at-least-seven-dead-as-fight-between-inmates

జైళ్లో దారుణం.. ఏడుగురు ఖైదీల మృతి

సౌత్ కరోలినా: అగ్రరాజ్యం అమెరికాలో విషాదకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సౌత్ కరోలినాలోని మాక్సిమమ్ సెక్యూరిటీ జైళ్లో పలువురు ఖైదీల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఖైదీలు పరస్పరం దాడిచేసుకున్నారు. ఈ దాడిలో ఏడుగురు ఖైదీలు మృతిచెందారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆదివారం రాత్రి 7:15 నిమిషాల సమయంలో మొదలైన ఈ ఘర్షణను అదుపు చేసేందుకు అధిక సమయం పట్టింది. సోమవారం ఉదయం 3 గంటల సమయానికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు దాదాపు 8 గంటల సమయం పట్టింది. ఖైదీల మధ్య జరిగిన ఈ ఘర్షణలో జైలుసిబ్బందికి ఎటువంటి హాని జరగలేదని జైలు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు విచారాన్ని వ్యక్తం చేశారు. పూర్తి వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు.