:: Welcome to NRI - Article ::

ఆడపిల్ల పుట్టిందని ఆ తల్లి ఎంతదారుణం చేసిందంటే

టెక్సాస్: హరీస్ కంట్రీ పోలీసులకు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే వారు అతడు చెప్పిన చోటుకి వచ్చారు. అక్కడ ఓ దృశ్యం చూసి చలించిపోయారు. పుట్టిన గంటకే ఆడపిల్ల అని తెలిసి ఒక మహిళ పాపను అపార్ట్‌మెంట్ పక్కనున్న చెట్లపొదల్లో పడేసింది. ఆ పాపను చీమలు కుట్టాయి. దాంతో ఒళ్లంతా బొబ్బలు ఎక్కాయి. పోలీసులకు ఫిర్యాదు చేయకముందే అతడు తన మొబైల్‌ఫోన్‌లో పాపను వీడియో తీశాడు. తాను అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటానని అతడు పోలీసులతో చెప్పాడు.

తాను ఓ గంట క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్లానని ఆ సమయంలో ఇద్దరు మహిళలు తనకు ఎదురుపడ్డారని అతడు చెప్పాడు. అయితే వీధి చివర్లో వారిని తాను చూశానన్నాడు. కానీ, వారిని తాను అంతగా గమనించలేదన్నాడు. అంతలోనే తన పని ముంగించుకుని తిరిగి ఇంటికి వచ్చానని అతడు చెప్పాడు. తాను వచ్చే దారిలో పాప ఏడుపు వినపడిందన్నాడు. కానీ, ఆ అరుపులు పిల్లి అరుపుల్లా ఉండేసరికి మొదట తాను పాపను చూడలేదన్నాడు.

మళ్లీ కొద్దిసేపటికి ఏకధాటిగా ఏడుపు వినపడుతుండటంతో తాను పొదల్లోకి వెళ్లి చూశానని చెప్పాడు. అప్పటికే పాపను చీమలు పట్టేశాయన్నాడు. అవి కుట్టడంతో ఒళ్లంతా బొబ్బలు వచ్చాయని అతడు చెబుతున్నాడు. ఆ దృశ్యం తనను చలింపజేసిందన్నాడు. వెంటనే తాను ప్రతి ఇంటికి వెళ్లానని అందరికి పాప గురించి చెప్పానన్నాడు. అయితే ఎవ్వరికి ఆ పాపతో సంబంధం లేదని చెప్పారన్నాడు. పాప తల్లిని గుర్తించేందుకు తాను తీసిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశానన్నాడు.

అయితే 21 ఏళ్ల మహిళ ఆ పాప తన బిడ్డేనని చెప్పిందన్నాడు. పెంచడం ఇష్టం లేకే పాపను వదిలేశానని కామెంట్ పోస్టు చేసిందన్నాడు. అయితే ఆమె వివరాలేమి తనకు తెలియవన్నాడు. పోలీసులు ఆమె ఫేస్‌‌బుక్‌లో పోస్టు చేసిన మేసేజ్ ద్వారా ఆమె వివరాలు రాబట్టారు. పాప తల్లిని అదుపులోకి తీసుకున్నారు. పాపను టెక్సాస్‌లోని చైల్డ్ కేర్ సెంటర్‌కు తరలించారు. పాప తల్లిని మాత్రం అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచారు. పాప తండ్రి గురించిన సమాచారం ఇంకా ఏమి తెలియలేదని పోలీసులు తెలిపారు. పాపను రక్షించిన గేల్‌ను సోషల్‌మీడియాలో అంతా పొగడ్తల్లో ముంచెత్తారు. పోలీసులు కూడా గేల్ మానవత్వం ఉన్న మనిషిలా ఆలోచించడని మెచ్చుకున్నారు.