women-killed-her-husband-

భర్తను చంపేసి.. తప్పించుకోవాలని.. భార్య చేసిన పని..

టెక్సాస్: భర్తను చంపేయాలని భార్య ప్లాన్ చేసింది. ఆమెపై అనుమానం రాకుండా ఎలా చంపాలా అని ఇంటర్‌నెట్‌లో సర్చ్ చేసింది. అదే ఆమె చేసిన పెద్ద తప్పయింది. టెక్సాస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనవరి5న శాండ్రా లూయిస్ గార్నర్(55) అనే వ్యక్తి తన ఇంట్లో దారుణ హత్యకు గురయ్యాడు. వెంటనే పోలీసులకు భార్య ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ ఇంటికి చేరుకుని విచారణ మొదలుపెట్టారు. భార్య చెప్పిన వివరాలు నోట్ చేసుకున్నారు. ఒక వ్యక్తి తన కళ్ల ముందే శాండ్రాను కాల్చి చంపాడని ఆమె పోలీసులతో చెప్పింది. 18 వేల డాలర్లు కూడా ఎత్తుకెళ్లాడంది. ఏవో వ్యాపార లావాదేవీల కారణంగానే ఆయనను హత్య చేసినట్లు హంతకుడు తనతో చెప్పాడని పోలీసులకు తెలిపింది. అయితే పోలీసులు ఆమె మాటలను పూర్తిగా నమ్మలేదు. వచ్చిన వ్యక్తి ఆమె ముందే భర్తను చంపితే ఆమెను ఎందుకు వదిలిపెట్టాడని ఆరా తీయడం మొదలుపెట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. శాండ్రా భార్య మొబైల్ ఫోన్ డాటాను విశ్లేషించారు. హత్యకు రెండు రోజుల ముందు నుంచి ఒక వ్యక్తిని హత్య చేసి ఎలా తప్పించుకోవాలనే విషయాన్ని పదే పదే ఇంటర్‌నెట్‌లో ఆమె సెర్చ్ చేసిందని పోలీసులు కనుగొన్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. భర్తను తానే హత్య చేయించానని శాండ్రా భార్య ఒప్పుకుంది. వెంటనే ఆమెను కోర్టులో ప్రవేశపెట్టామని పోలీసులు తెలిపారు.