couple-overdosed-and-forgot-about-their-child-

డ్రగ్స్ మత్తులో కన్నబిడ్డ ప్రాణాలను సైతం మరచి..

 ఒహియో: అమెరికాలో ఓ జంట డ్రగ్స్ మత్తులో మునిగిపోయింది. ఏ పబ్బులోనో లేదా ఇంట్లోనో అయితే పరవాలేదు. కారు డ్రైవింగ్ చేస్తూ, అది కూడా పక్కనే పసిపాపను పెట్టుకుని లోకాన్ని మర్చిపోయేలా హెరాయిన్‌ను తీసుకున్నారు. ఒహియోలోని కాంటన్ సిటీలో ఎప్పుడూ రద్దీగా ఉండే విపుల్ ఎవెన్యూ దగ్గర ఉన్న పార్కింగ్‌లో కోడీ పోవెల్, మిచెల్ హాల్ అనే జంట మత్తు ఎక్కువై కారులో తూలుతున్నారు. వెంటనే అటు పక్క వెళ్తున్న ప్రయాణికులు వారిని గమనించి కారు డోరును తీయగా, అక్కడే ఉన్న పేవ్‌మెంట్‌పై తూలుతూ పడిపోయారు. వెనక సీట్లో ఓ పాప చెమటలతో ఉండటం చూసి వెంటనే ఆ పాపను బయటకు తీసి నీళ్లు పట్టించారు. మరి కాసేపు అయ్యుంటే పాప చనిపోయి ఉండేదని చూసిన సాక్ష్యులు చెబుతున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి వచ్చిన పోలీసులు ఆ జంట మత్తు దిగడానికి  నార్కాన్‌ మందును మూడు డోస్‌లు ఇచ్చారు. అనంతరం వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి పాపను శిశు రక్షణ కేంద్రంలో పెట్టారు. జరిగిన సంఘటనను ఓ వ్యక్తి ఫోన్లో రికార్డ్ చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆ జంటను ఎడా పెడా తిడుతున్నారు.