Chandrababu-Dubai-tour-and-NRIs-problems

దుబాయిలో చంద్రబాబు

మలయాళీ ప్రవాసులతో బహుశా తెలుగు ప్రవాసులు ఎప్పటికీ పోటీపడలేకపోవచ్చు. అయితే ఒక తెలుగురాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లకు కేరళ ముఖ్యమంత్రి పర్యటనను స్ఫూర్తిగా తీసుకోవడంలో తప్పేముంది?
 
నవ్యాంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆయన పలుమార్లు ఈ ఎమిరేట్‌ను సందర్శించారు. అయితే అధికారిక, వ్యక్తిగత సమావేశాలకు మాత్రమే ఆయన పరిమితమమ్యే వారు. సాధారణంగా స్థానిక ప్రవాసాంధ్రులను కలుసుకోవడానికి ఇష్టపడేవారు కాదు. హైదరాబాద్‌లోని ఒక ఆర్థిక సంస్థ మూలంగా మోసపోయినవారు చంద్రబాబును కలిసేందుకు అనేక విధాల ప్రయత్నించినా ఆ ప్రయత్నం సఫలం కాలేదు. ఒక సందర్భంగా దుబాయిలోని భారతీయ కాన్సులేటు, చంద్రబాబుతో ప్రవాసుల సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించింది. అయితే ఆయన ఆనాసక్తి చూపడంతో మన దౌత్యవేత్తలు తమ ప్రయత్నాలను విరమించారు. దుబాయిలో చంద్రబాబును కలుసుకోవాలంటే అప్పట్లో ఆయన కార్యదర్శిగా పని చేసిన ఐఏయస్ అధికారి రణదీప్ సూడన్ అనుమతి అవసరమయ్యేది. ఆ అధికారి సాధారణంగా చంద్రబాబును కలుసుకోవడానికి ఎవర్నీ అనుమతించే వారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఎ.పి. జితేందర్ రెడ్డి గల్‌్ఫలో ఉన్నప్పుడు చంద్రబాబుతో ప్రవాసుల సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. అయితే రణదీప్ అంగీకరిస్తే తనకు అభ్యంతరం లేదని చంద్రబాబు చెప్పారు. రణదీప్ అంగీకరించలేదని ప్రత్యేకంగా చెప్పాలా?
 
సరే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దుబాయిలో పర్యటించడానికి సంసిద్ధమయ్యారు. ఆయన పర్యటన కార్యక్రమాలు కూడా ఖరారయ్యాయి. ఇంతలో విశాఖపట్నంపై తుఫాను విరుచుకుపడడంతో ఆ పర్యటన రద్దయింది. ఇప్పుడు ఆయన అమెరికా, బ్రిటన్‌ వెళుతూ మార్గమధ్యంలో దుబాయి, ఆబుధాబి పర్యటనకు వచ్చారు.
 
ఈ పర్యటనల సందర్భంగా అంధ్రప్రదేశ్‌లో, ప్రవాసాంధ్రుల సంక్షేమానికి సంబంధించి కొన్ని పథకాలను చంద్రబాబు ప్రకటించారు. ఆ పథకాల అమలుకు 40 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు కూడా వెల్లడించారు. ఈ పర్యటనలలో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి చంద్రబాబు చేసిన ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. ఒక ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా అంతకుమించి ఆయన నుంచి ప్రవాసులు ఏమైనా ఆశిస్తే అది తప్పిదమే అవుతుంది. 2001లో హైదరాబాద్‌కు ఏమిరేట్స్ విమానం సర్వీసును ప్రారంభించడంలో చంద్రబాబు కీలక పాత్ర వహించారు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా వుండేవారు. అంతేగాక కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఆయనకు బాగా పలుకుబడి ఉండేది. అసాధారణ రీతిలో, వార్షిక ద్వైపాక్షిక సంబంధాలతో సంబంధం లేకుండా ఏమిరేట్స్ ఎయిర్‌లైన్‌్సకు ఆయన అనుమతి ఇప్పించడం అప్పట్లో సంచలనమయింది. అయితే ఇప్పుడు కస్టమ్స్‌ అధికారుల పోస్టుల మొదలు విమానాల సీట్ల కోటా వరకు మోదీ సర్కారు సహాయం కొరకు ఆయన ఎదురు చూడవల్సిన పరిస్థితి. దీంతో దుబాయిలో చంద్రబాబు ప్రవాసుల నుద్దేశించి చేసిన ప్రసంగంలో పెద్దగా మాట్లాడలేదు.
 
ఖతర్ మినహా గల్ఫ్ దేశాలన్నింటిలోనూ తెలుగు దేశం పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో వున్నారు. వారితో పాటు ఏపీ ఎన్నార్టీ కో ఆర్డినేటర్లు కూడా దుబాయికు తరలి వచ్చారు. వీరంతా ఒకచోట సమావేశం కావడం బహుశా ఇదే ప్రథమని చెప్పవచ్చు. అయితే ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదని అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రితో గానీ లేదా సంబంధిత మంత్రి కొల్లు రవీంద్ర లేదా ముఖ్యమంత్రి సలహాదారు రవి వేమూరితో గానీ సమావేశమై ప్రవాసుల సంక్షేమ విధి విధానాల అమలు, కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడం జరగలేదు.
 
కొల్లు రవీంద్ర, రవి వేమూరి అనుభవరాహిత్యం కొట్టవచ్చినట్లుగా కనిపించింది. జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ ప్రతి శుక్రవారం (ఇక్కడ ఆదివారం కాదు) చర్చిలలో ఆయన అభిమానులు ముఖ్యంగా మహిళాభిమానులు ప్రార్థనలు చేయడం కద్దు. ప్రతిపక్ష నాయకునికి అంతమంది అభిమానులు ఉన్న ఈ ప్రాంతంలో తెలుగుదేశాన్ని బలపర్చే రాజకీయ దిశగా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న సభ నిర్వహణ తీరు సక్రమంగా లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం సభా నిర్వహణ బాధ్యతను ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఎన్నార్టీకి అప్పజెప్పగా ఆ సంస్థ అధికారులు దుబాయిలో ఏలాంటి అనుభవం లేని కొందరికి సభ నిర్వహణ బాధ్యతను అప్పగించి చేతులు దులుపుకున్నారు. దీంతో సమన్వయం కొరవడి ఎవరికి తోచిన విధంగా వారు వ్యవహరించారు. గల్‌్ఫలో మలయాళీ ప్రవాసులతో బహుశా మనం ఎప్పటికీ పోటీపడలేకపోవచ్చు. అయితే ఒక తెలు గురాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లకు కేరళ ముఖ్యమంత్రి పర్యటనను స్ఫూర్తిగా తీసుకోవడంలో తప్పేముంది?
మొహమ్మద్ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి