:: Welcome to NRI - Article ::

భాష తోడు లేని ఎడారిలో..

 

ఎడారి దేశాలకు జీవనోపాధికై వచ్చే తెలుగు రాష్ట్రాల గ్రామీణ మహిళలకు అరబ్బి భాషలో కనీస పరిజ్ఞానం వుండదు. స్థానికులతో మాట్లాడేటప్పుడు వీరు చెప్పేది అవతలి వ్యక్తులకు అర్థం కాదు, స్థానికులు చెప్పేది వీరికి అర్థం కాదు. ఇటువంటి పరిస్థితులలో సహజంగా జరిగే తప్పులు, పొరపాట్లు ఇరుపక్షాల వారికి అమితంగా ఇబ్బందులు కల్గిస్తున్నాయి.
 

ఎడారిలో ప్రయాణం. వందల కిలోమీటర్ల దూరం కారు డ్రైవింగ్ చేసి అలిసిపోయాను. నడి ఎడారి సమీపంలో ఆగి సేద దీరుతున్నాను. ‘వసంతం’ సినిమాలో నాకు నచ్చిన ‘అమ్మో...’ అనే పాట వింటున్నాను. పాట ఆనందంలో ఓలలాడుతూ, అటుగా వెళ్ళుతున్న ఒక యువకుడు ఉత్సాహంగా నా కారు సమీపంలోకి వచ్చిన విషయాన్ని గమనించలేదు. పాటలు వినడం పూర్తయిన తరువాతనే అతన్ని చూశాను. నా వైపు ఆసక్తిగా, ఆశగా చూస్తున్నాడు. మర్యాదగా పలుకరించగా ‘మీరు తెలుగు వారా అన్నా’ అని అడిగాడు. అవునని సమాధానం చెప్పి, అతని యోగక్షేమాలు విచారించాను. ఎక్కడలేని సంతోషంతో కాళ్ళ మీద పడ్డాడు. చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో మాట్లాడుతున్నట్లుగా ఆ ఎడారి మిత్రుడు చెప్పాడు, అదీ మాతృభాషా ఆత్మీయత...

కానీ బతుకుదెరువుకు కన్న ఊరు నుంచి వేలాది మైళ్ళ దూరం వచ్చిన వారికి స్థానిక భాష రాకపోతే అనేక సమస్యలు ఎదురవుతాయి. అవి కొన్ని సందర్భాలలో ప్రాణాలమీదకు వస్తాయి. ఈ ఎడారి దేశాలలో జీవనోపాధికై తెలుగురాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల నుంచి పలువురు మహిళలు వస్తున్నారు. వారికి పూర్తిగా తెలుగు మినహా మరే భాష వచ్చి వుండదు. కనీసం తెలిసి వుండదు. ఇటువంటి మహిళలు ఈ ఎడారి దేశాలలో ఏమైనా కేసులలో చిక్కుకొంటే ఇక వారికి దేవుడే దిక్కు. తమ గోడు వెళ్ళబోసుకోవడానికి లేదా తమపై ఆరోపణలు నిరాధారమైనవని చెప్పుకోవడానికి కూడా వారు దేవుడికి మొక్కాల్సి ఉంటుంది. న్యాయ స్థానంలో తమ భాషలో తమ వాదన వినిపించడానికి వీరికి ఆవకాశం వచ్చే సరికి జరగవల్సిన నష్టం జరిగిపోతుంది. బతుకు దాదాపుగా వ్యర్థమైపోతుంది.
 
సరిగ్గా ఇటువంటి విపత్కర పరిస్థితిలో సౌదీ అరేబియా జైలులో కడప జిల్లా మహిళ ఒకరు ఖైదీగా మగ్గిపోతున్నారు. స్వదేశంలో అమె భర్త మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్ళిపోగా ఆ దంపతుల సంతానమైన నలుగురు చిన్నారుల జీవితాలు ఛిన్నాభిన్నమైపోయాయి. కడప జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన పుటిక కృష్ణవేణి కేవలం భాషాపరమైన సమస్యతో మూడు సంవత్సరాలుగా కటకటాల వెనుక వెక్కి వెక్కి ఏడుస్తూ కాలం వెళ్ళదీస్తోంది. ఒక ఇంట్లో పని చేయడానికి సౌదీకి వచ్చిన కృష్ణవేణి అనారోగ్యంతో ఉన్న తన యాజమాని కూతురికి మందుకు బదులుగా నీళ్ళు ఇవ్వడంతో మరణించింది. దీంతో తన కూతురి మరణానికి కృష్ణవేణి నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కృష్ణవేణి జైలు పాలయింది. 2014 ఫిబ్రవరి నుంచి ఆమె జైలులో కునారిల్లుతోంది. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్‌తో పాటు పోలీసులు కూడా తన వాదనలు విన్పించడానికి ఆమెకు పూర్తి అవకాశమిచ్చారు.
 

అయితే తెలుగు భాష తప్ప మరో భాష రాకపోవడంతో కృష్ణవేణి తన వాదనను వినిపించలేకపోయింది. సైగల ద్వారా చెప్పే ప్రయత్నం కూడా చేసింది. ఇలా తన వాదనను చెప్పుకోవడానికి నానా అవస్థలు పడింది. సహాయం కొరకు అల్లాడిపోయింది.

జైలులో కృష్ణవేణిని కలిసిన భారతీయ ఎంబసీ అధికారులు కూడా భాషా పరమైన సమస్య కారణాన ఆమె వాదనను అర్థం చేసుకోలేకపోయారు. ఈ రకంగా రెండున్నర సంవత్సరాలుగా జైలులో మగ్గుతున్న కృష్ణవేణి కేసు గురించి జైలు అధికారులు న్యాయస్థానానికి చెప్పగా, న్యాయమూర్తులు ఆమె కేసుపై దృష్టి సారించారు. కృష్ణవేణితో ఆమె భాషలో మాట్లాడగల వ్యక్తుల గూర్చి గాలించగా కర్ణాటకకు చెందిన సయ్యద్ ముజాహీద్ అనే ఒక వ్యక్తి దొరికాడు. సయ్యద్‌ పూర్వీకులు అనంతపురం జిల్లాకు చెందిన వారు కావడంతో అతనికి తెలుగు తెలుసు. కృష్ణవేణి చెప్పిన విషయాలను అతను తెలుగు నుంచి అరబిక్‌ భాషలోకి అనువదించి న్యాయస్థానానికి నివేదించాడు. ఈ విషయాలతో నిజానిజాలు తెలుసుకున్న న్యాయమూర్తులు కృష్ణవేణిపై ఆమె యాజమాని మోపిన హత్యా నేరం ఆరోపణను త్రోసిపుచ్చారు.
 
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చెప్పుకోలేక ఒక మహిళ గతంలో పూర్తిగా ఒక సంవత్సరం జైలులో మగ్గింది. భాషాపరమైన కారణాన కడప జిల్లాకు చెందిన అనసూయ అనే మహిళ కూడ సుదీర్ఘ కాలం జైలులో గడిపింది.
 
ఒకసారి ఒక జైలులో హైదరాబాద్ నగరానికి చెందిన ఒక మహిళ, కామారెడ్డి జిల్లా తాడ్వాయి వాసి అయిన ఒక గిరిజన యువతి, తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండల వాస్తవ్యురాలు ఒకరు, కడప జిల్లా సుండుపల్లి మహిళ ఒకరు ఉండగా ఈ నలుగురి యాసలో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించిన తోటి భారతీయ మహిళలు విస్మయం చెందారు.
 
గల్ఫ్ దేశాలకు వచ్చే తెలుగు రాష్ట్రాల గ్రామీణ మహిళలకు అరబ్బి భాషలో కనీస పరిజ్ఞానం వుండదు. స్థానికులతో మాట్లాడేటప్పుడు వారు చెప్పేది అవతలి వ్యక్తులకు అర్థం కాదు, స్థానికులు చెప్పేది వీరికి అర్థం కాదు. ఇటువంటి పరిస్థితులలో సహజంగా జరిగే తప్పులు, పొరపాట్లు ఇరుపక్షాల వారికి అంటే అటు యజమానులకు ఇటు ప్రవాస తెలుగు మహిళలకు అమితంగా ఇబ్బందులు కల్గిస్తున్నాయి.
మొహమ్మద్ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

 

Loading...