US-man-shot-by-his-own-dog

యజమానిని తుపాకీతో కాల్చిన శునకం

వాషింగ్టన్: ఓ వ్యక్తికి తన పెంపుడు శునకం భారీ షాకిచ్చింది. తుపాకీతో కాలిపై కాల్చింది. ఇదేలా సాధ్యం ?.. నమ్మశక్యంగా లేదే?.. అని సందేహిస్తున్నారా ?.. అయితే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే. అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన 51 ఏళ్ల రిచర్డ్ రెమ్మె తన పెంపుడు శునకాలు పిట్ బుల్, లబ్రాడర్‌తో ఆడుకుంటున్నాడు. రిచర్డ్ ఒళ్లోకి దూకే క్రమంలో రెండు శునకాలు ఢీకొన్నాయి. పక్కకు పడబోయిన పిట్ బుల్ ఫోర్ట్ డొడ్జ్.. రిచర్డ్ వద్దనున్న తుపాకీపై పడింది. శునకం ఓ కాలు తుపాకీ ట్రిగ్గర్‌పై మరో కాలు థంబ్ సేఫ్టీని బలంగా తాకడంతో తుపాకీ పేలింది. దూసుకొచ్చిన ఒక బుల్లెట్ రిచర్డ్ కాలులో దిగింది. బాధితుడు రిచర్డ్‌ను హాస్పిటల్‌కు తరలించాల్సి వచ్చింది. చికిత్స అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రిచర్డ్ జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేసుకుని బాధపడుతున్నాడు. సోఫాపై తన పెంపుడు శునకంతో ఆడుకుంటుండగా ఈ పరిస్థితి ఎదురైందని వాపోయాడు. తన పెంపుడు శునకం తుపాకీతో కాల్చిందని రిచర్డ్ నుంచి ఫిర్యాదు విని నమ్మలేకపోయామని, ఘటనాస్థలానికి వెళ్లిన తర్వాత మాత్రమే నమ్మగలిగామని స్థానిక పోలీసులు తెలిపారు. అమెరికాలో మాత్రమే కుక్కలు మనుషులను కరుస్తాయంటూ పలువురు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.