:: Welcome to NRI - Article ::

న్యూజెర్సీలో ఈ భారతీయ విద్యార్థి చేసిన పనికి ఓ ప్రాణం బలి

న్యూజెర్సీ: చదువుకునేందుకు ఈ భారతీయ యువకుడు అమెరికా వెళ్లాడు. అక్కడే వేరే దేశస్తులతో స్నేహం కుదిరింది. కలల ప్రపంచమయిన అమెరికాలో ఎంజాయ్ చేయాలనుకున్నాడు. డబ్బు కోసం పెడదారి పట్టి.. చివరకు కటకటాల పాలయ్యాడు. రుట్గెర్ యూనివర్శిటీలో చదువుతున్న థారుణ్ రవి(24) అనే భారతీయుడు, క్లెమెన్టీ(18) అనే యువకుడితో కలిసి రూమ్‌లో ఉంటున్నాడు. క్లెమెన్టీ స్వలింగ సంపర్కుడు. రవి లేనప్పుడు క్లెమన్టీ తన స్నేహితుడితో కలిసి రూమ్‌లో శృంగారంలో పాల్గొనేవాడు. 2010వ సంవత్సరం సెప్టెంబర్ 19న  అర్ధరాత్రి వరకూ రూమ్‌కు రావొద్దని రవిని క్లెమెన్టీ కోరాడు. ఎందుకు రావద్దంటున్నాడా.. అని  అనుమానం వచ్చిన రవి.. రాత్రి సమయంలో రూమ్‌కు వెళ్లాడు. కిటికీలో నుంచి రూమ్‌లో జరుగుతున్న తతంగాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే తన వెబ్‌కామ్ ద్వారా రికార్డు చేశాడు. దాన్ని క్లెమెన్టీకి చూపించి డబ్బు డిమాండ్ చేశాడు. లేకుంటే ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించాడు. దీంతో పరువు పోతుందని భావించిన క్లెమెన్టీ అదే మూడు రోజుల అనంతరం సెప్టెంబర్ 22న జార్జ్ వాషింగ్టన్ బ్రిడ్జి నుంచి దూకి  ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కారణాలను తెలపకపోవడంతో అది కాస్తా మరుగున పడిపోయింది.
 
 ఆ తర్వాత కొన్ని రోజులకు తన స్నేహితులకు ఈ వీడియోలు షేర్ చేశాడు. అదే అతడి కొంప ముంచింది. ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారి క్లెమెన్టీ తల్లిదండ్రులైన జానే, జో క్లెమెన్టీ వద్దకు చేరింది. దీంతో పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. దీంతో రవిని అదుపులోకి తీసుకుని విచారించారు. యూనివర్శిటీ క్యాంపస్‌లో కూడా విచారించగా.. తాను డబ్బు డిమాండ్ చేయడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని, స్వలింగ సంపర్కులు ఎలా ఉంటారో చూడాలంటూ చెప్పేవాడని పోలీసులకు విద్యార్థులు వెల్లడించారు. నేరాన్ని కూడా రవి ఒప్పుకోవడంతో అతడికి పదేళ్ల జైలు శిక్ష విధించారు.  2012 నుంచి ఈ తీర్పుపై పున:సమీక్ష చేయాలని కోరుతూ పిటిషన్లు వేస్తూనే ఉన్నాడు. అయితే గురువారం కోర్టుకు వచ్చిన ఓ పిటిషన్‌పై న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. రవి వేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చుతూ.. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగాన్ని కలిగించడం అత్యంత దారుణమైన నేరమని అన్నారు.