Immigration-And-Customs-agents-arrested-a-man-

గర్భిణి భార్యను ఆసుపత్రికి తీసుకెళ్తుంటే...ఇంతలోనే..

కాలిఫోర్నియా: అమెరికాకు ట్రంప్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యారో అప్పటి నుంచి వలస దారులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. ఏ నిమిషం తమను అమెరికా నుంచి తోలేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. అమెరికా, మెక్సికో మధ్య ఏకంగా గోడ కట్టేస్తానన్న తర్వాత అమెరికాలో జీవిస్తున్నమెక్సికో దేశస్థులకు ఎప్పుడు తమను అమెరికా నుంచి పంపేస్తారోననే భయాందోళనలో ఉన్నారు. కాలిఫోర్నియాలో మేరియా వెనెగాస్ అనే గర్భిణి డెలివరీ డేట్ రావడంతో తన భర్త జోయెల్ అరోనా లారాతో కలిసి ఆసుపత్రికి వెళ్తూ దారిలో కారులో గ్యాస్ నింపుకోటానికి ఓ చోట ఆగారు. అంతే, ఉన్నపలంగా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు అక్కడికి వచ్చి ధ్రువీకరణ పత్రాలను చూపించవలసిందిగా గొడవ చేశారు. భార్య మేరియా వెనెగాస్ తన పత్రాలను చూపించింది. ఆసుపత్రికి వెళ్లే తొందరలో తన భర్త ధ్రువీకరణ పత్రాలు ఇంట్లోనే మర్చిపోయినట్టు చెప్పింది. తన భర్తది మెక్సికో అని 12 ఏళ్ల నుంచి అమెరికాలోనే ఉంటున్నట్టు, చట్టపరంగా అమెరికాలో ఉంటున్నట్టు అయితే తన భర్త దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని కూడా స్పష్టం చేసింది.

దీంతో, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారులు ఆమె భర్తకు బేడీలు వేసి తీసుకెళ్లిపోయారు. అసలే నొప్పులతో బాధపడుతున్న వెనెగాస్ నొప్పిని భరించి, తన భర్త గురించి రోదిస్తూనే కారు నడుపుకుంటూ ఆసుపత్రికి వెళ్లింది. అనంతరం అక్కడే శిశువుకు జన్మనిచ్చింది. బిడ్డను కళ్లారా చూడాలని తొమ్మిది నెలల నుంచి వేచి చూస్తున్న తన భర్తను ఇలా కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేయడం దారుణమని బాధపడింది. దీనిపై స్పందించిన కస్టమ్స్ అధికారులు తాము వేరే వ్యక్తి కోసం వెళ్లామని, అయితే జోయెల్ కూడా చట్టపరంగా అమెరికాలో ఉండటానికి ఎటువంటి అధారాలు లేవని, అందుకే అరెస్ట్ చేశామని చెప్పారు. ట్రంప్ అధ్యక్షుడైన 14 నెలల్లోనే వలస దారుల(ముఖ్యంగా మెక్సికో దేశస్థులు)పై కేసులు 200 శాతం పెరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  ఏప్రిల్‌లో అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ అమెరికా-మెక్సికో సరిహద్దు వద్ద చట్టపరంగా ఇమ్మిగ్రేషన్ లేనివారిని అమెరికాలోకి రానివ్వద్దని ఆదేశాలు జారీ చేయడంతో వేల కుటుంబాలు విడిపోవాల్సి వచ్చింది. మీడియా ఛానెల్స్ జోయెల్‌ను అరెస్ట్ చేసిన సన్నివేశాలను సీసీ కెమెరాల ద్వారా సంపాదించి వాటిని ప్రసారం చేయడంతో ఈ సంఘటన వైరల్ అయ్యింది.