Shocking-video-shows-a-cop-beating-his-daughter

స్కూల్లోని కూతురిపై తండ్రి విచక్షిణారహిత దాడి..కారణమిదే..

మియామి, యూఎస్‌ఏ: పిల్లలు పొరపాటు చేసినప్పుడు తల్లితండ్రులు దండించడం సహజమే. అయితే పోలీసు అధికారిగా పనిచేస్తున్న రేమండ్ రొసారియో అనే 44 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి తన కూతురు 14 ఏళ్ల బాలికను స్కూల్లోనే బెల్ట్‌తో విచక్షిణారహితంగా కొట్టాడు. అంతేకాకుండా అనేకసార్లు చెంప దెబ్బలు కొట్టాడు. స్కూల్లో సిబ్బంది చూస్తుండగానే ఈ దాడి జరిగింది. స్కూల్లోని టీచర్లకు గౌరవం ఇవ్వడం లేదని స్కూల్ సిబ్బంది నుంచి ఫిర్యాదు అందుకున్న రొసారియో ఆగ్రహంతో ఈ చర్యకు దిగాడు. బాలికను విచక్షిణారహితంగా దండిస్తున్నా అక్కడున్నవారు పట్టించుకోలేదు. సిబ్బంది ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. ఎవరో ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన దాడి దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. బాలికను తండ్రి తీవ్రంగా దండించడం, సిబ్బంది ఎవరూ పట్టించుకోకపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయం పిల్లల సంరక్షణ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు పిల్లల హక్కుల రక్షణ చట్టాల కింద పలు కేసులు నమోదు చేశారు. నిందితుడు పోలీసు అధికారిని విధుల నుంచి తొలగించారు. ఇదిలావుండగా దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కూతురిని దండిస్తున్న తండ్రి, స్కూల్ సిబ్బందిని నెటీజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.