Baby-found-buried-alive-in-Montana-Woods

పాశవిక చర్య.. బతికున్న పసికందును..

మోంటానా, యూఎస్ఏ: అత్యంత పాశవికమైన ఓ చర్య వెలుగులోకి వచ్చింది. కేవలం 5 నెలల శిశుబాలుడిని బతికుండగానే పూడ్చిపెట్టేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఫ్రాన్సిస్ కర్ల్‌టన్ క్రౌలీ అనే 32 ఏళ్ల వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. కారులో ప్రయాణిస్తున్న తాను అడవి సమీపంలో జాలి, దయలేకుండా ఈ చర్యకు పాల్పడ్డాడు. శిశుబాలుడిని ఓ గోతిలో పాక్షికంగా పూడ్చిపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

సమీప ప్రాంతంలో తుపాకీతో చంపుతానంటూ బెదిరిస్తున్న ఓ వ్యక్తి అనుమానితంగా తిరుగుతున్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్రాన్సిస్‌ వివరాలను తెలుసుకోగా షాకింగ్ విషయం తెలిసింది. అతడి వద్ద ఓ శిశుబాలుడు ఉన్నాడని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో శిశు బాలుడు ఎక్కడంటూ పోలీసులు ప్రశ్నించగా ఏమో తెలియదు, ఎక్కడో మరచిపోయానని బదులిచ్చాడు. డ్రగ్స్ మత్తులో ఉండి ఈ సమాధానం చెప్పాడు. వివరాలు వెల్లడించకపోవడంతో నిందితుడు ఫ్రాన్సిస్ ప్రయాణించిన మార్గంలో పోలీసులు వెతుకుతుండగా ఏడుస్తున్న బాలుడిని గుర్తించారు. దుస్తులు ధరించి ఉన్న బాలుడిపై పొదల చాటున గోతిలో సగం మట్టిపోసి ఉందని పోలీసులు తెలిపారు. బాలుడి జాడను వెతికి కనుగొనడానికి పోలీసులకు మొత్తం 9 గంటల సమయం పట్టింది. రాత్రిపూట చల్లని వాతావరణంలో బాలుడు గడిపాడని పోలీసులు వెల్లడించారు. బాలుడి ఆరోగ్యం బాగానే ఉందన్నారు.
 
నిందితుడు ఫ్రాన్సిస్‌ను పోలీసులు విచారించగా కంగుతినే సమాధానాలు చెప్పాడు. తన వాహనానికి ప్రమాదం జరిగిందని, బాలుడు అధికంగా బరువు ఉండడంతో వదిలేసి వచ్చానన్నాడు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, త్వరలోనే విచారణ జరగనుందని పోలీసులు తెలిపారు. అత్యంత దారుణమైన ఈ ఘటన అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.