man-stabbed-his-girl-friend

క్రూరమైన చర్యకు పాల్పడ్డ ప్రియుడు

శాన్ ఆంటానియో, టెక్సాస్: ఓ యువకుడు అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. ఆవేశంలో ప్రేయసినే హతమార్చాడు. అమెరికాలోని టెక్సాస్‌లో వెలుగులోకి వచ్చిన ఈ దారుణానికి సంబంధించిన పూర్తివివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇరిన్ కాస్ట్రో(19) అనే యువతి జోషూ గార్షియా(20) అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే కారులో ప్రయాణిస్తున్న వీరిద్దరి మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఆవేశానికి గురైన జోషూ తన ప్రేయసి ఇరిన్ కాస్ట్రోను కత్తితో పొడిచాడు. గొంతుపై కత్తుతో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన యువతి కారు నుంచి కిందపడింది. పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడు కారును యువతి పైనుంచి పోనించాడు. దీంతో యువతి మరింత తీవ్రంగా గాయపడింది. తన వద్ద ఉన్న ఫోన్‌ ద్వారా తన తల్లికి కాల్ చేసి వివరాలు వెల్లడించింది. బాధితురాలి తల్లి అత్యవసర సిబ్బందికి  ఫిర్యాదు చేసింది. అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేంత వరకూ కూతురితో ఫోన్లో మాట్లాడింది. ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సిబ్బంది బాధితురాలిని హాస్పిటల్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో యువతి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసుపై విచారణ జరగనుందని పోలీసులు వెల్లడించారు.