cops-do-not-send-me-to-jail

'నేను అందమైన అమ్మాయిని.. నన్ను అరెస్ట్ చేయొద్దు'

దక్షిణకరోలినా: 'నేను అందమైన అమ్మాయిని.. నా చర్మం రంగు తెలుపు. నేను ఏ తప్పు చేయలేదు. మీరు నన్ను అరెస్ట్ చేయొద్దు. నా పేరుతో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు'. తాగి వాహనం నడిపి పోలీసులకు చిక్కిన లూరెన్ ఎలిజబెత్(32) అనే యువతి పోలీసులతో చెప్పిన మాటలివి. తెలుపు రంగు చర్మం కలిగిన అమ్మాయిలను పోలీసులు అరెస్ట్ చేయొద్దని లూరెన్ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. తాను ఒక ప్రముఖ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానని చెప్పింది. అంతేకాదు మంచి మార్కులు సంపాదించి స్కాలర్‌షిప్ కూడా పొందానని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తాను చిర్‌గాళ్‌గా పనిచేస్తున్నానని, మంచి డాన్సర్‌నని తెలిపింది. అంతేకాదు తన ప్రియుడు కూడా పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడంది. కావాలంటే అతడితో మాట్లాడి తానేమిటో తెలుసుకోవాలని పోలీసులకు సూచించింది. అయితే పోలీసులు మాత్రం ఆమె మాటలు పట్టించుకోకుండా లూరెన్‌ను అరెస్ట్ చేశారు. అంతేకాదు తెలుపు రంగు చర్మం కలిగిన వ్యక్తులు తప్పు చేసి దొరికిపోతే అరెస్ట్ చేయొద్దని చట్టంలో పేర్కొనలేదని పోలీసులు ఆమెకు తెలిపారు. తాగి వాహనం నడపడమే కాకుండా లూరెన్ వాహనంలో మత్తు పదార్థాలు కూడా దొరికాయని పోలీసులు తెలిపారు.