uber-driver-shocks-two-for-kissing-in-car

కారులో ముద్దుపెట్టుకున్న యువతులు..డ్రైవర్ ఏం చేశాడంటే..

న్యూయార్క్: కారు వెనుక సీట్లో కూర్చుని ఇద్దరు అమ్మాయిలు ముద్దు పెట్టుకోవడంతో ఓ ఉబెర్ డ్రైవర్ తన కారులో నుంచి వాళ్లను బయటికి గెంటేశాడు. ఆ యువతులు న్యూయార్క్ సిటీ టాక్సీ అండ్ లిమోసిన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో డ్రైవర్ లైసెన్స్ రద్దు చేసి అతడిపై విచారణ చేపట్టారు. వివరాల్లో వెళితే... అలెక్స్ లోవిన్ (26), ఎమ్మా పిచిల్ (24) గత రెండేళ్లుగా డేటింగ్‌ కొనసాగిస్తున్నారు. మాన్‌హాటన్‌కు చెందిన లెస్బియన్ జంట ఓ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ నుంచి తిరిగి వెళ్లేందుకు ఉబెర్ కారు బుక్ చేసుకున్నారు. కొంతదూరం వెళ్లాక యువతులిద్దరూ ఎదురెదురుగా కూర్చుని ముద్దు పెట్టుకోవడంతో టాక్సీ డ్రైవర్‌కి చిర్రెత్తుకొచ్చింది.
 
‘‘మీరు కారులో ఇలా ప్రవర్తించడం చట్టవిరుద్ధం’’ అంటూ ఉన్న పళాన రోడ్డు పక్కన కారు ఆపేశాడు. వాళ్లను బలవంతంగా అక్కడే దించేసి వెళ్లిపోయాడు. అయితే తాము అసభ్యంగా ప్రవర్తించలేదనీ.. దూరంగా కూర్చుని మాట్లాడుకుంటూ మూమూలుగా ముద్దు పెట్టుకున్నామని సదరు జంట తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంత దూరం వరకు ఏమీ మాట్లాడని ఉబెర్ డ్రైవర్... తమ ఇంటికి చాలా దూరంలో తమను దించేశాడని ఆరోపించారు.
 
వాస్తవానికి ఉబెర్ కమ్యూనిటీ నిబంధనల ప్రకారం.. ‘‘కారులో మీరు ఇతర వ్యక్తులను తాకకూడడం లేదా అసభ్యంగా ప్రవర్తించడం చేయకూడదు. డ్రైవర్లతో గానీ, తోటి ప్రయాణికులతో గానీ లైంగిక చర్యలకు పాల్పడరాదు. ఏ కారణం చేతనైనా సరే..’’ అంటూ స్పష్టంగా ఉంది. మరోవైపు సదరు కారు డ్రైవర్ స్టార్ రేటింగ్ 4.67గా ఉండడం గమనార్హం. పిచిల్ ఫోన్ నుంచి మీడియా సంపాదించిన అతడి ఫ్రొఫైల్‌లో డజన్ల కొద్దీ అతడికి ‘‘ఎక్స్‌లెంట్ సర్వీస్’’ అని కామెంట్లు రావడం విశేషం.