:: Welcome to NRI - Article ::

42 ఏళ్ల తర్వాత పుస్తకం తిరిగిచ్చాడు.. ఫైన్ కూడా కట్టేశాడు

న్యూయార్క్: వనిత, విత్తం, పుస్తకం... ఈ మూడు చాలా విలువైనవి. వీటిని ఇతరులకు ఇచ్చామంటే సక్రమంగా తిరిగి రావడం కష్టం. కానీ ఓ వ్యక్తి గ్రంథాలయం నుంచి తీసుకెళ్ళిన పుస్తకాన్ని 42 ఏళ్ళ తర్వాత తిరిగి ఇచ్చి రికార్డు సృష్టించాడు. ఆలస్యానికి చెల్లించిన రుసుము కూడా భారీగానే ఉంది. 

 
విలియం సిరెర్ రాసిన ‘‘ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది థర్డ్ రీచ్’’ పుస్తకాన్ని 1974 ఏప్రిల్‌లో తీసుకున్న వ్యక్తి మంగళవారం గ్రంథాలయంలో ప్రత్యక్షమయ్యాడు. ఆలస్యానికి చింతిస్తున్నానంటూ ఆ పుస్తకాన్ని ఇచ్చాడు. ఎంత కాలం ఆలస్యం జరిగిందో తెలుసుకునేందుకు గిల్డర్లాండ్ గ్రంథాలయాధికారి లెక్కలు కట్టారు. 15,531 రోజులు ఆలస్యమైనందుకు 3,106.20 డాలర్లు (2 లక్షల 7వేల 494 రూపాయల) రుసుము చెల్లించాలని కోరారు. ఆలస్యానికి కారణాన్ని వివరిస్తూ తాను విదేశాలకు వెళ్ళిపోయానని, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ పుస్తకాన్ని తిరిగి ఇచ్చేయాలని అనిపించిందన్నారు. లైబ్రరీ డైరెక్టర్ టిమ్ వీల్స్ మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు అరుదుగా తరచూ జరగవన్నారు. తన ముప్ఫయ్యేళ్ళ సర్వీసులో తనకు తెలిసినంత వరకు సుదీర్ఘ కాలం కస్టమర్ వద్ద ఉండిపోయిన పుస్తకం మళ్ళీ రావడం ఇదే మొదటిసారి అని తెలిపారు.