:: Welcome to NRI - Article ::

బీర్ కోసం ప్రాణాలు తీశాడు

టెక్సాస్: మద్యం.. మత్తును కలిగిస్తుంది. ఆ మత్తు వివేచనను చంపేసి, మనిషిని మృగాన్ని చేస్తుంది. ఒక్కసారి మద్యానికి బానిసయిన వాళ్లు.. అది దొరకకపోతే ఎంత దారుణం చేయడానికయినా వెనకాడరు. అమెరికాలోని ఓ యువకుడు బీర్ కోసం ఏకంగా మనిషి ప్రాణాలనే తీశాడు. టెక్సాస్‌లోని అబీలినెకు చెందిన ఇమ్మానుయేల్ డియాజ్(18).. రేండేళ్ల క్రితం ఓ బీర్ కొనేందుకు వెళ్లాడు. వయసు 16 ఏళ్లు మాత్రమే ఉన్నందున తనకు మద్యాన్ని ఇవ్వరని తెలిసి..  షాపు బయట ఉన్న జెస్సీ కోర్టినెజ్(58) అనే వ్యక్తిని కొనివ్వమని అడిగాడు. తాను డబ్బు ఇస్తానని తనతోపాటు, తన స్నేహితులకు కూడా బీర్ కొనివ్వాల్సిందిగా కోరాడు. అయితే మైనర్లయినందున మద్యం తాగడం మంచిది కాదని చెబుతూ.. బీర్ కొనిచ్చేందుకు తిరస్కరించాడు. ఎంతబతిమాలినా కొనివ్వకపోవడంతో తుపాతీ తీసుకుని బెదిరించాడు. అయినా ఒప్పుకోకపోవడంతో కోపంతో రగిలిపోయి పిస్తోల్‌తో కోర్టినెజ్‌ను డియాజ్ కాల్చి చంపేశాడు. ఈ ఘటన 2014వ సంవత్సరం అక్టోబర్ 31న జరిగింది. సరిగ్గా రెండేళ్ల విచారణ అనంతరం అతడికి జీవిత ఖైదును విధిస్తూ అబీలినే కోర్టు మంగళవారం తుది తీర్పునిచ్చింది. అంతేకాక మృతుడి కుటుంబానికి 20 వేల డాలర్లను పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. 16 ఏళ్ల వయస్సులోనే కరుడుగట్టిన మృగంలా ప్రవర్తించాడని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.