teacher-attacks-mother

విద్యార్థి తల్లికి టీచర్ భారీ షాక్ !

ఫ్లోరిడా: పాఠశాలలోని విద్యార్థులు క్రమశిక్షణ పాటించేలా ఉపాధ్యాయులు పలు చర్యలు తీసుకోవడం సహజం. ఈ క్రమంలో విద్యార్థులను భయపెట్టడం, బెత్తం చూపించి హెచ్చరించడం సాధారణం. అప్పటికీ మాటవినకపోతే విద్యార్థుల ప్రవర్తనపై వారి తల్లితండ్రులకు ఫిర్యాదు చేస్తారు. కానీ ఓ టీచర్ ఏకంగా ఓ విద్యార్థి తల్లిని స్కూల్లోనే చితకబాదింది. విద్యార్థి తప్పు చేస్తే తల్లిని దండించారేమో అనుకుంటే పొరపాటే.. షాక్‌కు గురిచేస్తున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన టెర్రీ లీ కోర్సే అనే 37 ఏళ్ల మహిళ ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో స్కూల్లో జరిగిన బేస్‌బాల్ గేమ్‌కు ఓ విద్యార్థి తల్లి కురచ దుస్తులు ధరించి హజరైంది. కురచ దుస్తులు ధరించిన మహిళను చూసిన టీచర్ టెర్రీ లీ కోర్సే తీవ్ర ఆగ్రహానికి గురైంది. ప్రేక్షకుల్లోని తల్లిపై పిడిగుద్దుల వర్షం కురిపించింది. మొహంపై బాగా కొట్టింది. దీంతో టీచర్‌పై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందిత టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై విచారణ జరగనుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో అక్కడున్నవారు షాక్‌కు గురయ్యారు. విద్యార్థిని దండించే టీచర్లను చూడడం సహజం కానీ విద్యార్థి తల్లిని ఓ టీచర్ కొట్టడం మొదటిసారని చెపుకుంటున్నారు. ఇదిలావుండగా నిందిత మహిళపై కేసు నమోదవ్వడంతో స్కూల్ నుంచి సస్పెండ్ చేస్తున్నామని యాజమాన్యం ప్రకటించింది.