massive-winds-

బలమైన గాలులు వీస్తున్నాయి.. గంటకు 130 మైళ్ల వేగంతో...

టెక్సాస్: బలమైన గాలులు ఒకవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు తుఫాన్ మరోవైపు అమెరికా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆదివారం గంటకు 130 మైళ్ల వేగంతో గాలులు వీచాయని అధికారులు తెలిపారు. దాంతో ఎన్నో చోట్ల పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయన్నారు. అయితే రెండు చోట్ల చెట్లు కూలిపోవడం వల్ల ఇద్దరు మరణించారని వారు తెలిపారు. మేరోన్ కంట్రీలోని బ్రూష్ క్రీక్ అపార్ట్‌మెంట్ పక్కన పెద్ద చెట్టు కూలి ఇంటిపై పడిందన్నారు. ఆ ప్రమాదంలో మేరీ పెన్నీ(40) అనే మహిళ మరణించిందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆమె భర్తకు తీవ్రగాయాలు అయ్యాయని వారు చెప్పారు. అయితే వారి ముగ్గురు పిల్లలు ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారని అధికారులు తెలిపారు. అయితే గాలులు బలంగా వీస్తున్న సమయాల్లో చెట్ల పక్కన అస్సలు తలదాచుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. గాలి వేగం పెరగడం వల్ల టోర్నడోలుగా మారే ప్రమాదం ఉంటుందని అధికారులు చెప్పారు. కొన్ని చోట్ల గాలి వేగంగా వీయడం వల్ల దుమ్ము, దూళిని  పెద్ద ఎత్తున మోసుకుని వస్తుందన్నారు. అందువల్ల ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు.