ని ఎదుటి పక్షాలు వివరించడంపై అది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు... భారత్‌లో పంటలు పండించడానికి అనుమతించాల్సిందిగా కొన్ని గల్ఫ్ దేశాలు వాజ్‌పేయి హయాం నుంచీ కోరుతున్నా అది ఇంకా అంగీకారానికి నోచుకోలేదు. ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వాలన్నీ తమ వంతుగా సంబంధాలను పెంపొందిచుకోవడానికి ప్రయత్నాలు చేసాయి. అలాంటి ప్రయత్నాలు మోదీ కూడా ప్రశంసనీయంగా చేస్తున్నారు. కానీ అంతకు ముందు ఏమీ జరుగలేదని చెప్పడం మాత్రం సమంజసం కాదు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ నిన్న మస్కట్‌లో చేసిన అనేక ఒప్పందాలలో గత ప్రభుత్వాలు శ్రీకారం చుట్టినవి కూడా ఉన్నాయి.

రాతి యుగం నుంచి వచ్చిన మానవుడికి తానే నాగరికత నేర్పినట్లుగా ఉంది విదేశీ సంబంధాల విషయంలో మోదీ ప్రచార శైలి. విదేశీ సంబంధాల ఘతనంతా తనకే దక్కాలని ఆయన ఆశిస్తున్నారు. చివరకు, భారత సందర్శనకు వచ్చే విదేశీ అతి‌థులు గాంధీ కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలవడానికి కూడా ప్రధాని సమ్మతించడం లేదు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు ఒక స్పష్టమైన విధానాన్ని అనుసరించడం వల్లనే నేడు గల్ఫ్ దేశాలలో 75 లక్షల మందికు పైగా భారతీయులు పని చేస్తున్నారన్నది గమనార్హం. ప్రధాని మోదీ వర్ణించినట్లుగా ‘‘భారతీయులు పాలలో పంచదార కలిసిపోయినట్లుగా ఇతరులతో కలిసిమెలిసి ఉంటారు’’. నిజాయితీగా కష్టపడి పని చేస్తారు. కాబట్టే మనవాళ్లను ప్రపంచ దేశాలు, మరీ ముఖ్యంగా గల్ఫ్‌ దేశాలు ఆదరిస్తున్నాయి.
మొహమ్మద్ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి