:: Welcome to NRI - Article ::

కొడుకు చనిపోయాడని నమ్మించి.. తప్పుచేసింది

నెవడా: డబ్బు సంపాదించాలంటే కేవలం కష్టపడాల్సిన అవసరంలేదని ఓ మహిళ భావించింది. జనాలను మోసం చేసి కష్టపడకుండా డబ్బు సంపాదించేందుకు ఓ ప్రణాళికను రచించింది. 10 ఏళ్ల వయసున్న తన కొడుకుని పావుగా వాడుకుని జనాలను నమ్మించింది. ప్రాణాంతక వ్యాధి లుకేమియాతో తన కొడుకు బాధపడుతున్నాడని, అతి త్వరలోనే చనిపోనున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. తన కొడుకుకు కొన్ని చివరి కోరికలు ఉన్నాయని ఓ లిస్ట్ బయటపట్టింది. భారీ షాపింగ్ లిస్ట్‌, హెలీకాఫ్టర్‌లో ఒకసారి ప్రయాణం, గిఫ్ట్ కార్డ్స్, డబ్బులు కావాలంటున్నాడని పేర్కొంది. తాను ముగ్గురు పిల్లల తల్లినని, పిల్లల పోషణకు తానొక్కదాన్నే కష్టపడుతున్నానని, తన కొడుకు చివరి కోరికలు తీర్చేందుకు సహాయపడాలని నెటీజన్లను ‘గో ఫండ్ మీ’ వెబ్‌సైట్ ద్వారా కోరింది. దీంతో చలించిన కొందరు నెటీజన్లు దాదాపు లక్షా 29 వేల రూపాయలను చందాలుగా ఇచ్చారు. కొన్ని రోజుల అనంతరం బాలుడు చనిపోయినట్లుగా చిత్రీకరించింది. ఓ సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్నట్లు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కొన్ని రోజుల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితురాలు మోర్రీసన్‌, ఆమెకు సహకరించిన ముగ్గురు పిల్లలపై కేసులు నమోదు చేశారు. మోర్రీసన్‌ను జైలుకి తరలించారు. 2 లక్షల 50 వేల రూపాయల వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. కేసును పూర్తిగా విచారణ చేసిన అనంతరం నిందితురాలికి 20 ఏళ్ళ జైలు శిక్ష, 1 లక్షా 25 వేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ ఘటన అమెరికాలోని నెవడా నగరంలో జరిగింది.

Loading...