women-in-great-trouble-in--america

కన్నతండ్రి, కన్నకూతురు కొన్ని రోజుల్లోనే చనిపోనున్నారని...

ఫ్లోరిడా: నా అనుకున్నవారు చనిపోతారని తెలిస్తే వ్యక్తమయ్యే ఆ బాధ వర్ణనాతీతం. అలాంటిది జన్మనిచ్చిన తండ్రి, కడుపున పుట్టిన గారాల పట్టి, ముద్దుముద్దు మాటలు చెప్పే కూతురు ఇద్దరూ మరికొన్ని రోజుల్లోనే చనిపోతారని తెలిసిన ఓ మహిళ దారుణమైన పరిస్థితి ఇది. 

 
భరించలేని ఈ పరిస్థితి ఓ మహిళకు ఎదురైంది. అమెరికాకు చెందిన అల్లీ పార్కర్ అనే మహిళకు 5 ఏళ్ల వయసున్న బాలిక ఉంది. బాలికకు ప్రాణాంతకమైన బ్రెయిన్ క్యాన్సర్ సోకింది.  క్యాన్సర్ వల్ల బాలిక ఆరోగ్యం పూర్తిగా క్షిణించింది. కొన్ని వారాల్లో బాలిక కనుమూయనుందని వైద్యులు వెల్లడించారు. ముద్దులొలికే కన్నకూతురు చనిపోనుందనే విషాదమే కాకుండా జన్మనిచ్చిన తండ్రి ప్రాణాంతకమైన నాడీ సంబంధిత వ్యాధితో కన్నుమూయనున్నాడనే మరో వార్త ఆమెను కుంగదీసింది. ఇద్దరినీ చూస్తూ కంటికి విడుపు లేకుండా ఏడుస్తోంది. ఈ దు:ఖాలు చాలవన్నట్లు ఇప్పటికే ఆమె ఆర్థికంగా నలిగిపోయింది. ప్రభుత్వం కల్పించే ఆరోగ్య భీమాకు మించి డబ్బులు ఖర్చువ్వడంతో ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. బాధిత మహిళ ఆర్థికంగా కోలుకోవాలని కోరుకుంటున్న ఆమె సన్నిహితులు గోఫండ్‌మీ ద్వారా సహాయ నిధులను సేకరిస్తున్నారు. 3 లక్షల డాలర్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కష్టాల్లో ఉన్న బాధితురాలికి సహాయంగా నిలిచేందుకు ఆమె సన్నిహితులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని బాధితురాలు ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన కూతురు పక్కన కూర్చుని ఏడుస్తున్న తండ్రి ఫోటోను అప్‌లోడ్ చేసింది. ఈ ఫోటోను చూసినవారు చలించిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ కోరుతున్నారు.