Jared-Polis-makes-history-as-colorado's-gay-governor

అమెరికా చరిత్రలోనే మొదటిసారిగా...గే గవర్నర్ నియామకం

డెన్వర్: కాలంతో పాటు మనుషులు..వారి అభిరుచులు మారుతూంటాయి. ఇప్పుడున్న సమాజంలో ఇద్దరమ్మాయిలు లేదా ఇద్దరబ్బాయిలు పెళ్లి చేసుకోవడం అనేది సహజం అయిపోయింది. గతంలో మాదిరిగా మేమిద్దరం..మాకిద్దరు అనే సంప్రదాయానికి చాలా చోట్ల చెక్ పెట్టేశారు. ఎవరికి నచ్చినట్టు వారు బతకడానికే అనేక మంది ఇష్టపడుతున్నారు. ఇంతకుముందు గే అనే పదం వింటే సమాజం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేది. కానీ, రాను రాను గేలు కూడా సొసైటీలో ఉన్నతస్థాయి పదవులను అలంకరిస్తున్నారు. ఒక గే అయిన తాను యాపిల్ కంపెనీ సీఈఓగా నియామకం అవ్వడం గర్వంగా భావిస్తున్నానంటూ..మొన్నామధ్య యాపిల్ సీఈఓ టిమ్ కుక్ అన్నారు. అదే విధంగా ఇప్పుడు ఏకంగా డెమోక్రట్స్‌కు చెందిన జేర్డ్ పొలిస్‌(43)ను మొదటి గే గవర్నర్‌గా నియామకం అయ్యారు. జేర్డ్ పొలిస్ టెక్, ఎడ్యుకేషన్ ఆంత్రప్రెన్యూర్. ఆన్‌లైన్‌లో గ్రీటింగ్ కార్డులను పంపే, కొనుకున్నే విధంగా కాలేజీ రోజుల్లోనే ఒక ఇంటర్నెట్ కంపెనీని స్థాపించిన పొలిస్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. అదే విధంగా ఆయన ఐదు సార్లు బౌల్డర్ నుంచి కాంగ్రెస్ సభ్యునిగా పనిచేశారు. కాంగ్రెస్‌కు వెళ్లకముందు స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డులో కూడా సేవలందించారు. కొలొరాడో గవర్నర్‌గా సేవలందించిన జాన్ హికెన్‌లూపర్‌పై విజయం సాధించి పొలిస్ కొలొరాడో నూతన గవర్నర్‌‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ సభ్యులు, పొలిస్ ఆత్మీయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది ప్రముఖులు మాట్లాడుతూ..ఒక గే గవర్నర్‌ అవ్వడాన్ని స్వాగతిస్తున్నామని.. సమాజంలో అన్ని వర్గాల వారు సమానమేనని.. వివక్షను చెరిపేయడానికి ఈ నియామకం ఓ నాంది అని చెప్పారు.

పొలిస్ మాట్లాడుతూ.. ఆరోగ్య సంరక్షణను మరింత పెంచుతానని, ప్రకృతిని కాపాడుతానని, పబ్లిక్ ఫండెడ్ ప్రీస్కూళ్లలో చదువుకునేలా కృషి చేస్తానని, ఇన్సూరెన్స్ తగ్గిస్తానంటూ హామీ ఇచ్చారు. పొలిస్ నియామకంతో ఎల్‌జీబీటీ(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. ‘సమాజంలో ఏ ఒక్కరైనా..ధైర్యంతో ముందుకెళితే ఉన్నత స్థాయికి వెళ్లవచ్చు.  నాలాంటి వ్యక్తి ఈరోజు గవర్నర్ స్థాయిలో నిలబడి మాట్లాడటమే దీనికి ఉదాహరణ’ అని చెప్పారు. కాగా, కొలొరాడో గవర్నర్‌గా ఇప్పటివరకు జాన్ హికెన్‌లూపర్ వ్యవహరించారు. హికెన్‌లూపర్ 2020 అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. హికెన్‌లూపర్‌ డెన్వర్ మేయర్‌గా, సెంట్రిస్ట్ డెమొక్రాట్‌గా, పెట్రోలియమ్ జియాలజిస్ట్‌గా సేవలందించారు. ఆయనో బీర్ పబ్‌కు యజమాని కూడా.