:: Welcome to NRI - Article ::

పేద ప్రవాసులకు జీఎస్టీ పోటు

స్వదేశంలోని బంధుమిత్రులకు 20 వేల రూపాయల వరకు సామాన్లను బహుమతిగా ఎలాంటి పన్నులు చెల్లించకుండా ప్రవాసులు పంపించుకోవచ్చు. కేంద్రం 1993లో ఇచ్చిన ఈ వెసులుబాటును గల్ఫ్‌లోని ప్రవాసుల్లో అత్యధికులు సద్వినియోగం చేసుకొంటున్నారు. కేంద్రం ఇప్పుడు ఈ సదుపాయాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొని వచ్చి సగటు ప్రవాసుని నడుం విరగొట్టింది.

 
 భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చమురు దిగుమతులు కీలకపాత్ర వహిస్తున్నాయి. ఈ దిగుమతుల్లో పేద ప్రవాస కార్మికులు పరోక్షంగా ముఖ్య భూమిక వహిస్తున్నారు. పెట్రోలియం దిగుమతి బిల్లుకు విదేశీమారకం చెల్లింపుల సందర్భంగా గల్ఫ్ దేశాల నుంచి ప్రవాస కార్మికులు తమ కుటుంబాల ఖర్చు కొరకు పంపే డబ్బుకు భారతీయ రూపాయలతో సర్దుబాటు జరుగుతుంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థలో విదేశీ మారకం లోటు ఏర్పడడం లేదు. ఈ వాస్త వాన్ని విస్మరించి భారతదేశ పాలకులు గల్ఫ్‌లోని ప్రవాసుల సమస్యలపై చూసీచూడనట్లుగా వ్యవహరించడం జరుగుతోంది.
గల్ఫ్‌లోని సగటు భారతీయ ప్రవాసుడు తనకు తెలియకుండానే స్వదేశీ ఆర్థికవ్యవస్థలో ఈ రకమైన కీలక పాత్ర వహిస్తున్నాడు. ఈ పరిస్థితి అమెరికా, యూరోప్ దేశాల్లో లేదు, కేవలం ఒక్క గల్ఫ్‌లో మాత్రమే ఉంది. ఇలా పరోక్షంగా దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు సమకూర్చుతున్న ప్రవాసులకు కేంద్రం గానీ, రాష్ట్రం గానీ ఏమీ తిరిగి ఇవ్వకపోవడం ఎంతైనా బాధ కల్గిస్తోంది. పత్రికలు, రాజకీయ నాయ కులు అందరూ అమెరికా ప్రవాసుల జపం చేస్తారు గానీ ఎడారి బడుగుల గూర్చి ఎవరూ కించిత్‌ కూడా పట్టించుకోవడం లేదు.
 
స్వదేశంలోని బంధుమిత్రులు, పరిచయస్తులకు 20వేల రూపాయల సుంకం వరకు సామాన్లను బహుమతిగా (బంగారం, ఎలక్ట్రానిక్, ఇతర నిషేధిత వస్తువులు ఇందులో లేవు) ఎలాంటి పన్నులు చెల్లించకుండా ప్రవాసులు పంపించుకోవచ్చు. కేంద్రం 1993లో ఇచ్చిన ఈ వెసులుబాటును గల్ఫ్‌లోని ప్రవాసులలో అత్యధికులు సద్వినియోగం చేసుకొంటున్నారు. బంధుమిత్రులకు బహుమతిగా కాకుండా ఇంట్లో అవసరాలకు గల్ఫ్ నుంచి సామాన్లు పంపించుకోవడం జరుగుతోంది. పైగా విమానంలో వెంట తీసుకెళితే అధిక బ్యాగేజీ ధర సమస్య కాబట్టి ఈ–కార్గో విధానంద్వారా తక్కువ ధరకు పంపించుకోవడంతో కలిసి వచ్చింది. ఒక నెల వ్యవధి తర్వాత డెలివరీ జరుగుతుంది. ఈ సదుపాయాన్ని కార్మికులు ఎక్కువగా వాడుకొంటున్నారు. ఉద్యోగాలు కోల్పోయి స్వదేశానికి తిరిగివెళ్ళే వేలాది తెలుగు కుటుంబాలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చాయి. గల్ఫ్ వలసల ప్రభావం ఎక్కవగా ఉన్న తెలుగు రాష్ట్రాలలోని అన్ని జిల్లాల్లోనూ ప్రతినిత్యం ఈ రకమైన సామాన్ల డెలివరీ జరుగుతుంది.
 
కానీ కేంద్రం ఈ సదుపాయాన్ని హఠాత్తుగా రద్దు చేసింది. జూలై ఒకటి నుంచి దీన్ని పన్ను మినహాయింపు నుంచి తొలగించి జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి సగటు ప్రవాసుని నడుం విరగొట్టింది. జీఎస్టీ పన్ను విధానంలో అత్యధికంగా 28 శాతం పన్ను ఉండగా కేంద్రం దాంతో కలిపి ఏకంగా 41 శాతం పన్నును విధించింది. 28 శాతం జీఎస్టీ, 10 శాతం కస్టమ్స్‌ సుంకం, 3 శాతం విద్యా సెస్ కలిపి మొత్తం 41 శాతం పన్నును విధించడంతో ప్రవాసులకు పెద్ద విఘాతం కలిగింది.
 
నూతన పన్ను విధానం కారణాన గల్ఫ్ దేశాలలోని డోర్ టూ డోర్ డెలివరీ కార్గో కంపెనీలతో పాటు గల్ఫ్ విమానాశ్రయాలలో, భారతదేశంలోని విమానాశ్రయాలలోని కార్గో కాంప్లెక్సులలో టన్నుల కొద్ది సామాన్లు స్తంభించిపోయాయి. మొత్తం గల్ఫ్ నుంచి వేయి టన్నుల సామాన్లు భారతదేశంలో ఆగిపోగా ఒక్క సౌదీ నుంచే 500 టన్నులు ఉన్నట్లుగా సమాచారం. జూలై 1వ తేదీకి పూర్వం పంపిన సామాగ్రికి కూడా పన్ను చెల్లించాలని కస్టమ్స్‌ అధికారులు డిమాండ్ చేస్తుండడంతో ప్రవాసులు ఆందోళనకు గురవుతున్నారు.
 
స్వదేశంలో ఉద్యోగులు స్వీకరించే 50వేల రూపాయల వస్తువుల వరకు పన్ను మినహాయిస్తూ వెసులుబాటు ఇచ్చిన కేంద్రం, తమ చెమట కష్టంతో దేశానికి విదేశీ మారకం ఆర్జించి పెట్టే ప్రవాసులకు ఉన్న 20వేల మినహాయింపును రద్దుచేయడం ఏ విధంగానూ సమంజసంగా లేదు. జీఎస్టీ ముసాయిదాలో దీనిగూర్చి ముందుగా ఏమైనా ప్రస్తావన ఉంటే బహుశా కొంత వరకు నిరసన గళం వినిపించేది. అయితే జూన్ 30 వరకు ఈ రకమైన పన్ను విధింపు గూర్చి ఎటువంటి ప్రస్తావన లేదు. పైగా జీఎస్టీ అమలులోకి వచ్చిన వారం రోజులకు దీని గూర్చి కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. బాధాకరమైన విషయమేమిటంటే ఈ పేద ప్రవాసుల గోడు గురించి వివరించే నాథుడు కరువయ్యాడు. ప్రవాసుల సమస్యలపై క్షణాలలో ట్విటర్లపై స్పందించి చర్యలు తీసుకుంటున్నామని ఘనంగా చెప్పుకొనే ప్రభుత్వం దొంగచాటుగా పన్నుపోటు విధించడం విస్మయం కల్గిస్తోంది.
 
మొహమ్మద్ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి
Loading...