I-Phone-Blasted-in-pocket

మూడు వారాల క్రితమే కొన్న ఐఫోన్.. చివరికి

ఒహియో: మూడు వారాల క్రితం ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ జేబులోనే పేలింది. ఈ నెల 12న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జోష్ హిలర్డ్ అనే వ్యక్తి మూడు వారాల క్రితమే ఐఫోన్ కొనుక్కున్నాడు. ఈ నెల 12న ప్యాంటు వెనక జేబులో పెట్టుకున్న ఫోన్ తొలుత వేడెక్కినట్టు అనిపించిందని, ఆ తర్వాత ఆకుపచ్చ, పసుపు రంగులో పొగ బయటకు వచ్చిందని హిలర్డ్ తెలిపాడు. ఆ వెంటనే తాను బ్రేక్ రూముకు వెళ్లి దుస్తులు విప్పడంతో బతికిపోయానని వివరించాడు. ఫోన్‌ కొన్న ముచ్చట కూడా తీరకుండానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కాలిన ఫోన్‌కు సంబంధించిన ఫొటోలు చూస్తుంటే ఫోన్ బాగానే ధ్వంసమైనట్టు తెలుస్తోంది.

బాధితుడు వెంటనే యాపిల్ స్టోర్‌కు వెళ్లి జరిగింది వివరించాడు. కొత్త ఫోన్ ఇచ్చేందుకు యాపిల్ అంగీకరించినా, పాడైన దుస్తులు, కాలిన గాయాలకు పరిహారం ఇచ్చేందుకు నిరాకరించినట్టు హిలర్డ్ తెలిపాడు. దీంతో తన ఫోన్‌ను వెనక్కి తీసుకున్న జోష్ యాపిల్ కేర్ సెంటర్‌ను సంప్రదించాడు. అయితే, వారి నుంచి అతడికి నిరాశే ఎదురైంది. దీంతో తాను కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. కాలిన గాయాలతోపాటు మానసికంగా ఎంతో వేదన అనుభవించినట్టు హిలర్డ్ వివరించాడు.