this-indian-martyr-is-amerian-hero,-says-us-president

ఈ భారతీయుడు యూఎస్‌కి హీరో: డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: అక్రమ వలసదారుల చేతిలో భారత సంతతికి చెందిన రొనీల్ సింగ్(33) అనే పోలీస్ అధికారి ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటనకు అమెరికా ప్రజల గుండె కరుక్కుమందంటూ సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతాపం తెలిపారు. సింగ్ అమెరికన్ హీరో అంటూ ఆయన ప్రశంసించారు. అంతేకాకుండా సింగ్ కుటుంబాన్ని కలుసుకొని సానుభూతి తెలిపారు. న్యూమన్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న సింగ్ గత నెల 26న ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా గుస్తావో పేరెజ్ అనే వ్యక్తిని ఆపాడు. వెంటనే ఆ వ్యక్తి తన దగ్గరున్న గన్‌తో సింగ్‌ను హతమార్చి పారిపోయాడు. అనంతరం కాలిఫోర్నియా పోలీసులు గుస్తావోని అరెస్ట్ చేశారు. అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించం వల్లే ఇలాంటి ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ట్రంప్ మండిపడ్డారు. అక్రమ వలసదారులు ఇప్పటికే అనేక మంది అమాయకులని హత్య చేశారని.. తాను అధ్యక్షుడైన నాటి నుంచి అక్రమ వలసదారుల చేతిలో మరణించిన వందలాది కుటుంబాలను కలుసుకున్నానన్నారు. పిల్లలను కోల్పోయిన తల్లి, తండ్రులను కలుసుకున్నప్పుడు ఎంతో బాధగా అనిపించిందని, వారి బాధను, కన్నీళ్లను తాను ఇంకా మరిచిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సరిహద్దు గోడ నిర్మాణానికై ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్ నుంచి ఐదు బిలియన్ డాలర్ల ఫండ్‌ను కోరారు. దీనికి ప్రతిపక్ష డెమొక్రాట్ సభ్యులు నిరాకరించారు. దీంతో నిర్మాణానికి అడ్డంకి ఎదురైందని, ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోవాలంటూ కాంగ్రెస్‌లో ఉన్న డెమొక్రట్లను ట్రంప్ ప్రశ్నించారు. నిధులు కేటాయించకపోవడం వల్లే ఫెడరల్ ఫ్రభుత్వం షట్ డౌన్ కొనసాగుతోందన్నారు. ఇది న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్న పోరాటమని, సరిహద్దు గోడను నిర్మించడంలో డెమొక్రాట్లు సాయం చేయాలని, వారు కూడా చేయందిస్తే 45 నిమిషాలలో సమస్యకు పరిష్కారం దొరికినట్టేనన్నారు. పక్షపాత రాజకీయాలను పక్కన పెట్టి దేశం కోసం పనిచేయడానికి చేతులు కలపాలంటూ ఆయన కాంగ్రెస్ నాయకత్వాన్ని వైట్ హౌస్‌కు ఆహ్వానించారు. సరిహద్దు గోడ ఏర్పాటు అన్యాయమంటూ చాలా మంది గొడవ చేస్తున్నారని.. గోడ ఏర్పాటు చేయడం అన్యాయం కాదని, అమాయకులైన అమెరికన్ల ప్రాణాలు పోకుండా ఆపలేకపోవడమే నిజమైన అన్యాయమని సమాధానమిచ్చారు. డబ్బున్న వారంతా వారి ఇంటికి రక్షణ వలయాన్ని నిర్మించుకుంటారని .. అది బయటి వారిపై కోపంతో కాదని, ఇంట్లో ఉన్న వారిపై ప్రేమతో నిర్మిస్తున్నారంటూ బదులిచ్చారు. అక్రమ వలసదారులను కేవలం సరిహద్దు గోడ మాత్రమే ఆపగలదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.