i-will-contest-on-US-President,-says-Tulasi-Gyabard

ట్రంప్‌పై పోటీ చేస్తా: హిందూ చట్టసభ్యురాలు తులసి

వాషింగ్టన్‌: రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీచేస్తానని అమెరికా కాంగ్రెస్‌లో మొదటి హిందూ చట్టసభ్యురాలు తులసీ గ్యాబార్డ్‌ ప్రకటించారు. 2020లో జరగనున్న ఎన్నికల్లో తాను డోనాల్డ్‌ ట్రంప్‌పై పోటీ పోటీచేస్తానని.. తన అభ్యర్థిత్వం వివరాలను మరో వారంలో ప్రకటిస్తానని ఆమె శనివారం వెల్లడించారు. ఆమె తండ్రి మైక్‌గ్యాబార్డ్‌ కేథలిక్‌ కాగా.. తల్లి కరోల్‌ పోర్టర్‌ గ్యాబార్డ్‌ హిందువు. 37 ఏళ్ల తులసి జన్మతః హిందువు కాకున్నా.. చిన్నతనంలోనే హిందూమతాన్ని స్వీకరించారు. ఇరాక్‌ యుద్ధం సమయంలో ఆమె అమెరికా సేనల తరఫున పోరాడారు. 2012లో హవాయి నుంచి మొదటిసారి చట్టసభ్యురాలిగా ఎన్నికయ్యారు. అమెరికా కాంగ్రె్‌సలో అడుగు పెట్టిన తొలి హిందువుగా గుర్తింపు పొందారు. భగవద్గీతపై ప్రమాణం చేసి, ఆమె సెనెటర్‌గా బాధ్యతలు స్వీకరించారు. హవాయి నుంచి వరుసగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. భగవద్గీత ద్వారా తనకు ప్రశాంతత లభిస్తుందని ఆమె తరచూ చెబుతుంటారు. భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు.. ఆయనకు భగవద్గీతను బహుమతిగా అందజేశారామె. అధ్యక్ష ఎన్నికల్లో తులసి విజయం సాధిస్తే.. మొదటి క్రైస్తవేతర అధ్యక్షురాలిగా గుర్తింపు పొందనున్నారు.