10-year-old-helps-a-baby-born-in-bathroom-

21 ఏళ్ల అమ్మాయికి డెలివరీ చేసిన 10 ఏళ్ల బాలిక

 వర్జీనియా: పదేళ్ల పాప ఓ యువతికి డెలివరీ చేసిందంటే నమ్ముతారా? పదేళ్ల పాపేంటీ? డెలివరీ చేయడమేంటి? అని ఆశ్చర్యమేస్తుంది కదా! వర్జీనియాలోని ఓ ఇంట్లో 21 ఏళ్ల అమ్మాయి నొప్పులతో బాధపడుతూ బాత్‌రూమ్‌లోనే ఓ శిశువుకు జన్మనిచ్చేసింది. ఆ సమయంలో ఇంట్లో 10 ఏళ్ల క్లోయి కారియన్ అనే బాలిక తప్ప మరెవ్వరూ లేరు. సోమవారం ఉదయం ఒంట్లో సరిగ్గా లేదని ఆ యువతి చెప్పడంతో క్లోయి తన తల్లికి ఫోన్ చేసి చెప్పింది. తను ఆఫీస్‌లో ఉన్నానని, వచ్చిన వెంటనే ఆసుపత్రికి వెళ్దాం అంటూ జవాబిచ్చింది. డెలివరీ చేసే సమయం వచ్చినట్టు ఆ యువతికి తెలియక బాత్‌రూమ్‌కు వెళ్లిన మహిళ అక్కడే బాబుకు జన్మనిచ్చేసింది. ఏం చేయాలో తెలియని స్థితిలో క్లోయి..క్లోయి అని అరిచింది.

 

వెంటనే అక్కడికి వచ్చిన క్లోయి.. ఏం జరిగింది ఆంటీ అని అడగడంతో తనకు బాబు పుట్టాడని చెప్పింది. తనను ఆటపట్టిస్తుందేమోనని క్లోయి నమ్మలేదు. వెంటనే తలుపు తెరవడంతో అక్కడి వాతావరణాన్ని చూసి క్లోయికి దిమ్మతిరిగిపోయింది. బాత్‌రూమ్ మొత్తం రక్తంతో నిండిపోవటం చూసి వెంటనే 911కు ఫోన్ చేసింది. అనంతరం తన తల్లి ఏప్రిల్ వెస్ట్‌కు కూడా ఫోన్ చేసి జరిగింది చెప్పింది. ఆమె కూడా నమ్మకపోవడంతో వెంటనే ఐఫోన్ తీసి ఫేస్‌టైమ్ నుంచి వీడియో కాల్ చేసింది. ఆమె వెంటనే 911కు ఫోన్ చేయమని సలహా ఇచ్చింది. శరీరం మొత్తాన్ని జాగ్రత్తగా తుడిచి 911కు ఫోన్ చేసి వారు చెప్పిన విధంగా శిశువు బొడ్డు తాడును కట్ చేసింది. యూట్యూబ్‌లో పిల్లల బొమ్మలను జాగ్రత్తగా ఎలా చూసుకోవాలో చూడటం వలన క్లోయి ఆ శిశువును కూడా బొమ్మలాగా జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకుంది. కొద్దిసేపటికి తన తల్లి, ఆ వెంటనే డాక్టర్లు వచ్చి తల్లి, బిడ్డలను దగ్గరలోని ఇనోవ ఫెయిర్‌ఫాక్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమమని డాక్టర్లు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రసవించిన యువతి తన ఇంట్లో వారికి దూరంగా ఉంటోందని, గర్భం వచ్చిందనే విషయం కూడా తన వాళ్ల దగ్గర దాచినట్టు తరువాత తెలిసింది. తన పదేళ్ల కూతురును చూసి గర్వపడుతున్నానని ఏప్రిల్ వెస్ట్ చెప్పింది. అంతేకాకుండా, క్లోయినే ఆ బాబుకు ఐసాక్ అని నామకరణం కూడా చేసింది.