man-attacks-on-ex-girl-friend

ఓ యాప్ డౌన్‌లోడ్ చేసిందని ప్రియురాలిపై అనుమానం, దాడి

టెక్సాస్: సోషల్ మీడియా యాప్ ‘స్నాప్‌చాట్’ను డౌన్‌లోడ్ చేసుకోవడమే ఓ యువతిపాలిట శాపమైంది. తీవ్రమైన గాయాలపాలవ్వడానికి కారణమైంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. డామెన్ మర్మోలెజె అనే 21 ఏళ్ల యువకుడు, సొలిడాడ్ టొర్రెస్ అనే 18 ఏళ్ల యువతికి సోషల్ మీడియా మాధ్యమం స్నాప్‌చాట్ ద్వారా పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో యువతి తన సెల్‌ఫోన్‌లోని స్నాప్‌చాట్ యాప్‌ను డిలీట్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య సంబంధం తెగిపోయింది. ఇద్దరూ విడిపోయారు. కొంతకాలం తర్వాత యువతి ‘స్నాప్‌చాట్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసింది. ఈ విషయాన్ని గమనించిన మాజీప్రియుడు యువతి ఇంటికెళ్లి విచక్షిణారహితంగా దాడి చేశాడు. యువతి తలను తొట్టికేసి బలంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా కాలిబూటుతో కూడా దాడి చేశాడు. బూటు ముద్రలు యువతి ముఖంపై పడేలా దారుణంగా కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రమైన ఈ దాడిలో యువతి తలకు 15 కుట్లు పడ్డాయి. 2017 ఆగస్టులో ఈ దాడి జరిగింది. దాదాపు మూడు నెలల తర్వాత నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. శిక్ష విధించిన అనంతరం నిందితుడిని జైలుకు పంపించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.