shocking-news-for-indian-customers

భారతీయ వినియోగదారులకు యాపిల్ షాక్!

కాలిఫోర్నియా: వచ్చే నెలలో యాపిల్ కొత్త ఐఫోన్ మోడళ్లను ప్రవేశపెట్టబోతోంది. వీటిలో డ్యూయల్ సిమ్ ఫోన్ కూడా ఉందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రచారాన్ని బట్టి యాపిల్ మూడు స్టాండర్డ్ ఐఫోన్ మోడళ్లు.. 6.1 అంగుళాల ఎల్‌సీడీ వేరియంట్, 5.8 అంగుళాలు, 6.5 అంగుళాల ఓలెడ్ మోడళ్లను తీసుకురాబోతోంది. అయితే, ఇందులో డ్యూయల్ సిమ్ కార్డు మోడల్ ఒక్క మోడల్‌కే పరిమితం కాబోతోంది. ఆ ఫోన్‌ను ఒక్క చైనా మార్కెట్‌కే పరిమితం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే భారత వినియోగదారులకు నిరాశ తప్పదన్నమాటే.

6.5 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లేతో వస్తున్న మోడల్‌లోనే డ్యూయల్ సిమ్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, డ్యూయల్ సిమ్ వేరియంట్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా చైనాలో విడుదల చేయాలనేది యాపిల్ యోచనగా తెలుస్తోంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మేకర్లు ఇప్పటికే భారత్, చైనాలలో తమ ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌ను విడుదల చేస్తున్నారు. కాబట్టి భారత్‌లోనూ ఈ వేరియంట్‌ను ఆ తర్వాత ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈవిషయంలో యాపిల్ నుంచి అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు.