Difference-between-Gulf-countries-and-Trump

అరబ్‌ ఆర్థిక వివేకం

గల్ఫ్‌ దేశాలలో నిరుద్యోగుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నది. ఇది కాదనలేని సత్యం.ఈ ఎడారి దేశాలలో అమెరికన్లతో సహా ప్రపంచంలోని వందకు పైగా దేశాలకు చెందిన వారు పని చేస్తున్నారు. ఇది, అరబ్‌ దేశాల రాచరిక పాలకుల దూరదృష్టి, విశాల వైఖరికి సంకేతం అనడంలో సందేహం లేదు.
 
స్థానికులకు ఉపాధి అవకాశాలు అనేది ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా చాలా సున్నితమైన ఆంశం. అవకాశాలు దక్కని అసంతృప్తి యువతలో పెరిగిపోవడం సహజంగా ఏ ప్రభుత్వానికీ కూడా శ్రేయస్కరం కాదు. దేశం మారినా కాలం మారినా మౌలికంగా ఈ అంశం స్వభావం మాత్రం మారలేదు. హైద్రాబాద్ లో నాటి ముల్కీ నుంచి గల్ఫ్ లో నేటి నితాఖత్, అమెరికాలో రేపటి హెచ్.1 బి వీసాల వరకు, ఇది స్ధానికులకు, స్ధానికేతరులకు మధ్య జరిగే ఒక రకమైన ప్రచ్ఛన్న ఆర్థిక యుద్ధం అని చెప్పవచ్చు. స్వల్ప వేతనం పై నాణ్యతతో కూడిన పని చేయడం ద్వారా అధిక లాభాలు అనే కీలక ప్రాథమిక సూత్రం ఇక్కడ మూలకుపడి భూమి పుత్రులమనే భయంకరమైన భావం ప్రబలి అది ఒక విచ్ఛిన్నకరమైన జాతీయ భావానికి దారి తీస్తుంది.
 
ఈ సంకుచిత జాతీయ వాదం, హిట్లర్ దురహంకారానికి బలైన ఆస్ర్టియా లో ఇటీవలి కాలంలో తొలుత మళ్ళీ పునరావృతమయింది. గత కొంత కాలంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి యూరోప్ ఖండంలో పెచ్చరిల్లి ఇ.యు. నుంచి బ్రిటన్ నిష్క్రమణకు దారితీసింది. దరిమిలా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికతో ఈ సంకుచిత జాతీయవాదం పరాకాష్టకు చేరుకొంది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆర్థికాభివృద్ధి ఫలాలను ఇప్పుడిప్పుడే ఆస్వాదిస్తున్న భారత్‌కు, పాశ్చాత్య దేశాలలో జాతీయవాద ధోరణులు పెట్రేగిపోవడం ఎంతైనా ఆందోళన కల్గించే ఆంశం (మోదీ పరివారం కూడ ఇదే రకమైన జాతీయ భావజాలంతో ప్రశ్నించే హక్కును కాలరాస్తుందనేది మరో విషయం).
 
దుబాయిలో అల్ నఖ్వీబినీ లేదా రియాద్‌ లో అల్ షమ్రానీ యువతకు బదులుగా ఎక్కడో భారత,పాకిస్తాన్ దేశాలకు చెందిన ఉద్యోగులు వచ్చి ఎందుకు పని చేస్తున్నారు? తెలంగాణ జిల్లాలలో స్ధానిక సుతారులు కాకుండా ప్రకాశం జిల్లా మేస్త్రీలు ఎందుకు పని చేస్తున్నారో సరిగ్గా అవే కారణాలతో అమెరికాలో శ్వేత జాతీయులకు బదులుగా భారతీయ యువజనులు పని చేస్తున్నారు. ఆయా దేశాలలో అందుబాటులో ఉన్న మానవ వనరులు, ఆర్థికాంశాలు, వ్యాపార ప్రయోజనాలతో ముడిపడి ఉన్న వ్యవహారం తప్ప ఇది ఏ రకంగా కూడ ఒక హక్కు కాదు. ఏ దేశంలో ఎవరిని ఏ వేతనాల పై నియమించుకోవాలో ఆయా దేశాలలోని స్ధానిక పరిస్ధితుల పై ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప దబాయించి ద్వైపాక్షిక సంబంధాల పరిధిలో చర్చించే మౌలిక అంశం ఏ మాత్రం కాదు. భారత్‌ 21 వ శతాబ్ది అగ్రరాజ్యం అని సగర్వంగా చాటుకొంటున్న భారతీయులు ఇంకా వీసాల కట్టుబాట్ల నుంచి బయటపడకపోవడం అశ్చర్యం కల్గిస్తుంది. దక్షిణా కొరియా, జపాన్, చైనా మారిన కాలానికి అనుగుణంగా అమెరికాతో వ్యాపారాత్మక పంథాతో వ్యవహరిస్తుండగా మనం మాత్రం హెచ్1బి చుట్టు తిరుగుతున్నాం.
 
ఇక డొనాల్డ్ ట్రంప్ విషయానికి వస్తే, ఇంతకు ముందు పేర్కొన్నట్లుగా ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న ఒక రకమైన కుహనా జాతీయవాదానికి ఆయన ఒక తిరుగులేని ప్రతినిధి. అందునా ఆయన ప్రపంచ అగ్ర రాజ్యానికి అధినేత కావడంతో అందరు ఉలిక్కిపడుతున్నారు. ఒక స్పష్టత లేని దిశగా జాతీయవాదాన్ని ప్రోత్సహిస్తున్న ట్రంప్‌కు, అమెరికాలో స్ధానికులకు ఉపాధి ఆవకాశాలను మెరుగుపర్చడం అనివార్యమైంది. మన దగ్గర మా నీళ్ళు, మా ఉద్యోగాలు అని చెప్పినట్లుగా అక్కడ ట్రంప్ కూడ చెప్పుతున్నారు. కొత్త ఉద్యోగాల సృష్టి అవసరమే. అయితే ఆ లక్ష్య సాధనలో ఆయన ఎంత వరకు సఫలీకృతులవుతారో కాలమే చెప్పాలి. ట్రంప్‌ మహాశయుడు అమెరికాను అబ్రహం లింకన్ బాటలో తీసుకెళ్తారా లేక అమెరికా ఫస్ట్‌ అనే జాతీయభావంతో హిట్లర్ ను అనుసరిస్తారో ఇప్పుడే చెప్పలేము. ట్రంప్‌లో హిట్లర్‌ లక్షణాలు, భావాలు నిండుగా వున్నాయని ఆ జర్మన్‌ నియంత జీవితచరిత్ర కారుడు రోన్ రోసెంబౌం ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం.
 

ఒక వైపు దేశ పురోగతి, ఆర్ధిక ప్రయోజనాలు మరో వైపు ప్రజలలోని స్ధానిక భావోద్వేగాలను గమనిస్తూ సమతుల్యతను పాటిస్తూ అభివృద్ధి ఫలాలను అందరికీ పంచి పెట్టేవాడు అధి నాయకుడు. స్ధానిక అరబ్బుల నుంచి వ్యతిరేకత ఎంతగా వస్తున్నప్పటికీ గల్ఫ్ దేశాలలోని పాలక రాజ వంశాలు ఈ సున్నితమైన వ్యవహారాన్ని చాల చక్కగా, సందర్భానుసారం సంయమనంతో సాగిస్తున్నాయి. కనుకనే ఈ ఎడారి దేశాలు అనతికాలంలో శరవేగంగా అభివృద్ధి పథంలో మున్ముందుకు దూసుకెళ్తున్నాయి. ఒక వైపు నిరుద్యోగుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నది. ఇది కాదనలేని సత్యం. అయితే ఈ ఎడారి దేశాలలో అమెరికన్లతో సహా ప్రపంచంలోని వందకు పైగా దేశాలకు చెందిన వారు పని చేస్తున్నారు. ఇది, అరబ్‌ దేశాల రాచరిక పాలకుల దూరదృష్టి, విశాల వైఖరికి సంకేతం అనడంలో సందేహం లేదు.

మొహమ్మద్‌ ఇర్ఫాన్‌
ఆంధ్రజ్యోతి గల్ఫ్‌  ప్రతినిధి