US-man-makes-hilarious-goof-up-on-first-day-of-new-job

అమెరికాలో యువకుడికి మొదటిరోజు జాబ్‌లో వింత అనుభవం..

మొదటిరోజు ఉద్యోగానికి వెళ్లేటప్పుడు ఎవరిలోనైనా కొంత భయం, కొంత ఉత్సాహం ఉంటుంది. అలాంటి సమయంలో ఆఫీసుకు వెళ్లిన వెంటనే సహోద్యోగులు పూలు, బహుమతులతో స్వాగతం చెప్తే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. అమెరికాలో మొదటి రోజు ఉద్యోగానికి వెళ్లిన జాన్ కీకీ అనే వ్యక్తికి కూడా ఇదే ఆనందం కలిగింది. అయితే ఆ ఆనందం ఎంతో సేపు ఉండలేదు. అదేంటి అనుకుంటున్నారా?

జాన్ కీకీ తన ఉద్యోగం మొదటిరోజున ఆఫీసుకు వెళ్లి తన డెస్క్‌లో కూర్చున్నాడు. డెస్క్‌లో పూలు, బహుమతులు పెట్టి ఉన్నాయి. మనోడు ఆ పూలతో సెల్ఫీలు కూడా తీసుకున్నాడు. ఇంతలో సహోద్యోగి ఒకరు వచ్చి ఆ పూలు, బహుమతులు తీసుకుని ఇవన్నీ వేరే వారి కోసం ఏర్పాటు చేసినవి అని చెప్పారు. అంతే జాన్‌కు ఒక్కసారిగా ఏం అర్థం కాని పరిస్థితి. ఉద్యోగంలో చేరిన మొదటిరోజే తనకు వింతైన అనుభవం కలిగిందని జాన్ తాను దిగిన ఫొటోను ట్విటర్‌లో పెట్టాడు. తనకు ఎదురైన పరిస్థితిని సరదాగా అందరితో పంచుకున్నాడు. ‘ప్రసూతి సెలవు కోసం వెళ్తున్న ఉద్యోగి కోసం పెట్టిన పూలు, బహుమతులు నా కోసమే అనుకుని వాటితో ఫొటోలు కూడా తీసుకున్నా. నా ఆఫీసులో కొత్తగా చేరిన వారికి అసలు పూలే ఇవ్వరంట. నేను ఏకంగా ఫొటోలు కూడా తీసుకుంటుండటంతో కంపెనీ వారు వచ్చి అవన్నీ తీసుకెళ్లిపోయారు’ అని ట్వీట్ చేశాడు. జాన్ ట్వీట్‌కు చాలా మంది స్పందించారు. ఇంకా నయం పూలతో ఉన్న ఫొటో కూడా తీసేసుకోవాల్సింది అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు.