:: Welcome to NRI - Article ::

ప్రిన్సిపాల్‌ను చితకబాదిన న్యూయార్క్ విద్యార్థి

న్యూయార్క్: తల్లి.. తండ్రి.. గురువు.. దైవం.. అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాతి స్థానాన్ని గురువుకు ఇచ్చి భగవంతుడికి చివరి ప్రాధాన్యమిచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు గురువు స్థానమేంటో. అలాంటి గురువు పట్ల గౌరవంతో మెలగాల్సిన ఓ విద్యార్థి మితిమీరి ప్రవర్తించాడు. క్యాంపస్‌లో పాటలు వినడం మానేయమన్నందుకు ఏకంగా ప్రిన్సిపాల్‌నే చితకబాదాడు. న్యూయార్క్‌లోని మర్రీ బెర్జ్‌ట్రౌమ్ హైస్కూల్‌లో భాగమైన మన్హత్తన్ ఎర్లీ కాలేజ్ స్కూల్ ఆఫ్ అడ్వర్టైజింగ్‌లో ఈ ఘటన జరిగింది. ప్రిన్సిపాల్ మ్యాథ్యూ టోస్సామన్.. తన విధుల్లో భాగంగా సోమవారం క్యాంపస్‌లో తిరుగుతున్నారు. లూయిస్ పెంజో(18) అనే విద్యార్థి హెడ్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వినడాన్ని గమనించిన ఆయన.. అతడిని మందలించారు. హెడ్‌ఫోన్స్ తీసేసి, పాటలు వినడం ఆపేయాలని చెప్పాడు. వినకపోవడంతో వాటిని లాక్కునే ప్రయత్నం చేసిన ప్రిన్సిపాల్‌పై పెంజో దాడి చేశాడు. ముఖంపై గట్టిగా గుద్దాడు. దీంతో ముక్కు నుంచి తీవ్రంగా రక్తం వచ్చింది. మ్యాథ్యూను తీవ్రంగా గాయపరిచి పారిపోయిన పెంజోను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న మ్యాథ్యూ.. విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు విచారణలో ఉంది.