:: Welcome to NRI - Article ::

46 ఏళ్ల తర్వాత తల్లి ఒడికి..!

డల్లాస్‌, ఆగస్టు 12: ఊహ తెలిసే నాటికి కన్న తల్లి ఎలా ఉందో, ఎక్కడ ఉందో తెలీదు. ఎలాగైనా అమ్మను చూడాలని ఆరాటపడ్డాడు. అందుకోసం వెతకని చోటు లేదు. తిరగని ప్రాంతం లేదు. అడగని చిరునామా లేదు. ఇక దొరకదా.. అన్న నైరాశ్యంలో ఉన్న తరుణంలో అతడికి చిన్న దారి దొరికింది. అదే.. డీఎన్‌ఏ. 46 ఏళ్ల క్రితం వేరైన తల్లీకొడుకుల రక్త సంబంధాన్ని డీఎన్‌ఏ కలిపింది. 1970లో అమెరికాలోని ప్యూర్టోరికో భర్తతో గొడవ పడి ఎల్సీ రమిరేజ్‌(64) చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమారులు రేమండ్‌ అంబ్రూ(47), ఆంటోని విగ్స్‌(46). కొన్నాళ్లకు రేమండ్‌ను అతడి నానమ్మ, తాతయ్య తీసుకెళ్లగా, ఆంటోనిని అతడి నాన్న ఒక కుటుంబానికి దత్తత ఇచ్చాడు.
 
అమ్మ ఏమైందో తెలీదు. తండ్రి చనిపోయాడు. ఎవరికి వారు చెల్లాచెదురయ్యారు. కానీ, తనవారిని కలవాలన్న ఆశ ఆంటోనీలో వేళ్లూనుకుంది. ఆంటోనిని దత్తత తీసుకున్న కుటుంబం అతడికి జన్మదిన ధ్రువపత్రం చూపించారు. దాని సాయంతో 27వ ఏట అన్న రేమండ్స్‌ జాడ కనుగొన్నాడు. ఇద్దరూ తల్లికోసం వెతుకులాట ప్రారంభించారు. తల్లిని కనిపెట్టాలన్న కసిని గుర్తించిన ఆంటోని గర్ల్‌ఫ్రెండ్‌ అతడికి మేలో డీఎన్‌ఏ పరీక్ష చేయించింది. రికార్డుల్లో అతడి డీఎన్‌ఏతో ఎవరిదైనా కలుస్తుందోనని చూశారు. నిరీక్షణ ఫలించింది. ఓ అజ్ఞాత వ్యక్తి డీఎన్‌ఏతో ఆంటోని డీఎన్‌ఏ కలిసింది. అతడు ఎల్సీ మేనల్లుడే. ఆరా తీస్తే తల్లి బతికే ఉందని తెలిసింది. శుక్రవారం ఇద్దరూ డల్లాస్‌ ఫోర్ట్‌వర్త్‌ విమానాశ్రయంలో తల్లిని కలుసుకున్నారు.