police-officer-is-hailed-a-hero

పోలీసు అధికారిపై ప్రశంసల వర్షం.. ఎందుకంటే..

టెక్సాస్, యూఎస్ఏ: ఓ చిన్నారి ప్రాణాలను రక్షించిన ఓ పోలీసు అధికారి హీరోగా ప్రశంసలు అందుకుంటున్నారు. డల్లాస్ పోలీస్ చీఫ్ రెక్స్ ఇవన్స్‌పై అనేకమంది పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. బాలికను తీసుకుని కారులో వెళ్తూ బాలికకు శ్వాస అందడం లేదని గుర్తించిన కుటుంబం హడలి పోయింది. వెంటనే పక్కనే ఉన్న పోలీసు అధికారి రెక్స్ ఇవన్స్‌‌కు విషయాన్ని చెప్పి సాయాన్ని కోరారు. తక్షణమే స్పందించిన అధికారి ఎమర్జెన్సీ మెడికల్ సిస్టం అధికారులకు సమాచారం అందించారు. కారులో ఉన్న తల్లి చేతుల్లోని శిశుబాలికను తీసుకుని సీపీఆర్ ద్వారా బాలిక స్పందించేలా చేశారు. సీపీఆర్ అందిస్తుండగా బాలిక ఏడవడం అందరినీ సంతోషానికి గురిచేసింది. అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది బాలికకు చికిత్స అందించారు. అయితే బాలికకు శ్వాస అందకపోవడానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు ఉద్వేగానికి గురయ్యారు. పాప ప్రాణాలతో ఉందని తాము భావించలేదని, బాలిక ప్రాణాలతో బయటపడడానికి పోలీసు అధికారే కారణమని తెలిపి ఉద్వేగానికి గురయ్యారు. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి చిత్రీకరించడంతో వీడియో వైరల్‌గా మారింది. దీంతో పోలీసు అధికారి రెక్స్ ఇవన్స్‌పై పొగడ్తల వర్షం కురుస్తోంది.