Fake-leaders-spread-False-news-about-Gulf-Deaths

డిజిటల్‌ నాయకులు!

ఆంధ్రజ్యోతి, 30-08-2017: దుబాయి నగరంలో సామాజిక సేవల పేరిట వ్యాపారాలు చేసుకొంటున్న వారికి కొదవ లేదు. ఫేస్‌బుక్ ద్వారా వీలయినంతగా మార్కెట్ చేసుకొంటారు. నష్టపరిహారమే ధ్యేయంగా పనిచేసే ఈ డిజిటల్‌ నాయకులకు ఇటు తెలంగాణలోను, అటు ఆంధ్రప్రదేశ్‌ లోను కమీషన్ ఏజెంట్లు ఉన్నారు.
 
శరవేగంగా విస్తరిస్తోన్న సమాచార సాంకేతిక విప్లవంలో పెరిగిపోతోన్న సామాజిక మాధ్యమాలు నేటి సమాజంలో కీలకపాత్ర వహిస్తున్నాయి. ప్రత్యేకించి ప్రవాసుల విషయానికొస్తే అగాధాన్ని పూడ్చడమే కాకుండా వారధిగా పనిచేస్తున్నాయని చెప్పవచ్చు. వేల మైళ్ళ దూరంలో వున్న సుదూర ఎడారుల నుంచి క్షణాల్లో తమ కుటుంబాలకు సమాచారమందిస్తూ తమ మంచి చెడుల విషయాన్ని చెప్పే అవకాశం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అతి సామాన్యులకూ కల్పించింది.
 
నాణేనికి మరోవైపు కూడా చూసి తీరాలి. సామాజిక మాధ్యమాల వినియోగంలో అనేక సందర్భాల్లో వాస్తవ విరుద్ధ సమాచారం విస్తృతంగా ప్రచారమవుతున్నది. అంతేకాదు చౌక బారు ప్రచారానికి సామాజిక మాధ్యమాలను వాడుకోవడం పెరిగిపోతోంది. సామాజిక మాధ్యమాల కారణాన ఇటీవల కాలంలో అనేక మంది డిజిటల్ నాయకులు పుట్టుకొస్తున్నారు. చావు కబురు వచ్చిందంటే చాలు పండుగ వచ్చినట్టుగా వీరు మురిసిపోతారు! శవాల మీద పేలాలు ఏరుకొనే తరహా వ్యక్తులు ఈ నాయకమ్మన్యులు అనడం సత్యదూరం కాదు. దేశం కాని దేశంలో ప్రాణాలు కోల్పోయిన వారి శవాల చుట్టూ తిరుగుతూ ప్రచారం చేయించుకోవడం ప్రారంభిస్తారు. వీరు వ్యవహరించే తీరు ఎంతైనా జుగుప్స కల్గిస్తోంది. చనిపోయిన వారి ఆత్మీయులు విషాదంలో మునిగి ఉంటే ఈ నాయక మహాశయులు మాత్రం ఫోటో ఫోజులకై పాకులాడుతుంటారు! పైగా ఉద్యోగపరమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న అభాగ్యుల ద్వారా బలవంతంగా ఫేస్‌బుక్‌లో జై కొట్టించుకుంటారు. ఈ యావ ఇటీవల మరీ పెరిగిపోయింది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఎలాంటి పనిచేయకుండా కేవలం ప్రచారంతో అదరగొట్టడం ఈ డిజిటల్‌ నాయకుల ప్రత్యేకత!
 
ముగ్గురు చిన్నపిల్లల తండ్రి ఒకరు ఇటీవల విషాదకర పరిస్ధితులలో మరణించాడు. మృతుని బంధువులు ఏడ్చుకొంటూ దూరప్రాంతాల నుండి వచ్చి మరణకేసుకు సంబంధించిన అధికార ప్రక్రియలు పూర్తిచేయడానికి అవసరమైన సహాయం కొరకు తిరుగుతుండగా తెలంగాణకు చెందిన ఒక నాయకుడు తారసపడ్డాడు. మృతుడు వీసా కొరకు చేసిన బాకీ కూడా తీరలేదని అతని ఆర్థిక పరిస్థితిపై విచారం వ్యక్తంచేయగా సదరునాయకుడు మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం మేం చేస్తాం, మీరు కెమెరా ముందు మమ్ములను ప్రశంసిస్తూ రెండు నిమిషాలు మాట్లాడాలని కోరాడు. మరో నాయకుడైతే ఏకంగా, ఒక యువవితంతువుకు పునర్వివాహం చేయిస్తానని ఆమె బంధువులకు ప్రతిపాదించాడు! దీనిపై పెద్ద గొడవ జరిగింది. మరో కేసులో స్వదేశానికి వెళ్ళడానికి మార్చురీలో సిద్ధంగా ఉన్న ఒక మృతదేహాం వద్ద కొందరు నాయకులొచ్చి ఫోటో దిగారు. మృతుడి సోదరుడిని పక్కకు జరిపి మరీ ఫోటోదిగడం, వెంటనే తమ స్వస్థలానికి పంపడం మరుసటిరోజు అక్కడి పత్రికల్లో వార్త రావడం చకచకా జరిగిపోయింది.
 
దుబాయిలో అభాగ్యులకు సామాజిక సేవ పేరిట వ్యాపారాలు చేస్తున్న వారికి కొదవలేదు. అనారోగ్యంతో మరణిస్తే ఎవరూ ముందుకు రారు. అదే రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు తెలిస్తే మాత్రం కాకుల్లా వాలుతారు. ఫేస్‌బుక్ ద్వారా వీలైనంత మార్కెట్ చేసుకొంటారు. నష్టపరిహారం ధ్యేయంగా పనిచేసే ఈ డిజిటల్‌ నాయకులకు ఇటు తెలంగాణలోను, అటు ఆంధ్రప్రదేశ్‌లోను కమీషన్ ఏజెంట్లు ఉన్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఆకలితో అలమటిస్తూ సహాయం కొరకు ఆశానిరాశలతో తోచిన ప్రతి తలుపు తట్టే కొందరు ఆభాగ్యులకు ఒక నాయకుడు సోషల్ మీడియా ద్వారా అందుబాటులోకి వచ్చాడు. ఫలాన నాయకుల ద్వారా మీ కేసు విషయమై ఎంబసీపై ఒత్తిడి తీసుకొస్తున్నామంటూ అభయమిచ్చాడు. ఆ తరువాత, నాకు అవార్డు రావాలి, అందుకు మీరందరూ కలిసి ఫేస్‌బుక్‌లో లైక్ కొట్టడమే కాదు తనను పొగుడుతూ వీలైనంత మందికి షేర్ చేయి అంటూ హితోపదేశం చేశాడు.

భౌతికకాయాలను స్వదేశానికి తీసుకురావడంలో తనదొక రికార్డు అని చెప్పుకోనె మరో ప్రబుద్ధుడు శవాలను తెప్పిస్తానంటూ మృతుల కుటుంబీకుల నుంచి డబ్బు తీసుకొంటూ సహాయం చేస్తున్నట్లు పత్రికల్లో ప్రచారం చేసుకుంటున్నాడు. నాయకుడినని చెప్పుకొనే మరో వ్యక్తి, హైదరాబాద్ నుంచి ఉత్తర తెలంగాణకు వెళ్ళే గల్ఫ్ శవాలను ట్యాంకుబండ్‌పై ఆపి డప్పులతో ఊరేగించి స్థానిక నాయకులను తిడుతూ ఆ తర్వాత సాగనంపి మృతుల బంధువులకు కారు అద్దె చెల్లించడం జరుగుతోంది! ఇది సోషల్ మీడియా సాక్షిగా జరుగుతున్న తమాషా!

మొహమ్మద్ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి