man-fallen-into-sea

భూమి నుంచి 150 అడుగుల లోతులో పడినా..

కాలిఫోర్నియా: ప్రతి గింజ మీద తినే వాడి పేరు రాసి ఉంటుందని పెద్దవాళ్లు చెబుతుంటారు. అలాగే భూమ్మీద మనిషికి ఆయుషు ఇంకా మిగిలి ఉంటే అతడు ఎందులో పడినా బతికి బట్టకడతాడనేందుకు ఈ సంఘటనే నిదర్శనం. ఒక వ్యక్తి తన కారులో మాంటారా స్టేట్ బీచ్ రోడ్డు గుండా వెళ్తున్నాడు. అంతలో ప్రమాదవశాత్తు కారు బీచ్ రోడ్డు రేలింగ్‌(కంచె)ను దాటుకుని ఫసిఫిక్ సముద్రంలో పడిపోయింది.

అయితే కారు మొత్తం మునిగిపోయినా కూడా అతడు సురక్షితంగా పెద్ద బండరాయిపైకి చేరి, అక్కడే నిలబడ్డాడు. ఎవరైనా తనకు సాయం చేయకపోతారని వేచి చూస్తున్నాడు. అంతలో అటుగా వచ్చిన హైవే పెట్రోలింగ్ పోలీసులు అతడిని గమనించి రక్షించారు. ఉదయం 8గంటలకే ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. భూమి నుంచి 150 అడుగుల లోతున్న లోయలో అతడు పడిపోయాడన్నారు. అయినా కూడా ఎటువంటి హని జరగలేదని పోలీసులు చెప్పారు.